పిఠాపురం: భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త కత్తితో దాడి చేయగా అడ్డుకున్న అత్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైన ఘటన కొత్తపల్లి మండలం నాగులాపల్లి శివారు ఉప్పరగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన దండ్రు శ్రీనుకు కొత్తపల్లి మండలం నాగులాపల్లి శివారు ఉప్పరగూడెంకు చెందిన దండ్రు సింహాచలంతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. మూడేళ్లుగా నిందితుడు శ్రీను భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో ఒమ్మంగి నుంచి ఉప్పరగూడెం వచ్చి అత్త గుర్రాల రాణి (55) ఇంటి వద్ద కాపురం పెట్టారు. అయినప్పటికి అనుమానంతో రోజూ భార్యతో గొడవ పడేవాడు. రెండు నెలల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన నిందితుడు ఇటీవల ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి భార్యను అనుమానిస్తూ వేధించాడు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల వద్ద మాట్లాడినా ఉపయోగం లేక పోవడంతో రెండు పర్యాయాలు భార్య సింహాచలం కొత్తపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
అర్ధరాత్రి చాటుగా కాపలా
భార్యపై అనుమానంతో నిందితుడు బయటకు వెళుతున్నానని చెప్పి రాత్రుళ్లు తన ఇంటికి దగ్గర్లో మాటు వేసి కాపలా కాసేవాడు. ఇది చూసిన వారు ఎందుకు అలా చేస్తున్నావని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లి పోయేవాడు. ఇంట్లో అందరూ నిద్ర పోయాకా పని ఉందంటూ బయటకు వెళ్లి ఇంటి దగ్గర్లో ఉన్న పాకలో దాక్కునే వాడు. ఎవరు రాక పోయినా వచ్చి ఎవరో వచ్చారు అంటూ భార్యతో గొడవకు దిగేవాడు.
అదను చూసి అంతమొందించాడు
చివరకు ఎలాగైనా భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్న నిందితుడు శ్రీను వారం రోజుల క్రితం కత్తి తయారు చేయించి వెంట తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి రాత్రుళ్లు కత్తి దగ్గర పెట్టుకుని పడుకునే వాడు. ఆదివారం ఉదయం అతని అత్త రాణి పక్క ఇంటి వారితో మాట్లాడుతూ తన అల్లుడు అనుమానంతో ఇబ్బంది పెడుతున్నాడని, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం నిందితుడు శ్రీను విన్నాడు.
ఇంటికి వచ్చిన వెంటనే తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతరుల వద్ద తన పరువు తీస్తోందని భార్యపై కోపోద్రిక్తుడయ్యాడు. భార్యపై కత్తితో దాడికి దిగాడు. ఆమెను పరుగులు పెట్టించి కత్తితో నరికే ప్రయత్నం చేయగా ఆమె చెయ్యి తెగిపోయింది. ఇది చూసిన అత్త రాణి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమైపె విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపే ప్రయత్నం చేయగా ఇరుగు పొరుగు వారు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తన వద్ద ఉన్న కత్తిని చూపించి పట్టుకుంటే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి కత్తితో సహా నిందితుడు పరారయ్యాడు.
గాయపడ్డ భార్యను పిఠాపురం ఆసుపత్రికి ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబీకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్టు వారు తెలిపారు. మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. అమ్మమ్మను చంపి తండ్రి పరారవ్వగా తీవ్ర గాయాలతో తల్లి ఆస్పత్రి పాలవ్వడంతో వారి పిల్లలు రోదిస్తున్న తీరు చూపరులకు కంట తడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment