గామన్ బ్రిడ్జిపై కారు దగ్ధం
కొవ్వూరు: పట్టణ శివారున ఉన్న గామన్ ఇండియా బ్రిడ్జిపై 33వ పిల్లర్ వద్ద బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. బ్యానెట్ నుంచి మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై, వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన బందెల కృష్ణ ఆ కారులో రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
– రూ.1.77 లక్షల నగదు, బైక్ స్వాధీనం
అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని పేరూరు వై.జంక్షన్‌లో ఈ నెల 4న ఓ బైక్ నుంచి రూ.1.50 లక్షల నగదును కాజేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద నుంచి రూ.1.77 లక్షల నగదు, మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. వై.జంక్షన్‌లోని ఓ టిఫిన్ సెంటరులో అల్పాహారానికి ఇద్దరు వ్యక్తులు బైక్ పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు బైక్‌పై వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్ సైడ్ డిక్కీలో పెట్టిన రూ.1.50 లక్షల నగదును దొంగిలించి పరారైన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీడివలస గ్రామానికి చెందిన మేకల బాలరాజును అరెస్ట్ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు. అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు పర్యవేక్షణలో, పట్టణ ఎస్సై టి.తిరుమలరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలరాజు రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment