
తునిలో గూండాగిరీ
ప్రజాస్వామ్యంపై తుని పట్టణంలో కొద్ది రోజులుగా క్రూర పరిహాసం జరుగుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్‌ను కూడా గెలిపించుకోలేని స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న టీడీపీ.. ఆ పురపాలికలో చిన్నపాటి ‘ఏలిక’ పదవి కోసం అడ్డమైన దారులూ తొక్కుతోంది. ప్రజాస్వామిక విలువలను, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనలను అడ్డగోలుగా కాలరాసి.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గూండాగిరీకి తెగబడుతోంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లపై దాడులకు దిగుతూ, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాగైనా మున్సిపాలిటీలో తిష్ట వేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నాలు సాగిస్తోంది. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అధికార మదానికి తల వంచి, చేష్టలుడిగి చూస్తూండటం ప్రజాస్వామిక వాదులను నివ్వెరపరుస్తోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తునిలో తెలుగుదేశం పార్టీ గుండాగిరీ రాజ్యమేలుతోంది. పోలీసు సహా అధికార వ్యవస్థలన్నీ ఆ పార్టీ నేతలకు జీహుజూర్ అంటూ, వారు చెప్పినట్టే నడుచుకుంటున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతలు తమ చెప్పుచేతల్లో ఉంచుకుని, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేయించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో టీడీపీ అరాచకవాదులు మంగళవారం మరోసారి దౌర్జన్యకాండకు తెగబడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగోసారి కూడా వాయిదా వేయించారు.
కౌన్సిలర్లపై మూకుమ్మడి దాడి
తుని మున్సిపల్ కౌన్సిల్ వేదికగా జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు, టీడీపీ నేతలు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా డ్రామాను రక్తి కట్టించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పోలీసు రక్షణ బాధ్యతలను జిల్లా అదనపు ఎస్పీ ఎంవీజే భాస్కరరావు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దేవరాజ్ మనీష్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజుకు అప్పజెప్పారు. తద్వారా కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనేలా రక్షణ కల్పిస్తామని జిల్లా యంత్రాంగం చెప్పింది. ఆ భరోసాతో కౌన్సిల్ హాలుకు ఓటింగ్‌కు బయలుదేరిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై టీడీపీ శ్రేణులు తమ కుట్రలో భాగంగా మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీనికి పోలీసులు కూడా సహకరించారనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ హాలుకు 200 మీటర్ల దూరాన పోస్టాఫీసు వీధిలో ఉన్న పిఠాపురం డాక్టర్ ఆస్పత్రి దాటి ముందుకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ, టీడీపీ శ్రేణులను మాత్రం కౌన్సిల్ హాలు దగ్గర వరకూ అనుమతించి, ‘పచ్చ’పాత ధోరణి చూపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి మరీ ‘పచ్చ’ గూండాలు.. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల పైకి దూసుకుపోతున్నా పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నిలువరించిన దాఖలాలు కనిపించ లేదు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పిస్తామన్న జిల్లా యంత్రాంగం మాటలు చివరకు గాలిలో కలసిపోయాయి.
‘చలో తుని’ అడ్డగింపు
తునిలో అధికార టీడీపీ అరాచకాన్ని నిరసిస్తూ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇచ్చిన ‘చలో తుని’ పిలుపునకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందించాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు భారీ సంఖ్యలో తుని తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. సోమవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నేతలకు 41 నోటీసులు జారీ చేసి, తెల్లారేసరికి హౌస్ అరెస్టులు చేశారు. నియోజకవర్గాల నుంచి తుని బయలుదేరిన నేతలను మార్గం మధ్యలో అడ్డుకున్నారు.
ప్రజాస్వామ్యంపై క్రూర పరిహాసం
మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మరోసారి అడ్డుకున్న టీడీపీ
పోలీసుల సమక్షంలోనే
రెచ్చిపోయిన ‘పచ్చ’ గూండాలు
కౌన్సిలర్లపై దాడికి యత్నం
భయంతో పరుగు తీసిన కౌన్సిలర్లు
కోరం లేక నాలుగోసారీ ఎన్నిక వాయిదా

తునిలో గూండాగిరీ

తునిలో గూండాగిరీ
Comments
Please login to add a commentAdd a comment