నేటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
అమలాపురం రూరల్: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 17తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం), మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు నిర్వహించడం లేదని తెలిపారు. కేవలం గ్రామ సచివాలయాలలో మాత్రమే అర్జీదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకొనవచ్చునని స్పష్టం చేశారు.
పేరూరులో
22 అంగుళాల దూడ
అమలాపురం రూరల్: 22 అంగుళాల ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమలాపురం ముండలం పేరూరుకు చెందిన పితాని రాధాకృష్ణకు చెందిన ఆవుకు ఇటీవల ఈ దూడ పుట్టింది. బుడి బుడి అడుగులతో ముద్దొస్తున్న ఈ పుంగనూరు గిత్తను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు.
రైతు విశిష్ట గుర్తింపు
సంఖ్యతో మేలు
అమలాపురం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్తగా భూ ఆధార్ ఫార్మర్ రిజిస్ట్రీ అనే కార్యక్రమం ప్రారంభించామని జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ద్వారా పీఎం కిసాన్ చెల్లింపు పెట్టుబడి సాయం, పంటల బీమా, దిగుబడుల విక్రయాలు, రాయితీపై సూక్ష్మ పోషకాలు, అన్నదాత సుఖీభవ రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, పంట రుణాలు, వడ్డీ రాయితీ, సూక్ష్మ సేద్యంపై రాయితీ వంటి ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. ఈ భూ ఆధార్ ఉన్నవారికి మాత్రమే పీఎం కిసాన్ వంటి పథకాలు వర్తింపజేస్తారని, భూమి ఉన్న ప్రతి రైతు ఆధార్ నంబర్, ఆధార్ అనుసంధానిత ఫోన్ నంబరు, కొత్త పట్టాదార్ పాస్ బుక్ తీసుకుని గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఫిబ్రవరి 25 తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,65,000 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 48 వేల మంది పోర్టల్‌లో నమోదు చేసుకున్నారన్నారు.
లోవలో భక్తుల రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, ప్రసాదం, లడ్డూల విక్రయం ద్వారా రూ.1,10,115, పూజా టికెట్లకు రూ.44,930, కేశఖండన శాలకు రూ.9,600, వాహన పూజలకు రూ.5,100, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.21,910, విరాళాలు రూ.48,108 కలిపి మొత్తం రూ.2,39,763 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు.
రత్నగిరిపై 26న సరస్వతీ పూజ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఈ నెల 26వ తేదీన సరస్వతీ పూజ నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఆ రోజు ఉదయం 9 గంటలకు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పండితులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం విద్యార్థులు ఉత్తమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని ప్రార్థిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో అన్నవరం, చుట్టుపక్కల విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని అధికారులు కోరారు.
నేటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
Comments
Please login to add a commentAdd a comment