బలిపీఠంపై పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలను
అభివృద్ధి చేయడమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఏడాది అన్ని గ్రామాల్లోను మోడరన్, ఫౌండేషన్ స్కూల్స్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది.
– ఎస్‌కే సలీంబాషా,
జిల్లా విద్యాశాఖాఽధికారి, అమలాపురం
● గ్రామానికి ఒకే పాఠశాల
ఉండే విధంగా కార్యాచరణ
● ప్రతిపాదనలు సిద్ధం చేసిన
రెవెన్యూ విద్యాశాఖలు
● విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం
చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
● మూసివేత దిశగా నాడు–నేడులో అభివృద్ధి చేసిన పాఠశాలలు
ఆలమూరు: రాష్ట్రంలో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిద్రావస్థలోకి చేర్చే విధంగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఫౌండేషన్, మోడరన్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు అంటూ భవిష్యత్‌లో ప్రతి గ్రామంలోను ఒకే పాఠశాల ఉండే విధంగా విలీన ప్రక్రియను వేగవంతం చేసింది. దీనివల్ల రూ.కోట్ల వ్యయంతో నాడు–నేడు పథకంలో అభివృద్ధి చేసిన అనేక ప్రాథమిక పాఠశాలలు క్రమేపీ మూతబడే ప్రమాదం ఏర్పడింది. విద్యావ్యవస్థ అభ్యున్నతికి, విద్యాహక్కు చట్టం పటిష్టతకు, విద్యార్థుల ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం జారీ చేసిన 117 జీవోను ఉపసంహరించుకుంది. ఆ జీఓలో రూపొందించిన నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ విద్యా విధానాన్ని అపహాస్యం చేస్తోంది. రాష్ట్రంలో మెరుగైన విద్యా విధానాన్ని అమలు చేస్తామంటూ ప్రస్తుతం అమలవుతున్న విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా చర్యలు ప్రారంభించింది. ఒకే గ్రామంలో అనేక పాఠశాలలున్నా అందులోని 3,4,5 తరగతి విద్యార్థులను మాత్రం త్వరలో ఏర్పాటు చేయబోయే మోడరన్ ప్రైమరీ స్కూల్స్‌కు తరలించనున్నారు. దీంతో ఆ పాఠశాల ఏకోపాధ్యాయుడి పాఠశాలగా రూపాంతరం చెంది కేవలం 1,2 తరగతులు మాత్రమే నిర్వహించే అవకాశం ఉత్పన్నమవుతుంది. దీంతో ఆ ఏకోపాధ్యాయ పాఠశాలల పట్ల ఆసక్తి తగ్గిపోయి తమ పిల్లలను హైస్కూల్ స్థాయి వరకూ బోధన ఉండే ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించవలసిన అగత్యం తల్లిదండ్రులకు ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులు లేక ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఏడాది ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి మోడరన్ ప్రైమరీ స్కూల్స్ అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. దీనివల్ల విలీనం అయ్యే పాఠశాలల్లో కూడా 1,2 తరగతుల విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి నెలకొంటుందని ప్రజలు భావిస్తున్నారు.
350 పాఠశాలలు మూతపడే అవకాశం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో జిల్లా విద్యాశాఖ 87 క్లస్టర్లుగా విభజించగా అందులో 1.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,582 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 1,275 మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 307 జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన విద్యావిధానం వల్ల జిల్లాలో ఉన్న 1,275 పాఠశాలల్లో మండలానికి 15 నుంచి 20 చొప్పున దాదాపుగా 350 పాఠశాలలు దశల వారీగా మూతపడే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాల వ్యవస్థను బలోపేతం చేసేందుకని విద్యాశాఖ చెబుతున్నా వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని విద్యాశాఖ నిపుణులు చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన 117 జీవో ద్వారా ఒక పాఠశాల కూడా మూతపడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ జీఓను రద్దు చేసి విద్యాశాఖలో అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకోవడంతో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలల కొనసాగింపుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
మోడరన్ స్కూల్స్ ఏర్పాటుకు కసరత్తు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈవిద్యా సంవత్సరం నుంచి కిలోమీటరు లోపు పరిధిలో ఒక మోడరన్ స్కూల్ ఏర్పాటుకు కసరత్తు పూర్తయ్యింది. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల పరిధిలోని ఆర్‌డీఓల పర్యవేక్షణలో తహసీల్దార్, ఎంఈఓల బృందం ఇప్పటికే విలీనం చేయబోయే పాఠశాలలను గుర్తించి నివేదికను రూపొందించింది. తొలి దశలో 25 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న 3,4,5 తరగతుల విద్యార్థులందరిని సమీప పాఠశాలల్లో విలీనం చేస్తారు. తద్వారా ఒక గ్రామంలో మోడరన్ ప్రైమరీ స్కూల్‌గా పిలిచే ఒకే పాఠశాల ఉంటుంది. ఆ గ్రామంలో లేదా కిలోమీటరు పరిధి లోపు ఉన్న గ్రామాల్లోని పాఠశాలలు సమీపంలో ఏర్పాటు చేయబోయే మోడరన్ స్కూల్స్‌లో విలీనం చేస్తారు. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు ప్రతి మండలంలోను మిగులు దశకు చేరుకునే అవకాశం ఉంది. ఆ ప్రభావం పరోక్షంగా డీఎస్సీసై పడి ఉపాధ్యాయుల భర్తీ సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఉన్నతమైన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు గత ప్రభుత్వం 3,4,5 తరగతులను సమీప జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే రాద్ధాంతం చేసిన నాటి ప్రతిపక్ష కూటమి నేతలు ఇప్పుడు వేలాది పాఠశాలలను మూసి వేసే దిశగా చర్యలు తీసుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
విద్యాహక్కు చట్టానికి తూట్లు
రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా పనిచేస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయున్ని నియమించవలసి ఉంది. ప్రభుత్వం అమలు చేయనున్న నూతన విద్యా విధానంలో 30 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన 117 జీవో ఉపసంహరణ సమయంలో 3,4,5 తరగతులను మళ్లీ ప్రాథమిక పాఠశాలల్లోనే విలీనం చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రభుత్వ పాఠశాల కూడా మూతబడని వైనాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఒక గ్రామంలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలున్నాయనే సంబంధం లేకుండా భవిష్యత్‌లో మాత్రం ఒక మోడరన్ స్కూల్ మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే విధానం వల్ల నిబంధనలన్ని అస్తవ్యస్తంగా మారడంతో మండల ప్రజా పరిషత్ పాఠశాలలపై విలీనం అనే కత్తి వేలాడుతుంది.
ఆలమూరు మండలంలో ఇలా..
ఆలమూరు మండలంలో 18 గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 43 ఉన్నాయి. దాదాపు 21 పాఠశాలలు 1,2 తరగతుల విద్యార్థులు లేక దశలవారీగా మూతబడే అవకాశం ఉంది. పినపళ్ల, పెదపళ్ల, సంధిపూడి గ్రామాల పాఠశాలల్లోని విద్యార్థులందరిని సంధిపూడిలో ఏర్పాటు చేయబోయే మోడల్ స్కూల్‌లో విలీనం చేయబోతున్నట్లు తెలియవచ్చింది. దీనివల్ల ఆ మూడు గ్రామాల్లో దాదాపు నాలుగు పాఠశాలల్లో 1,2 తరగతుల్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు మాత్రమే మిగిలే అవకాశం ఉందని తెలుస్తోంది.
బలిపీఠంపై పాఠశాలలు
బలిపీఠంపై పాఠశాలలు
Comments
Please login to add a commentAdd a comment