
రండి బాబూ... రండి
● క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి
● రైలు.. బస్సు టికెట్‌లు
ఉచితంగా పొందండి
● ఓటు వేసేందుకు సొంత ఊర్లకు రండి
● దూర ప్రాంత వాసులకు కూటమి అనుకూల నేతల ఆఫర్
● పట్టభద్రుల ఎన్నికలకు తాయిలాలు
● సూదూర ప్రాంతాల వారికి
ఉచిత రవాణా ఎర
సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో రోజులు గడుస్తున్న కొద్దీ గెలుపు ధీమా తగ్గిపోతుండడంతో కూటమి నేతలు ఓటర్ల ప్రసన్నం కోసం కొత్త మార్గాలను ఆన్వేషిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం సుదూర ప్రాంతాలలో ఉంటున్న స్థానిక ఓటర్లకు గాలం వేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, ముంబై వంటి ప్రాంతాలతోపాటు రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలో ఉంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 3,15,261 వరకు ఉన్నాయి. వీరిలో 22 శాతం నుంచి 25 శాతం వరకు ఇతర ప్రాంతాలలో ఉన్నారని అంచనా. మొత్తం ఓటర్లలో సుమారు 75 వేల మంది వరకు ఇతర ప్రాంతాల్లో ఉండగా, వీరిలో 50 వేల మంది వరకు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.
ప్రతి ఓటు కీలకంగా మారడంతో వీరిలో తమకు అనుకూలంగా ఉండేవారిని రప్పించేందుకు కూటమి నేతలు యత్నాలు ప్రారంభించారు. ఓటర్ల సెల్ ఫోన్‌లకు వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌లను పంపిస్తున్నారు. అలాగే సంప్రదించాల్సిన నంబర్లు కూడా ఇస్తున్నారు. తమ పేరు బయటకు రాకుండా కూటమి పార్టీలతో పెద్దగా పరిచయం లేనివారి సెల్ నంబర్లు ఇస్తున్నారు. వీటిని స్కాన్ చేస్తే సంబంధించి వ్యక్తులు వీరితో మాట్లాడి రైళ్లు, బస్సుల మీద తీసుకువచ్చే ఏర్పాట్లు చేయనున్నారు. రైల్వే రిజర్వేషన్లు నిండుకోవడం, తాత్కాల్ టిక్కెట్‌లు పెద్ద ఎత్తున చేయడం సాధ్యం కానందున ఆలస్యంగా స్కాన్ చేసినవారిని బస్సుల మీద తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి నేతలు ఇచ్చిన ఈ ఆఫర్ ఈనెల 16వ తేదీతో ముగిసిపోయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు సునాయాసం కాదని, క్షేత్రస్థాయిలో పలుచోట్ల ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో క్యూ ఆర్ కోడ్ గడువును పెంచినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment