బాబురే..! కోతల బడ్జెట్
● ఎన్నికల హామీలు గాలికి
● డ్వాక్రా మహిళలకు టోకరా
● అన్నదాత సుఖీభవకు అరకొర విదిలింపు
● ఊసేలేని మహిళలకు
ఉచిత బస్సు ప్రస్తావన
● నిరుద్యోగ భృతికి మంగళం
● నిరాశ మిగిల్చిన కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ప్రజలను దగా చేసేలా ఉంది. అమరావతిలోని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెల్‌లో అన్ని వర్గాలకు అన్యాయం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఇలా అన్ని రంగాలకు తీరని అన్యాయం జరిగింది. కేటాయింపుల్లో కోత విధించి ప్రజలకు మోసం చేశారు. ఇటు వార్షిక, అటు వ్యవసాయ బడ్జెట్‌లో అన్నీ కోతలే విధించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘సూపర్ సిక్స్’కు అవసరమైన మేరకు కేటాయింపులు జరగలేదు. ఇచ్చిన తొలి హామీకే దిక్కులేకుండా పోయింది. అంతేగాక పలు రంగాలకు సగం కంటే తక్కువ నిధులు కేటాయించారు. రైతులు, మహిళలను దారుణంగా మోసం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. కూటమి బడ్జెట్‌పై మేధావులు, రైతు సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇంత దారుణమైన బడ్జెట్ తాము ఎన్నడూ చూడలేదని నిట్టూరుస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నిరుద్యోగులకు దగా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగుల ప్రస్తావనే లేకుండా వారిని నిట్టనిలువునా మరోసారి మోసం చేశారు. నయా పైసా కూడా కేటాయించకుండా మోసం చేశారు. జిల్లా వ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారు.
తల్లికి ద్రోహం
తల్లికి వందనం పేరుతో పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15,000 ఇస్తామన్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా రూ.12 వేల కోట్లకు పైగా అవసరమైతే... కేవలం రూ.8,276 కోట్లు మాత్రమే కేటాయించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఒక ఏడాది ఎగనామం పెట్టింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 1.62 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా రూ.243 కోట్లు అందించేవారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే పథకంలో భారీగా కోత పడే అవకాశం ఉంది.
మహిళలకు మోసం
మహిళా అభ్యున్నతికి పాటుపడతామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్ కేటాయింపుల్లో దారుణంగా మోసం చేశారు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.
ఉచిత బస్సు ఊసే లేదు
మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రస్తావనే లేదు. బడ్జెట్‌లో నయాపైసా నిధులు కేటాయించలేదు. దీంతో పథకం అమలయ్యే అవకాశం కనిపించడం లేదు.
పూర్తిగా వెలగని దీపం
ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఈ ఏడాది రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టి మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లకు గాను రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే భారీగా కోత విధించేందుకు పావులు కదుపుతోంది. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 36 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. మొత్తం 6,24,265 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో డబుల్ కనెక్షన్లు మినహాయిస్తే 4,09,734 ఉన్నాయి. తెల్లరేషన్ కార్డులు 5,42,964, అంత్యోదయ 21,591 కలిపి మొత్తం 5,64,555 ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే వీటిలో భారీగా కోత పెట్టే అవకాశం ఉంది. వేలాది మంది మహిళలు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
డ్వాక్రా మహిళలకు టోకరా
ఎన్నికల సమయంలో రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్కో ఏడాదిలో 33,498 గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు రూ.37.27 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 6,680 సంఘాలకు రూ.8.42 కోట్ల వడ్డీ రాయితీ అందించింది. ప్రస్తుత బడ్జెట్‌ను బట్టి చూస్తే మహిళలకు మోసం తప్పడం లేదు.
రైతులకు పంగనామాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీలు గుప్పించారు. తాజా బడ్జెట్‌లో మాత్రం అరకొర కేటాయింపులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఇస్తామంటూ మెలిక పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1.22 లక్షల రైతు కుటుంబాలున్నాయి. తక్కువ కేటాయింపులతో లబ్ధిదారులకు భారీగా కోత పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా రైతు భరోసా పథకం కింద రూ.90.55 కోట్లు చెల్లించేది. ప్రస్తుతం వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. కౌలు రైతులకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు.
పర్యాటక రంగానికి నిధులేవీ?
రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా ప్రకటించలేదు. జిల్లాలో టెంపుల్, ఏకో, కెనాల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇటీవల మంత్రి దుర్గేష్ ప్రకటించారు. గోదావరి కాలువ, రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జి, కడియం నర్సరీలను కలుపుతూ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ మేరకు పూర్తి స్థాయిలో కేటాయింపులు జరగలేదు.
విద్య, వైద్య రంగాలపై దృష్టేదీ?
కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలపై దృష్టి కేంద్రీకరించలేదు. ప్రస్తుతం పెరిగే ధరలతో పోలిస్తే ఈ బడ్జెట్‌లో సామాజిక రంగాలకు అన్యాయం జరిగింది. పోలవరం జాతీయ ప్రాజెక్టును మినహాయిస్తే.. వ్యవసాయ రంగానికి కేటాయింపులు సరిగా లేవు. కేంద్ర నుంచి రావాల్సిన నిధుల విషయంలో నోరు మెదపడం లేదు. ఇది రైతు, వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్.
– తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
వాస్తవాల్లేని బడ్జెట్
వెలువరించిన బడ్జెట్లో వాస్తవాలు లేవు. ప్రతిపాదనలు, కేటాయింపులకు విరుద్ధంగా ఉన్నాయి. బీసీలకు 50 ఏళ్లకు పింఛను ఇస్తానని దగా చేశారు. అన్నదాత సుఖీభవకు గతేడాది రూ.4,500 కోట్లు కేటాయించారు. ఎవరికై నా అందిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21 వేల కోట్లు అవసరమైతే కేటాయించింది మాత్రం రూ.6,300 కోట్లే. మహిళలకు రూ.1,500, విద్యార్థులకు రూ.15,000, రైతులకు రూ.20 వేలు ఇస్తామన్నారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. అరాచకం, విధ్వంసం అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. అధికారంలో వచ్చాక సక్రమంగా పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. మాజీ సీఎం వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకటించి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు.
– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
బాబురే..! కోతల బడ్జెట్
బాబురే..! కోతల బడ్జెట్
Comments
Please login to add a commentAdd a comment