పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు

Published Thu, Feb 20 2025 12:08 AM | Last Updated on Thu, Feb 20 2025 12:07 AM

పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు

పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు

ముమ్మిడివరం: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అలసత్వానికి, పొరబాట్లకు తావివ్వవద్దని పది పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు మువ్వా రామలింగం అన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీం బాషా అధ్యక్షతన పదో తరగతి పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, శాఖాధికారులతో సమావేశం జరిగింది. ముఖ్య అతిథి రామలింగం మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలన్నారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా, మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు, ఫర్నిచర్‌ వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలన్నారు. విద్యార్థులు కింద కూర్చుని రాయడానికి వీల్లేదన్నారు. ఫర్నిచర్‌ కొరత ఉంటే ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా పేపర్‌పై ప్రత్యేక నంబర్‌ను ముద్రిస్తున్నందున లీకేజీ ఎక్కడ జరిగినా, ఏ పరీక్షా కేంద్రం నుంచి లీకై నా వెంటనే తెలిసిపోతుందన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకూ ప్రతి దశలోను కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఈఓ డా. సలీం బాషా మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 19,227 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. ఈ సందర్భంగా తన పాఠశాల స్థాయి గురువు రొక్కం తాతారావును రామలింగం శాలువాతో సత్కరించారు. జిల్లా స్థాయి సైన్స్‌ వారోత్సవాల పోస్టర్లను రామలింగం, డా.సలీం బాషా తదితరులు ఆవిష్కరించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.హనుమంతరావు, అమలాపుం, రామచంద్రపురం డీవైఈఓలు జి.సూర్యప్రకాశరావు, సి.రామలక్ష్మణమూర్తి, డీఈఓ కార్యాలయ ఏడీ నక్కా సురేష్‌, సమగ్ర శిక్షా సెక్టోరల్‌ అధికారులు పాల్గొన్నారు.

జిల్లా, మండల స్థాయిలో సైన్స్‌ ప్రదర్శనలు

సాక్షి, అమలాపురం: ప్రజల దైనందిన జీవితంలో సైన్స్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్నట్టు డీఈఓ షేక్‌ సలీం బాష అన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి, మాట్లాడుతూ ఆధునిక మానవాళి అభివృద్ధికి వైజ్ఞానిక శాస్త్రం కీలకమైందన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు శాసీ్త్రయ విజ్ఞానం దోహదపడుతుందన్నారు. సైన్స్‌తోనే సమాజ పురోగతి ఆధారపడి ఉందన్నారు. జిల్లాలో ఈ నెల 21న అన్ని మండల కేంద్రాల్లో, 25న జిల్లా స్థాయిలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఫోరం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా శాఖ, జిల్లా సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్స వాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.

మౌలిక సదుపాయాలకు

ప్రాధాన్యమివ్వాలి

టెన్త్‌ ఎగ్జామ్స్‌పై

రాష్ట్ర పరిశీలకుడు రామలింగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement