![పండ్ల](/styles/webp/s3/article_images/2025/02/18/17rjc161-270033_mr-1739818079-0.jpg.webp?itok=22pWRxA6)
పండ్ల మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
రాజానగరం: మండలంలోని దివాన్‌చెరువు పండ్ల మార్కెట్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఏఎస్‌ఆర్ ఫ్రూట్స్ గొడౌన్ నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించి, క్షణాలలో ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఆ సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు సైతం కంగారు పడ్డారు. ఇక మార్కెట్‌లో ఉన్నవారు చాలామంది ప్రాణభయంతో అటుఇటు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి కారణం స్పష్టంగా తెలియడంలేదు. గొడౌన్ వెనుక భాగంలో చెత్తను పోగేసి మంట పెట్టడంతో ప్రమాదం జరిగిందని కొందరు, షార్ట్ సర్క్యూట్ వల్ల అని మరికొందరు చెబుతున్నాయి. కాగా విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం అగ్నిమాపక దళాధికారి మార్టిన్ లూథర్‌కింగ్ ఆధ్వర్యంలో ఆర్యాపురం, ఇన్నీసుపేట, కొవ్వూరుల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గొడౌన్‌లో నిల్వ చేసిన యాపిల్స్, ఫైనాపిల్స్, ఖర్బూజా, దానిమ్మ, డ్రాగన్ వంటి వివిధ రకాల పండ్లు మంటలకు ఆహుతయ్యాయి. గొడౌన్ వద్ద పార్కు చేసిన రెండు పల్సర్ బైకులు కూడా కాలిపోయాయి. ఈ ప్రమాదం గురించి గొడౌన్ యజమాని ఆరాధ్యుల శ్రీనివాసరావు (ఏఎస్‌ఆర్) మాట్లాడుతూ రూ. 10 లక్షలతో కొనుగోలు చేసిన వివిధ రకాల పండ్లను గొడౌన్‌లో స్టోర్ చేశామని, అవి ఈ మంటలకు కాలిపోయాయన్నారు. అలాగే 15 వేల విలువైన ప్లాస్టిక్ ట్రేలు ఆనవాళ్లు లేకుండా బూడిదయ్యాయన్నారు. ఈ కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫ మంటలకు ఆహుతైన గొడౌన్
ఫ సుమారు రూ.50 లక్షల నష్టం
![పండ్ల మార్కెట్‌లో అగ్ని ప్రమాదం1](/gallery_images/2025/02/18/17rjc162-270033_mr-1739818079-1.jpg)
పండ్ల మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment