కమనీయం నరసన్న కల్యాణం
మధురపూడి: శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా కోరుకొండ గోవింద, హరి నామస్మరణతో మార్మోగింది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగాయి. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కోరుకొండ నవనరసింహ క్షేత్రం కావడంతో సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోరుకొండ పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసింది. రథోత్సవంతో కోరుకొండ మీదుగా గోకవరం, భద్రాచలం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన రథోత్సవం సాయంత్రం 5.30కు తిరిగి దేవస్థానానికి చేరింది. అక్కడ స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఆలయానికి తోడ్కొనివచ్చారు. వధూవరులకు మంగళస్నానాలు నిర్వహించారు. పట్టువస్త్రాలను అలంకరించిన స్వామి, అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. వధూవరులకు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్‌కుమార్ ఆచార్యులు కల్యాణం నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్‌పీ రంగరాజబట్టర్, అర్చకస్వాములు పెద్దింటి, పెదపాటి వారి పర్యవేక్షణలో కల్యాణ వేడుక కమనీయంగా జరిగింది.
మాలధారణ భక్తుల ప్రదర్శనలు
రథోత్సవంలో మాలధారణ చేసిన భక్తుల ప్రదర్శనలు ఆధ్యాత్మకతను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 220 మంది భక్తులు స్వామివారి మాలధారణ వేశారు. ఉత్సవాల సందర్భంగా స్వాములు 9 రోజుల పాటు నిష్ఠతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. వీరికి స్వామివారి మాలధారణ ట్రస్టు ద్వారా వడి, భిక్షలను ఏర్పాటు చేశారు. బుధవారం దీక్షను విరమిస్తారు.
భక్తజన సందోహం నడుమ..
సోమవారం స్వామివారి రథోత్సవం భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.56 గంటలకు వేద మంత్రోచ్ఛరణతో స్వామి, అమ్మవార్లు ఆశీనులైన రథం బయలుదేరింది. కొండ నుంచి ప్రారంభమైన రథం దేవస్థానం రోడ్డు, వాటర్ ప్లాంట్, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్టీలపేట, మత్స్యకారుల వాడ, ఎయిర్‌టెల్ టవర్, సాయిబాబా గుడి, అంకాలమ్మ గుడి, శివాలయం మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, బ్యాండ్‌మేళాలు, కోలాటం, తీన్మార్, శక్తి వేషధారణలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలతో రథానికి స్వాగతం పలికారు. సాయంత్రం 5.40కు రథం తిరిగి దేవస్థానానికి చేరింది. భక్తులు అరటి పండ్లను స్వామి రథంపైకి వేస్తూ, దర్శించుకున్నారు. దేవస్థానానికి చేరుకున్న రథానికి ఎదుర్కోలు కార్యక్రమంలో భాగంగా మేళతాళాలతో నరసింహస్వామి, లక్ష్మీదేవిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థాన ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం అధికారులు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్, కోరుకొండ తహసీల్దార్ సుస్వాగతం, ఎంపీడీఓ బత్తిన అశోక్‌కుమార్ పాల్గొన్నారు. కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై శ్యామ్‌సుందర్ బందోబస్తు నిర్వహించారు.
శ్రీలక్ష్మీ నరసింహుని రథోత్సవం భక్తజన సందోహం
కన్నుల పండువగా కల్యాణోత్సవాలు
కమనీయం నరసన్న కల్యాణం
కమనీయం నరసన్న కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment