హిందువులపై అక్రమ కేసులు దారుణం
రాజమహేంద్రవరం రూరల్: అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్సైని సస్పెన్షన్ చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం దారుణమని పేర్కొంది. బాధిత హిందువులు, హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి తెలియజేస్తూ రాసిన వినతి పత్రాన్ని సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతికి అందజేసింది. ముందుగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాధామనోహర్‌దాస్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సత్తి గోవిందరెడ్డి, కార్యవర్గ సభ్యులు గనిరాజు, అనంత్, గీత, వెంకట్ , ప్రదీప్, వర్మ, కొవ్వూరు జిల్లా కార్యదర్శి గంగాధరం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ విభాగ్ సహకార్యవాహ కామవరపు మోహన్‌కృష్ణ, విభాగ్ కార్యకారిణి సభ్యులు వాడ్రేవు మాణిక్యాలరావు, సమరతసేవ ఫౌండేషన్ జిల్లా ధర్మప్రచారక్ కర్రి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితర సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరభద్రస్వామి ఉత్సవంలో దాడి
వీహెచ్‌పీ నాయకులు మాట్లాడుతూ రాయచోటిలో ఈ నెల 4వ తేదీన వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా హిందువులపై మరోవర్గం వారు దాడి చేశారని, ఈ దాడిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. అలాగే పక్షపాత ధోరణితో హిందువులపైనే అమానుషంగా లారీచార్జి చేసి వారిని తీవ్రంగా గాయపరిచి, అక్రమ కేసులు బనాయించారన్నారు. అన్ని అనుమతులు తీసుకొని ఉత్సవాన్ని నిర్వహించుకుంటుంటే, దానికి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఉత్సవంపై దాడి చేసిన వారిని వదిలేసి, తిరిగి హిందువులపై, హిందూసంస్థలపై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
వాటిని వెంటనే ఉపసంహరించాలి
రాయచోటిలో ఉత్సవంపై దాడి
చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేత
Comments
Please login to add a commentAdd a comment