వీరేశ్వరుని సన్నిధిలో మహా శివరాత్రికి ఏర్పాట్లు
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 26 నుండి మార్చి 2 వరకు నిర్వహించే మహా శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఆలయ అర్చక, పురోహితులు, వేద పండితులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రత్యేక చలువ పందిళ్లు, విద్యుద్దీపాలంకరణ, ప్రత్యేక క్యూలైన్లు, మెడికల్ క్యాంప్, చంటి పిల్లలకు పాలు, బిస్కట్ల పంపిణీ వంటి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఆఖరి రోజు మార్చి రెండున ఆలయం వద్ద నుంచి భారీ ఊరేగింపుతో, వివిధ రకాల విన్యాసాలతో, మేళతాళాలతో రథంపై గ్రామోత్సవం నిర్వహించి, పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో అర్చకులు యనమండ్ర సుబ్బారావు, యనమండ్ర సత్యసీతారామశర్మ, పేటేటి శ్యామలకుమార్, తేజ, పురోహితులు నాగాభట్ల రామకృష్ణమూర్తి, వేద పండితులు గంటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment