మిత్రుల అంకురం.. రైతులకు సంబరం | - | Sakshi
Sakshi News home page

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

Published Tue, Mar 11 2025 12:25 AM | Last Updated on Tue, Mar 11 2025 12:24 AM

మిత్ర

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

పిఠాపురం: పంటకు మేలు చేసి, రైతులకు పురుగు మందుల ఖర్చు తగ్గించే మిత్రులుగా భావించే మిత్ర పురుగులు సేంద్రియ వ్యవసాయం పుణ్యమా అని మళ్లీ వాటికి జవజీవాలు సంతరించుకున్నాయి. విచ్చలవిడిగా రసాయనాల వినియోగంతో కనుమరుగైన మిత్ర పురుగులు.. సేంద్రియ వ్యవసాయంతో ఉనికిలోకి వస్తున్నాయి. వీటివల్ల పంటలకు ఎంతో మేలు కలిగి, రైతుకు పైసా ఖర్చు లేకుండానే క్రిమికీటకాలు నివారించబడతాయి. అలాంటి మిత్ర పురుగులు పొలాల్లో కనిపించకుండా పోవడంతో, కీటకాలు పెరిగి, పంటలకు తెగుళ్లు సోకి రైతుకు నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వల్ల పంటలకు మిత్రులు మళ్లీ వస్తుండడంతో రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పంటలకు మేలు

సాలీడు, అక్షింతల పురుగు, తూనీగలు, అల్లిక రెక్కల పురుగు, గొల్లభామలను పంటలకు మిత్రులుగా చెబుతారు. ఇవి పంటలకు రక్షణ కవచాలుగా రైతులు పరిగణిస్తుంటారు. కొన్నేళ్లుగా సాగులో రసాయనాలను గణనీయంగా వినియోగించడంతో కనుమరుగైన ఈ పురుగులు.. ప్రకృతి వ్యవసాయం వల్ల, రసాయనాల వినియోగం తగ్గి, మళ్లీ భూమిపై సంచరిస్తూ పంటలకు మేలు చేస్తున్నాయి. ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగుల తీవ్రత పెరిగి, పంటలకు తీవ్ర నష్టాలను కలిగిస్తాయి.

అక్షింతల పురుగు

పంటలకు అక్షింతల పురుగు (లేడీ బర్డ్‌ బీటిల్‌) చాలా ప్రయోజనకరంగా చెబుతారు. అనేక రకాల కీటకాలను, పేను బంక లాంటి రసం పీల్చే పురుగులకు ఇవి సహజ శత్రువులు. ఒక అక్షింతల పురుగు తన జీవిత కాలంలో సుమారు ఐదు వేల పేనుబంక పురుగులను తింటుంది. గుండ్రంగా కుంభాకారం కలిగి ఉంటుంది. పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు, నలుపు రంగుల్లో మచ్చలు కలిగి ఉంటుంది. వీటి లార్వాలు సైతం కీటకాలను వేటాడుతాయి. ఆడ పురుగులు ప్రతి మూడు నెలలకోసారి సుమారు వెయ్యి గుడ్లు పెడతాయి. ఇవి ప్రకాశవంతమైన మచ్చలతో, నలుపు రంగులో ఉండి, ప్రమాదకరమైన దానిగా కనిపించినప్పటికీ పంటకు మాత్రం ఎంతో మేలు చేస్తుంది. ఇవి వదిలే లార్వా ఎటువంటి ప్రమాదకరం కాకపోవడంతో పంటకు మేలు మినహా, కీడు అనేది ఉండదు. అనేక వారాల పాటు పంటలపై ఉండి కీటకాలను తినడం ద్వారా రైతులు కీటకాల నివారణకు పురుగు మందులు పిచికారీ చేసే అవసరం లేకుండా, పెట్టుబడి, శ్రమ చాలా తగ్గుతుంది.

అల్లిక రెక్కల పురుగు

ప్రకృతిలో అల్లిక రెక్కల పురుగు (గ్రీన్‌ లేస్‌ వింగ్‌ బగ్‌) విరివిగా కనిపించే ఓ సాధారణ రెక్కల పురుగు. కానీ ఇది పంటలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. గొంగళి పురుగులు, లీవ్‌ ఆఫర్స్‌, బిలివర్స్‌, వైట్‌ ఫ్‌లైస్‌ వంటి ఇతర మృదువైన శరీరం కలిగిన కీటకాలను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. లేత ఆకుపచ్చ రంగులో, సున్నితమైన రెక్కలతో ఉండే ఈ పురుగు వదిలే లార్వా ఇతర కీటకాలను నాశనం చేస్తాయి. పంటలు నాశనం చేసే కీటకాలకు దీనిని బద్ధ శత్రువుగా చెబుతారు.

తూనీగ

పొడవైన శరీరం కలిగి, కళ్లు, రెండు జతల బలమైన రెక్కలు కలిగి, వివిధ రంగుల మచ్చలతో ఉండే తూనీగ (డ్రాగన్‌ ఫ్‌లై) 95 శాతం కీటకాలను వేటాడతాయి. అందుకే దీనిని డెడ్లీ హంటర్‌ అని కూడా అంటారు. కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించేవిగా చెబుతారు. ఇవి ఒకే వేసవిలో వేలాది కీటకాలను పట్టుకుని తింటాయి. దోమలు, ఈగలు, తెల్లదోమలను తిని పంటలకు మేలు చేకూరుస్తాయి.

సాలీడు

సాధారణ పంటలకు సోకే తెగుళ్ల నియంత్రణకు సాలీడు (స్పైడర్‌) జీవ ఏజెంట్లుగా పని చేస్తాయి. ఇవి అనేక సజీవ కీటకాలను తింటాయి. చీడపీడలను నియంత్రించడంలో వీటిని మించిన పురుగు మరొకటి లేదంటారు. కేవలం శత్రు కీటకాలను తినడం మినహా, పంటకు కానీ, మొక్కలకు కానీ ఎటువంటి హానీ చేయకపోవడం వల్ల మిత్ర పురుగుల్లో ఇది తొలి స్థానంలో ఉంది. దోమలు, ఈగలు, తెల్లదోమలు, ఎగిరే కీటకాలను పట్టుకుని తినడం ద్వారా ఇవి పంటలకు మేలు చేస్తాయి.

గొల్లభామ

పంటలకు గొల్లభామ (ప్రేయింగ్‌ మ్యాంటీస్‌)లను ఆస్తులుగా చెబుతారు. తెగుళ్ల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పునుబంక, ఆస్త్రరాగస్‌ బీటిల్స్‌, గొంగళి పురుగు, బీటిల్స్‌, తేనెమంచు పురుగు తదితర వాటిని తిని పంటలకు హాని కలగకుండా నివారిస్తాయి. ఇవి పుప్పొడి మకరందాన్ని తీసుకోవు. కానీ వీటిని ఉత్పత్తి చేసే మొక్కలు గొల్లభామలు తినే ఆహారాలైన కీటకాలను ఆకర్షిస్తాయి. వీటివల్ల పంటలకు చాలా మేలు కలుగుతుంది.

పంటకు రక్షకులు..

కీటకాలకు శత్రువులు

రసాయనాల వినియోగంతో కనుమరుగు

ప్రకృతి వ్యవసాయంతో

మిత్ర పురుగులకు జీవం

సేంద్రియ పంటల్లో

వాటి ప్రాముఖ్యమెంతో..

మిత్ర పురుగులు మళ్లీ వచ్చాయి

గతంలో ఎక్కడ చూసినా మిత్ర పురుగులు కనిపించేవి. కానీ రసాయనాల వినియోగం వల్ల అవి కనుమరుగయ్యాయి. ముఖ్యంగా పొలాల్లో అస్సలు కనిపించడం లేదు. కానీ సేంద్రియ వ్యవసాయం మొదలయ్యాక వాటి మనుగడ మళ్లీ ప్రారంభమైంది. రైతు ఎటువంటి పురుగు మందులు వాడకుండా, 70 శాతం వరకు ఇవి పంటలకు హాని చేసే కీటకాలను నాశనం చేసి, పంటకు మేలు చేస్తాయి. ఇప్పుడు ఇవి భారీగా కనిపిస్తున్నాయి. తెగుళ్లు తగ్గుముఖం పట్టాయి. రైతుకు పెట్టుబడి తగ్గింది. ఇది చాలా శుభపరిణామంగా చెప్పవచ్చు.

– గుండ్ర శివచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం

ప్రకృతి వ్యవసాయ ఫలితమే..

కొన్నేళ్లుగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయ సాగు ఫలితమే మిత్ర పురుగుల మనుగడకు అంకురం. ప్రస్తుతం సేంద్రియ పంటలన్నింటి పైనా ఈ పురుగులు సంచరిస్తున్నాయి. తద్వారా కీటకాల బెడద గణనీయంగా తగ్గింది. పురుగు మందుల అవసరం లేకుండా పోయింది. పంటలకు మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనమే మిత్ర పురుగుల సంచారం. ఇది మారుతున్న వ్యవసాయ విధానాల్లో శుభపరిణామంగా చెప్పవచ్చు.

– ఎలియాజరు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
మిత్రుల అంకురం.. రైతులకు సంబరం 1
1/7

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం 2
2/7

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం 3
3/7

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం 4
4/7

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం 5
5/7

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం 6
6/7

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం 7
7/7

మిత్రుల అంకురం.. రైతులకు సంబరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement