ఎమ్మెల్సీ స్థానానికి రీ పోలింగ్ నిర్వహించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రీ పోలింగ్ నిర్వహించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్డీఏ (టీడీపీ) కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తాననే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన నాయకులతో ఎన్నికల అధికారులు కుమ్మకై ్క తన నామినేషన్‌ను కుట్ర పూరితంగా రిజెక్ట్ చేసి పోటీలో లేకుండా తప్పించారని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈనెల 12 ఫిర్యాదు చేశానని.. అయితే అక్కడ న్యాయం జరగకపోవడంతో 25న కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటు మిగిలిన అధికారులపై విచారణ జరిపించి తన నామినేషన్‌ను పునరుద్ధరించి ఆమోదించాలని, రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానన్నారు.
నకిలీ వరి విత్తనాలతో నష్టం
తాళ్లపూడి: కల్తీ వరి విత్తనాల కారణంగా రబీ వరిలో పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. మండలంలోని మలకపల్లిలో శుక్రవారం గ్రామానికి చెందిన రైతులు స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద కంపెనీ ప్రతినిధులను నిర్బంధించారు. ఈనిక దశలో ఉన్న పంట చేలను వారికి చూపించి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. గ్రామానికి చెందిన మూతిన రాధాకృష్ణ, చెరుకూరి చిన్ని, ఎం అనిల్, మద్దిపాటి రామారావు, ఇమ్మణి సత్యనారాయణ, కొప్పినీడి రాజు, పి సత్యనారాయణ తదితరుల మాట్లాడుతూ ప్రీతి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ విత్తనాలను తాళ్లపూడిలోని దేవీ ఏజన్సీస్ షాపు వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. గ్రామంలో 300 ఎకరాల్లో రబీలో వరి సాగు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఇందులో నాలుగు రకాల విత్తనాలు కేళీలు వచ్చాయని ప్రస్తుతం ఈనిక దశలో ఉందని తెలిపారు. ముందు వెనుక చేను రెల్లు వేస్తోందని అవి కూడా చిన్నగా ఉన్నాయని తెలిపారు. దీంతో దిగుబడి తగ్గిపోతుందని వాపోయారు. తమకు నష్టపరిహరం చెల్లించాలని, అధికారులు, కంపెనీ ప్రతినిధులు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. కంపెనీ ప్రతినిధి హరిష్ మాట్లాడుతూ కేళీ వచ్చినంత మాత్రన నకిలీ విత్తనం కాదని అన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై మండల వ్యవసాయాధికారిణి జి రుచిత మాట్లాడుతూ వాటి శాంపిళ్లను సేకరించి పరిశీలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment