ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
● 40 కేంద్రాల్లో మార్చి ఒకటి
నుంచి 20 వరకు థియరీ
● డీఐఈవో సోమశేఖరరావు
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ విద్యార్థులకు ఈ నెల ఐదున, జనరల్ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 10న మొదలైన ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈవో) వనుము సోమశేఖరరావు ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల ఒకటి నుంచి 20 వరకూ ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు జిల్లాలోని 40 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి వివిధ ప్రభుత్వ శాఖాధికారుల సమన్వయం కోరామన్నారు. ఈ నెల 23న పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఆయా శాఖాధికారులు, కస్టోడియన్లు, స్క్వాడ్ మెంబర్లకు అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సూచనలు ఇస్తామని డీఐఈవో తెలిపారు.
అన్నవరం ఆలయానికి
కోడ్ నుంచి మినహాయింపు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎల్‌సీ ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు కోరుతూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించిన లేఖకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అనుమతి మంజూరు చేశారు. దానికి సంబందించిన ఆర్డర్స్ బుధవారం దేవస్థానానికి చేరాయి. అన్నవరం దేవస్థానంలో మార్చి 30 వ తేదీన జరుగనున్న ఉగాది వేడుకలు, ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి, మే నెల ఏడో తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే శాసనసమండలి ఉపాధ్యాయ ఎంఎల్‌సీ ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంది. దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడానికి వీలు లేదు. ఈ పనులు అత్యవసరంగా చేయాల్సినవి అయినందున వీటికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించగా ఆ మేరకు ఎన్నికల సంఘం మినహాయింపు వచ్చింది. త్వరలోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు అధికారులు తెలిపారు.
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
Comments
Please login to add a commentAdd a comment