
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించడమే దీనికి కారణం. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందనలో జరిగిన ఈ ఘటనే దీనికి నిదర్శనం. గోకవరం మండలం వీరలంకపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ పైడికొండల రమేష్ ఉరఫ్ (పైడికొండల వసుంధర) తనను ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించి, గుర్తింపు కార్డు జారీ చేయాల్సిన స్పందనలో కలెక్టర్ మాధవీలతకు అర్జీ అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్‌కు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. దీంతో గంట వ్యవధిలోనే సంబంధిత ధ్రువపత్రాలు జారీ చేయడంతో కలెక్టర్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు అందజేశారు. ఈ సందర్భంలో పైడికొండల రమేష్ ఉరఫ్ వసుంధర కలెక్టర్‌కు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
వేగంగా పౌరసేవలు
కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ అర్హత ఉండి, తక్షణం పరిష్కారం చేసే అర్జీల విషయంలో కాలయాపన చేయకుండా, సాధ్యమైనంత వేగంగా పౌర సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి తప్పని సరిగా జిల్లా స్థాయి అధికారులు హాజరవ్వాలన్నారు. జేకేసీలో అందిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమానికి ప్రజలు 173 అర్జీలు అందజేశారని, వాటిని గడువులోపు పరిష్కరించాలన్నారు. జేకేసీలో హౌసింగ్, మెడికల్, డీఆర్డీఏ వంటి శాఖలకు సంబంధించి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, వాటికి వెనువెంటనే పరిష్కార మార్గం చూపాలన్నారు.
27న జగనన్నకు చెబుదాం
రాజమహేంద్రవరం రూరల్ మండలానికి సంబంధించి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఈనెల 27వ ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్‌లో నిర్వహిస్తామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
మర్యాద పూర్వకంగా...
కలెక్టరేట్ స్పందన హాల్లో కలెక్టర్ మాధవీలతను సోమవారం శిక్షణ డిప్యూటీ కలెక్టర్ మిమ్మితి భాను ప్రకాష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన ఆయన ఇటీవల ప్రకటించిన గ్రూప్1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

ట్రాన్స్‌జెండర్‌కు గుర్తింపు కార్డు అందిస్తున్న కలెక్టర్ మాధవీలత
Comments
Please login to add a commentAdd a comment