అల్లవరం: సాధారణంగా సమాజంలో ఎవరైనా వ్యాపారం చేసేది లాభాల కోసమే అయ్యుంటుంది. అలాంటిది అసలు లాభాపేక్ష అన్నదే లేకుండా ప్రజాహితమే పరమార్థంగా భావించి వ్యాపారం చేసేవాళ్లుంటారా..? ఉన్నారంటే నమ్ముతారా..? అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామానికి చెందిన గోడి సత్యనారాయణ మాత్రం దేవుడికి చేసిన వాగ్దానాన్ని మరవకుండా రుచిగా, శుచిగా తయారుచేసిన బిర్యానీ, ఫ్రైడ్ రైస్ రూ.20కే అందిస్తూ అందరి మనన్నలు అందుకుంటున్నారు. అందుకే అల్లవరం మండలం గుడ్డివానిచింతలో ఆయన ఏర్పాటుచేసిన అంజలి బిర్యానీ సెంటర్ నిరుపేదల పైవ్‌స్టార్ హోటల్‌గా మారిపోయింది. అందరి ఆకలి తీర్చడంలోనే ఆనందం ఉందంటున్న చిరు వ్యాపారి సత్యనారాయణపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది..
హైదరాబాద్ నుంచి అమలాపురానికి..
కోనసీమ ప్రాంతానికి చెందిన గోడి సత్యనారాయణ యుక్త వయసులో ఉండగానే జీవనోపాధి కోసం హైదరాబాద్ మహానగరానికి వెళ్లిపోయారు. తొలుత అక్కడ వంట మాస్టర్‌గా పని చేసిన ఆయన.. అనంతరం సొంతంగా బిర్యానీ సెంటర్ తెరిచారు. పద్దెనిమిదేళ్ల పాటు రుచికరమైన వంటకాలను తక్కువ ధరలకే వినియోగదారులకు అందించి శభాష్ అనిపించుకున్నారు.
పఠాన్ చెరువు ప్రాంతంలో సత్యనారాయణ బిర్యానీ సెంటర్ నుంచి పోటీని తట్టుకోలేక ఎందరో వ్యాపారులు దుకాణం సర్దేశారు. అయితే స్థానిక వ్యాపారులు కాలక్రమంలో సత్యనారాయణపై బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు. అక్కడ తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన సత్యనారాయణ అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చేశారు. అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద నాలుగేళ్ల క్రితం బిర్యానీ పాయింట్, భోజనం అమ్మకాలు ప్రారంభించారు. అనతికాలంలోనే బిర్యానీ పాయింట్ ప్రజల మనసుని గెలుచుకుంది.
దైవ సన్నిధిలో ఇచ్చిన మాట
సత్యనారాయణకు తన కుమార్తె అంజలి అంటే ఎంతో ప్రేమ.. స్థానికంగా ఉన్న చర్చికి సత్యనారాయణ తన కుటుంబంతో పాటు తరచుగా వెళుతుంటారు. తన కుమార్తె అంజలి పుట్టిన రోజును పురస్కరించుకుని ఏటా దైవసన్నిధిలో బిర్యానీ అందించేవారు. తాను వ్యాపారంలో నిలదొక్కుకున్నాక లాభాపేక్ష లేకుండా రూ.20కే బిర్యానీ అందించి అందరి ఆకలి తీరుస్తానని తన కుమార్తె పుట్టిన రోజున దేవుడికి వాగ్దానం చేశారు. సరిగ్గా మూడేళ్ల తరువాత ఈ ఏడాది మే నెలలో అంజలి బిర్యానీ పాయింట్‌ని ఏర్పాటు చేసి దేవుడికిచ్చిన మాటను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.
పగలంతా ఇక్కడ రూ.50, రూ.80, రూ.120 ధరల్లో బిర్యానీలు అమ్ముతారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత మాత్రం రూ.20కే చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నిప్పులపై కాల్చే చీకులను అమ్ముతున్నారు. బయట కనీసం రూ.100కు కూడా లభించని బిర్యానీ కేవలం రూ.20కే లభిస్తూండటంతో భోజనప్రియులు దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి క్యూ కడుతున్నారు. వచ్చే సంక్రాంతి నుంచి రూ.30కే భోజనం అందిస్తామని, అందరి ఆకలి తీర్చడంలోనే తనకు ఆనందమని సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment