
కూ... చిక్కుచిక్కు
● కోనసీమ రైలుకు మరోసారి ‘రెడ్ సిగ్నల్’
● భూ సేకరణకు అవాంతరాలు
● ఇప్పుడు, గతంలో సేకరించిన
భూమిపై వివాదం
● ఇప్పటి ధరల ప్రకారం పరిహారం
ఇవ్వాలంటున్న రైతులు
సాక్షి, అమలాపురం: చుక్‌చుక్ బండి... కూత లేదండి. అడుగడుగునా ఆటంకమండి.. అన్నట్టుంది. కోనసీమ రైల్వే లైన్ పరిస్థితి. దీని నిర్మాణానికి ఓ అడుగు ముందుకు పడుతుంటే.. మూడు అడుగులు వెనకకు వెళ్తున్నాయి. దశాబ్దాలుగా నత్తనడకన సాగుతూ వస్తున్న కోనసీమ రైల్వే లైన్‌కు తాజాగా మరో అవాంతరం ఏర్పడింది. కొత్తగా చేపట్టిన భూ సేకరణకు అడుగడుగునా అడ్డంకులు రాగా.. ఇప్పుడు గతంలో సేకరించిన భూములపై సైతం వివాదాలు నెలకొనడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా నరసాపురం వరకూ నిర్మించాల్సిన రైల్వే ప్రాజెక్ట్ నత్తను తలపిస్తోంది. కోటిపల్లి వరకూ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయినా అది కూడా కొన్నేళ్లుగా వినియోగంలో లేదు. కోటిపల్లి నుంచి అమలాపురం మీదుగా నరసాపురం వరకూ నిర్మించాల్సిన రైల్వే లైన్‌కు తొలుత నిధుల కొరత పట్టిపీడించింది. 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుండడంతో పనులు వేగం అందుకున్నాయి. గోదావరి నదీపాయలపై మూడు చోట్ల వంతెనల నిర్మాణాలకు సంబంధించి పిల్లర్లు పూర్తయ్యాయి. వీటిపై గెడ్డర్లు, ట్రాక్ నిర్మించాల్సి ఉంది. వైనతేయ వద్ద ఇటు బోడసకుర్రు, అటు పాశర్లపూడి వైపు ఏటిగట్టుకు లోపల (నదిలో పిల్లర్లు) పూర్తవడంతో, ఏటిగట్టుకు బయట ప్రాంతంలో ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. గౌతమీ నదిపై పిల్లర్ల నిర్మాణాలు పూర్తి కాగా, వాటిపై గెడ్డర్ల నిర్మాణాలకు గత ఏడాది ఫిబ్రవరిలోనే రూ.275 కోట్లకు టెండర్లు ఖరారైనా ఇంకా పనులు మొదలు కాలేదు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టెండర్లు ఖరారైన 28 నెలలకు పనులు పూర్తి కావాల్సి ఉంది.
భూ సేకరణకు ఆటంకాలు
మొన్నటి వరకూ నిధుల కొరత.. ఇప్పుడు భూసేకరణ ఈ ప్రాజెక్టుకు అవరోధంగా మారింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర నిర్మించే రైల్వే ట్రాక్‌కు పాత అలైన్‌మెంట్ ప్రకారం 908 ఎకరాల భూమి అవసరం. ఇందులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 791 ఎకరాల భూమి సేకరించాలి. కొత్త అలైన్‌మెంట్ ప్రకారం ఇది స్వల్పంగా పెరగనుంది. కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్‌కు 2001లో మొదటి అలైన్‌మెంట్ వచ్చింది. 2003లోనే కోటిపల్లి నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి వరకూ భూసేకరణ జరిగింది. తొలి అలైన్‌మెంట్ ప్రకారం భట్నవిల్లిలో రైల్వే స్టేషన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇక్కడ భూమి సేకరించారు. అయితే ఇక్కడ నాడు భూములు ఇచ్చిన భట్నవిల్లి రైతులు ఇప్పుడు ఎదురు తిరిగారు. భూములు ఇచ్చినా పొజీషన్ తీసుకోనందున ఇప్పుడిస్తున్న తరహాలో పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ 40 ఎకరాలకు సంబంధించి 24 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు రైల్వే శాఖ కోర్టుకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. అయితే ఈ భూములకు పరిహారం చెల్లించడం, రైల్వే శాఖకు అప్పగించామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది భట్నవిల్లి నుంచి జిల్లాలోని దిండి వరకూ కొత్తగా చేపట్టిన భూ సేకరణకు సైతం అవాంతరాలు వీడడం లేదు. గతంలో రైల్వే శాఖ ఇచ్చిన అలైన్‌మెంట్‌ను ఆనుకుని 216 జాతీయ రహదారి వెళ్లింది. 2014–19 మధ్యలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే లైన్‌కు ఇబ్బంది లేకుండా జాతీయ రహదారి 216లో భాగంగా అమలాపురం బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇలా చేయకపోవడంతో ఇప్పుడు కొత్త అలైన్‌మెంట్ ఇచ్చి అందుకు అనుగుణంగా అమలాపురం మండలం భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు వెళ్లనుంది. ఈ అలైన్‌మెంట్‌కు సైతం రైతులు తొలి నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైల్వే లైన్ తమ గ్రామాల మీదుగా వెళ్లేందుకు అంగీకరించమని, అలైన్‌మెంట్ మార్పు చేయాలని ఆ ప్రాంత వాసులు పలు సందర్భాల్లో నిరసనలు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌కు వారు వినతిపత్రాలు అందజేశారు. మరి కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇలా భూ సేకరణ అంశాలు కోర్టుల వరకూ వెళ్లడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త ఆలైన్‌మెంట్‌కు సంబంధించి రెవెన్యూ శాఖ చేపట్టిన సర్వే దాదాపు పూర్తయ్యింది. కొత్త అలైన్‌మెంట్‌లో అడ్డుగా వచ్చే రోడ్లు, పంట కాలువలు, విద్యుత్ లైన్‌లు, స్తంభాలు, ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల పైప్‌లైన్లు, నివాసాలు, ఆర్‌డబ్ల్యూఎస్ మంచినీటి పథకం పైప్‌లైన్లను ఈ సర్వేలో గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవాంతరాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

కూ... చిక్కుచిక్కు
Comments
Please login to add a commentAdd a comment