
ఇలా అయితే కష్టమే..
సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు కూటమికి ఎదురీత అయ్యింది. ఈ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడక అనుకున్న ఆ నేతలకు ఎన్నికల ప్రచారం మొదలైన తరువాత తత్వం బోధపడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకు ప్రధాన అవరోధంగా మారింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. మొత్తం 3,15,261 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి ప్రచారం మొదలయ్యే వరకూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితులకు.. ప్రచారం మొదలైన రోజులు గడుస్తున్న తరువాత క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు పొంతనలేదు. కూటమి అభ్యర్థికి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ప్రచారం జోరుగా సాగుతున్నా మొదట్లో ఫలితాలు అనుకున్నంత సులువు కాదని.. ఇప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా ఆశ్చర్యం లేదని అత్యధికుల అభిప్రాయం. ప్రోగ్రెసివ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు నుంచి గట్టి పోటీ ఎదురువుతోంది. పీడీఎఫ్ కార్యకర్తలు చాపకింద నీరులా ప్రచారం చేసుకు పోతున్నారు. స్వతంత్రులు సైతం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం
ఆ ఓట్లకు గండి..
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలన్నీ కూటమి పార్టీకి చెందినవారే గెలిచారు. ఇటీవల పెద్ద ఎత్తున కొత్త ఓటర్లను చేర్పించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఎన్నిక లాంఛనం కావాలి. కానీ కూటమి అభ్యర్థికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇది గుర్తించిన టీడీపీ తమ అభ్యర్థికి మద్దతుగా ప్రచార జోరు పెంచాలని కార్యకర్తలకు సూచించింది. వారిపై నమ్మకం లేక ప్రతి ఓటరును కలిసి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు మొక్కబడిగా చేస్తున్నారే తప్ప ఓటుగా మలుచుకోలేకపోతున్నారు. ‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ వర్గాన్ని సంతృప్తి పరచలేదు. ముఖ్యంగా నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఓట్లు ఉన్న రైతులు, మహిళలు, వెనుబడిన వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడం మా అభ్యర్థికి మైనస్ అవుతోంది’ అని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ‘సూపర్ సిక్స్‌ను అటకెక్కించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన డీఎస్సీని వాయిదాలు వేయడం, పెరిగిన నిత్యావసర వస్తువులు, విద్యుత్ చార్జీలు’ ఇవన్నీ కూటమి అభ్యర్థికి ఎన్నికల్లో పుట్టి ముంచనున్నాయి. దీనికితోడు గోదావరి జిల్లాలో ఉండే సామాజిక సమీకరణలు సైతం కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా మారనున్నాయి. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా నామినేటెడ్ పదవులు పంపిణీ చేయకపోవడం టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో ఆ ప్రభావం ప్రచారంపై పడుతోంది.
వ్యతిరేకంగా ఉందనే భయం
పరిస్థితి చేయి దాటుతోందని గుర్తించిన చంద్రబాబు ఆదివారం పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులతో సుమారు గంటన్నర పాటు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాటల్లో గెలుపు దీమా కనిపించలేదు సరికదా, ఇంత నిర్లిప్తంగా ఉంటే ఫలితం వ్యతిరేకంగా ఉంటుందనే భయం కనిపించింది. ‘మొన్నటి ఎన్నికల ఫలితాలే ప్రతీసారి రావు. మీరు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నట్టు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏమీ పట్టించుకోవడం లేదు. మీకు సీరియస్‌నెస్ అర్థం కావడం లేదు. మీ జిల్లాలో ప్రతి ఓటు కీలకంగా మారింది. పోలింగ్ జాగ్రత్తగా చేయించుకోవాల్సిందే’ అని చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురంలో పరిస్థితి అనుకూలంగా లేదని బాబు చెప్పుకొచ్చారు. మరోవైపు రాజమహేంద్రవరంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో ఆ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేసి గెలుపును సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. కూటమి నేతలు హైరానా చూస్తుంటే ఎన్నికలలో గెలుపు సులువు కాదనే తత్వం బోధపడిందని ఓటర్లు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో
వెనకబాటు
కూటమి అభ్యర్థి ఎదురీత
జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు
చంద్రబాబు క్లాస్
Comments
Please login to add a commentAdd a comment