రాజకీయ ప్రకటనలకు ఆమోదం తప్పనిసరి
అమలాపురం రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానికి మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మోనటరింగ్ కమిటీ (ఎంసీఎంిసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు ఎంసీఎంసీ కమిటీని నియమించామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ప్రకటనలపై ఈసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ఎంసీఎంసీ మోనటరింగ్ సెల్‌ను ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశామని వివరించారు.
సీహెచ్‌సీని పరిశీలించిన
కేంద్ర బృందం
పి.గన్నవరం: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహకానికి ఎంపిక చేసేందుకు పి.గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్‌క్యూఏఎస్ (జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు) బృందం సోమవారం పరిశీలించింది. డాక్టర్ ఎలిజబెత్ మిలీవర్గీస్, డాక్టర్ మిర్యాన్ వి.వాషింగ్టన్‌లు ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వారికి ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను డిప్యూటీ సివిల్ సర్జన్ యు.రాఘవేంద్రరావు వివరించారు. రోగులకు నాణ్యమైన సేవలను వారు పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, ఓపీ విభాగం, పేషెంట్ల వార్డులు, పారిశుధ్యం, మెడికల్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని బృంద సభ్యులు తెలిపారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి అంగన్‌వాడీ
కార్యకర్తలకు శిక్షణ
రాయవరం: జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు మంగళవారం నుంచి ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం జ్ఞానజ్యోతిలో భాగంగా జరుగనుంది. పీపీ–1, 2 బలోపేతం చేసే చర్యల్లో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు మండల స్థాయిలో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,726 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో పనిచేసే అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చే శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ, అలాగే 22, 24, 25 తేదీల్లో మండల స్థాయిలో ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో అంగన్‌వాడీ కార్యకర్తలకు తర్ఫీదు ఇస్తారు. ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీలో ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పటికే 1వ తరగతి బోధించే 1,268 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా, ఇప్పుడు అంగన్‌వాడీ టీచర్లకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్సులో భాగంగా తరగతులు బోధిస్తున్నారు. మండల స్థాయిలో ఎంఈఓలు కోర్సు డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమాలను సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ పీఓలు పర్యవేక్షించనున్నారు.
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
గోకవరం: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని వీర్లంకపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 2025–26 సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎంయూవీ రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఇంగ్లిషు మీడియం ప్రవేశాలకు 80 సీట్లు, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు, బైపీసీ గ్రూపులో40 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో మార్చి 3 నాటికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment