నష్టాల పంట
● ఉద్యాన రైతుకు కూర‘గాయాలు’
● కూలీ ఖర్చులూ రాని దుస్థితి
● హోల్‌సేల్ మార్కెట్లకు
జోరుగా పంట ఉత్పత్తులు
● ఒకేసారి దిగుబడి
రావడమూ కారణమే..
నిన్నటివరకు ధరాభారంతో ప్రజలపై విరుచుకుపడ్డ కూరగాయలు ప్రస్తుతం చతికిల
పడ్డాయి. ఇటీవల కూరగాయల దిగుబడి
గణనీయంగా పెరగడంతో.. లాభాలు గడించవచ్చని ఆశించిన రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు. దాదాపు ఏకకాలంలో
కూరగాయల దిగుబడులు మార్కెట్‌ను
ముంచెత్తడంతో.. వాటిని పండించిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
ఆలమూరు: రేయింబవళ్లు శ్రమించి పండించిన కూరగాయల ఉత్పత్తులను అమ్ముకునే సమయానికి సరైన ధర లేకపోవడం ఉద్యాన రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. పంట చేతిలో లేని సమయంలో అత్యఽధిక ధర పలికిన కూరగాయలు, ప్రస్తుతం సమృద్ధిగా పంట అందుబాటులోకి వచ్చినా, ఆశించిన ధర లేకపోవడంతో ఉద్యాన రైతు కుదేలైన దుస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉత్పన్నమవుతోంది. ఉమ్మడి జిల్లాల్లోని హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయల ధరలు ఒక్కసారిగా దారుణంగా పడిపోయాయి. ఉద్యాన రైతులకు కనీసం రవాణా చార్జీలే కాక, కోత ఖర్చులూ రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పండించిన కూరగాయలను పొలాల్లోనే వదిలేయాల్సి వస్తోంది. ఒకప్పుడు పది కేజీల ధరలు రూ.500కు పైగా పలికిన కూరగాయలు ప్రస్తుతం రూ.150లోపు పడిపోవడాన్ని కూరగాయల రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏకకాలంలో దిగుబడి
ఉమ్మడి జిల్లాలోని లంక, చాగ్నలాడు, మెట్ట ప్రాంతాల్లో ఏటా సుమారు 35 వేల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతుంది. వర్షాలు కూడా ఆశాజనకంగా ఉండటంతో, మెట్ట, చాగల్నాడు రైతులు గతేడాది అక్టోబర్ నుంచి కూరగాయల సాగును చేపట్టారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా పెరిగిపోయింది. సాగు చేసిన కూరగాయల తోటల దిగుబడి అంతా దాదాపు ఒకేసారి ఈ ఏడాది జనవరి నెలాఖరుకు దశల వారీగా అందుబాటులోకి రావడంతో, వాటి ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి.
ఎగుమతులకు బ్రేక్
ఉమ్మడి జిల్లాలోని మడికి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్‌తో పాటు, రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, రావులపాలెం హోల్‌సేల్ మార్కెట్ నుంచి నిత్యం వందలాది టన్నుల కూరగాయలు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు ఎగుమతి జరిగేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కూరగాయల పంట అందుబాటులో ఉండటంతో, నెల రోజుల నుంచి హోల్‌సేల్ మార్కెట్ నుంచి ఎగుమతులు స్తంభించాయి. స్థానికంగా పండించిన పంట ఉమ్మడి జిల్లాల ఆవసరాల కంటే ఎక్కువగా ఉండటంతో కూరగాయలకు డిమాండ్ తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలోని హోల్‌సేల్ మార్కెట్‌లో దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి టమాట చేరుకోవడంతో వాటి ధర కూడా కేజీ రూ.పదిలోపు పతనమైంది.
ఆకుకూరలూ అంతంతమాత్రమే..
కూరగాయల ధరల మాదిరిగానే ఆకుకూరల ధరలు కూడా అంతకంటే వేగంగా క్షీణిస్తున్నాయి. కూరగాయల ధరలు అందుబాటులో ఉండటంతో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర తదితర ఆకుకూరల కొనుగోలుకు వినియోగదారులు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు. దీంతో హోల్‌సేల్ మార్కెట్‌లో ఆకు కూర కట్ట రూ.ఐదు నుంచి రూ.ఏడు మాత్రమే పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.20 వరకూ ఉంది. ఒకప్పుడు డబుల్ సెంచరీకి చేరువైన కొత్తిమీర ప్రస్తుతం కేజీ రూ.12 పలుకుతోంది.
టమాట ముంచేసింది
టమాట ధరలు ఆశాజనకంగా ఉన్నాయని ఎకరం పొలంలో దానిని సాగు చేశాను. పంట చేతికొచ్చే సమయానికి కోత ఖర్చులు రాని పరిస్థితి నెలకొంది. వారం రోజుల నుంచి మడికి హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ రూ.10 నుంచి రూ.15 వరకూ పలకడంతో నష్టపోతున్నాం.
– కడియాల శ్రీనివాసు, ఉద్యాన రైతు,
మూలస్థాన అగ్రహారం, ఆలమూరు మండలం
క్యాలీఫ్లవర్ దెబ్బ తీసింది
గతేడాది క్యాలీఫ్లవర్ పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో పాటు, ధర కూడా నిలకడగా ఉండి లాభాలొచ్చాయి. ఈసారి క్యాలీఫ్లవర్ పంట అర ఎకరంలో సాగు చేశాను. గత పక్షం రోజుల వరకూ రూ.20 నుంచి రూ.30 వరకూ పలికిన ఒక్కొక్క క్యాలీఫ్లవర్ ధర ప్రస్తుతం రూ.ఐదుకు తగ్గింది.
– యర్రంశెట్టి శ్రీనివాసు, ఉద్యాన రైతు,
బడుగువానిలంక, ఆలమూరు మండలం
నష్టాల పంట
నష్టాల పంట
నష్టాల పంట
నష్టాల పంట
Comments
Please login to add a commentAdd a comment