అమలాపురం టౌన్: స్థానిక వనచర్ల వీధికి చెందిన శ్రీపతి మల్లేశ్వరి (24)ది హత్యేనని పోలీసు దర్యాప్తులో తేలింది. రెండు వారాలుగా సాగుతున్న ఈ కేసు చిక్కుముడి చివరికి వీడింది. డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి లోతుగా దర్యాప్తు చేసి హత్య కోణాన్ని వెలికి తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం డీఎస్పీ అంబికా ప్రసాద్ వివరించారు.
ఆయన కథనం మేరకు.. నాగబాబు, మల్లేశ్వరిలకు గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగాయి. నాగబాబు భార్యను, మల్లేశ్వరి భర్తను వదిలేసి వీరిద్దరూ స్థానిక వనచర్ల వీధిలో సహ జీవనం సాగించారు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. మల్లేశ్వరి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఆమెను నాగబాబు తరచూ మద్యం తాగి వేధించేవాడు. ఐదేళ్ల కిందట అమలాపురంలో నాగబాబు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నప్పుడు అందులో పనిచేసే ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందన్నది నాగబాబు అనుమానం.
హత్య చేసిందిలా..
ఈ నెల 7వ తేదీ రాత్రి నుంచి మల్లేశ్వరి కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత అమలాపురం పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. తర్వాత 9వ తేదీ ఉదయం అమలాపురం బైపాస్ రోడ్డలో శ్మశానం వద్ద పంట కాలువ నీటి అంచున మల్లేశ్వరి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడాన్ని స్థానికులు, పోలీసులు గుర్తించారు. 7వ తేదీ రాత్రి వనచర్లవారి వీధిలోని వారున్న ఇంట్లోనే మల్లేశ్వరి మెడకు చీరను బిగించి నాగబాబు హత్య చేశాడు. అతనికి ఆ ఇంటి యాజమాని కుమారుడు కముజు నరసింహం సహకరించాడు.
అప్పటికే చనిపోయిన మల్లేశ్వరికి ఒంట్లో బాగోలేదని.. ఆస్పత్రికి తీసుకు వెళుతున్నామని ఇరుగు పొరుగు వారికి చెప్పి నాగబాబు, నరసింహం ఇద్దరూ మోటారు సైకిల్‌పై ఆమె మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. పంట కాలువ వద్దకు వెళ్లి మృతదేహాన్ని పడేశారు. మృతదేహం కాలువలో కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోతుందని వారు అంచనా వేశారు. అయితే ఆ మృతదేహం కాలువ నీటి అంచునే ఆగిపోవడంతో వారి పధకం నెరవేరక ఆనక వారి కుట్ర బయటపడింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే గాని అది ఆత్మహత్యా... హత్యా అనేది ఇప్పుడే చెప్పలేమని అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు.
పోస్టుమార్టం నివేదికలో మల్లేశ్వరిది హత్యేనని తేలడంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా మార్చి ఆ దిశగా దర్యాప్తు చేశారు. నిందితుడు నాగబాబు, సహకరించిన నరసింహంలను అరెస్ట్ చేసి ఆదివారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు పట్టణ సీఐ దుర్గాశేఖరరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment