చమురు సంపదపై హక్కుకు ఉద్యమం
23న కాకినాడలో సదస్సు
కాకినాడ సిటీ: చమురు, సహజ వాయువు, ఖనిజాలు, ప్రకృతి వనరులపై రాష్ట్ర ప్రజల హక్కును కాపాడుకునేందుకు ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఈ నెల 23న కాకినాడలో నిర్వహిస్తున్న సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ ఎస్‌టీయూ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సముద్ర తీరంలోని చమురు, సహజవాయు నిక్షేపాలు మనకే దక్కాలని, దీనికోసం, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని అన్నారు. సహజ వనరుల ఉత్పత్తిలో ఆ రాష్ట్రానికి 50 శాతం కేటాయించాలని 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పిందన్నారు. దీనిపై రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాలు చేసినా, గ్యాస్ కేటాయింపులు, ఆదాయంలో సగం పొందలేకపోయామని చెప్పారు. కువైట్, మన దేశంలోని ముంబై కన్నా గోదావరి బేసిన్‌లోనే సహజ వాయు నిల్వలు అధికంగా ఉన్నాయని ముప్పాళ్ల తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ, మన తీరంలోని సహజ వనరులను పాలకులు బడా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కోనసీమ జిల్లా కార్యదర్శి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదస్సు కరపత్రాలను నాయకులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment