రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
● ప్రత్యేక యాప్ ద్వారా నమోదు
● పథకాలకు ఇదే ఆధారం
● నమోదుకు నెలాఖరు వరకూ గడువు
కొత్తపేట: రైతులకు డిజిటల్ గుర్తింపు సంఖ్య (విశిష్ట గుర్తింపు సంఖ్య)ను ఇచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతులకు రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఫార్మర్స్ రిజిస్ట్రీ (ఎఫ్‌ఆర్) పోర్టల్లో రైతుగా నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించింది. వ్యవసాయ శాఖ నోడల్ డిపార్ట్‌మెంట్‌కు ఈ నమోదు బాధ్యలను అప్పగించారు. ఆ మేరకు గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) రైతులకు సమాచారం అందజేసి రైతు సేవా కేంద్రాల్లో వివరాలు రిజిస్టర్ చేస్తున్నారు. ఆ విధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన నమోదు ప్రక్రియ సాగుతోంది. విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రైతులకు అందవు. ప్రధానంగా పంటల బీమా, పీఎం కిసాన్ యోజన, పంట నష్ట పరిహారం, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు కూడా అందవు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలకు కూడా దూరమవ్వాల్సి ఉంటుంది.
నమోదు చేసుకోవాలి
● రైతులు రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్లి వారి పేరు, ఊరు, ఆధార్ నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్ వివరాలను అందించాలి.
● నమోదు ప్రక్రియ పూర్తయ్యాక వారికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు.
● రెతు సేవా కేంద్రాలకు వెళ్లలేకపోతే, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు అందించి ఓటీపీ చెప్పడం ద్వారా రైతుల వివరాలు నమోదు పూర్తి చేసుకోవచ్చు.
ఇలా భద్రపరచుకోవాలి
యాప్ ద్వారా నమోదు చేసుకున్న తరువాత అందించే గుర్తింపు సంఖ్య మెసేజ్ రూపంలో రైతు ఫోన్‌కు వస్తుంది. ఆ నంబర్‌ను అతను ఫోన్‌లోగానీ భద్రపరచుకోవడం గానీ, పాసు పుస్తకాలపై రాసి ఉంచిగాని గుర్తుంచుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుర్తింపు సంఖ్య మరచిపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్లి వివరాలు అందించి గుర్తింపు సంఖ్యను తెలుసుకోవచ్చు.
నమోదు చేసుకోవాలి
భూమి ఉన్న రైతులంతా ఈ నెలాఖరు లోపు ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవాలి. లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు కోల్పోతారు. సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రైతులు వివరాలు అందించాలి. భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉండాలి. లేకుంటే ఫార్మర్ రిజిస్ట్రీలో రైతు పేరు నమోదు కాదు. తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోని రైతులు వెంటనే రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి ఆన్‌లైన్ చేయించుకుని ఎఫ్‌ఆర్‌లో నమోదు కావాలి.
– ఎం.వెంకట రామారావు, ఏడీఏ, వ్యవసాయ సబ్ డివిజన్, కొత్తపేట
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నమోదు
జిల్లా పీఎం కిసాన్ ఎఫ్‌ఆర్‌లో రిజిస్ట్రీ నమోదు
లబ్ధిదారులు అయిన వారు శాతం
డా బీఆర్‌ఏ కోనసీమ 1,27,062 20,825 9.35
తూర్పుగోదావరి 1,05,053 27,172 12.8
కాకినాడ 1,34,628 40,689 17.59
రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment