కనకధార కురవాలని!
అన్నవరం: అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న అన్నవరం సత్యదేవునిపై ఎందువల్లనో కానీ కొంత కాలం నుంచి లక్ష్మీ కటాక్ష వీక్షణాలు పూర్తి స్థాయిలో ప్రసరించడం లేదు. దీంతో దేవస్థానం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అన్నవరం దేవస్థానం ఆర్థిక ఇబ్బందులపై ‘సాక్షి’ గత డిసెంబర్ 30న ‘లక్ష్మీ.. రావా.. రత్నగిరికి’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కార్యనిర్వహణాధికారి (ఈఓ) వీర్ల సుబ్బారావు దేవస్థానం ఆదాయం పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను, సిబ్బందిని కోరారు. దీనిపై ‘ఆదాయ మార్గాలు చెప్పండి’ శీర్షికన ‘సాక్షి’ జనవరి 28న వార్త ప్రచురించింది. కాగా, ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు అనే రీతిలో ఉన్న దేవస్థానాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి, పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు రూపకల్పన చేశారు.
గత ఏడాదితో పోల్చితే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఖర్చులు తగ్గించి, ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. మిగులు కూడా స్వల్పంగానే ఉంది. ఈ ప్రతిపాదనలను దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించారు. గత బడ్జెట్‌లో రూ.కోటి మిగులుతుందని అంచనా వేయగా.. అదికాస్తా తలకిందులైంది. పైగా, అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదించాల్సి వచ్చింది. ఈసారి మాత్రం కాస్తయినా మిగులు చూపాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు ఏదైనా అద్భుతం జరిగి, భక్తుల నుంచి దండిగా విరాళాలు, కానుకలు వస్తే మాత్రం దేవస్థానం ఆర్థికంగా ఒడ్డున పడుతుంది. ఆ మేరకు కనకధార కురిపించాలని సిరులమాతల్లి శ్రీమహాలక్ష్మిని అధికారులు వేడుకుంటున్నారు.
మిగులు స్వల్పమే..
మొత్తం రూ.162.55 కోట్లతో 2025–26 బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో వ్యయం రూ.162.13 కోట్లుగా పేర్కొన్నారు. తద్వారా రూ.42 లక్షలు మాత్రమే మిగులు చూపించారు. గత ఏడాది రూ.160 కోట్లతో బడ్జెట్ రూపొందించగా, వ్యయం రూ.159 కోట్లు, మిగులు రూ.కోటిగా అంచనా వేశారు. అయితే, అయితే అంచనాలకు మించి వ్యయం అవడంతో అదనంగా రూ.10 కోట్లు కేటాయించాలని కోరుతూ దేవదాయ శాఖకు సప్లిమెంటరీ బడ్జెట్ ప్రతిపాదించారు. ఇది దేవదాయ శాఖ కమిషనర్ పరిశీలనలో ఉంది.
నిత్యాన్నదాన ట్రస్టుకు..
రత్నగిరిపై సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్టుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై రూ.12 కోట్ల వడ్డీ వచ్చే అవకాశం ఉంది. అయితే, భక్తుల భోజనాల ఖర్చు, ఆ విభాగం సిబ్బంది జీతభత్యాలకు చెల్లింపులు అంతే మొత్తంలో అవుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు.
భక్తుల సేవల్లో కుదింపు లేదు
నూతన బడ్జెట్‌లో కొన్ని వ్య యాల్లో కోత విధించాం. అ యినప్పటికీ భక్తులకు అందించే సేవల్లో మాత్రం ఎటు వంటి కోతలూ విధించలే దు. ఆ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. ఇంజినీరింగ్ నిర్మాణాల విషయంలో కూడా ముందుగా నిర్ణయించినవన్నీ కొనసాగుతాయి.
– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
2025–26 బడ్జెట్ ప్రతిపాదనలు (రూ.కోట్లలో)
ఆదాయం
షాపుల లీజులు, లైసెన్సుల ఆదాయం 14.50
సత్రాల అద్దెలు 15.00
హుండీల కానుకలు 20.00
ప్రసాదం విక్రయాలు 40.00
వ్రతాల ఆదాయం 50.00
డిపాజిట్లపై వడ్డీ 6.00
ఇతర ఆదాయ వనరుల ద్వారా 17.00
వ్యయం
సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు 45.00
ముడిసరకుల కొనుగోళ్లు 35.00
ఉత్సవాల ఖర్చు 30.00
పారిశుధ్య విభాగం 8.00
ఇంజినీరింగ్ విభాగం 5.00
ఎలక్ట్రికల్ విభాగం 1.00
సీజీఎఫ్, ఆడిట్ ఫీజు వంటి చెల్లింపులు 25.00
ఇతర చెల్లింపులు 13.00
వచ్చే సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన
రూ.162.55 కోట్లతో ప్రతిపాదనలు
ఆర్థిక ఇబ్బందుల ప్రభావంతో
ఖర్చుల్లో భారీగా కోత
వ్యయం అంచనా రూ.162.13 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment