సేంద్రియ సాగు.. భళా | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగు.. భళా

Published Sun, Mar 16 2025 12:09 AM | Last Updated on Sun, Mar 16 2025 12:09 AM

సేంద్

సేంద్రియ సాగు.. భళా

44 వేల ఎకరాలు.. 37 వేల మంది రైతులు

వరి, ఉద్యాన, కూరగాయ పంటల సాగు

భూసారానికి మేలు

నిండుగా దిగుబడులు.. దండిగా లాభాలు

పెరవలి: జిల్లాలోని రైతులు సేంద్రియ వ్యవసాయంతో మంచి లాభాలు పండించుకుంటున్నారు. ఇప్పటి వరకూ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ చేస్తున్న సాగుతో భూమి చౌడుబారుతున్నాయి. పైగా రసాయనిక ఎరువులతో పండించిన ఆహార ధాన్యాలు తినడం ఆరోగ్యానికి చేటు తెస్తుందనే అవగాహన చాలా మందిలో పెరుగుతోంది. ఫలితంగా ఈ విధానంలో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి పలు దేశాలు విముఖత చూపుతున్నాయి. పైగా పెట్టుబడి ఎక్కువ.. రాబడి తక్కువ అన్నట్లుగా ఈ విధానం ఉండటంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సేంద్రియ సాగు విధానాలపై సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తూండటంతో రైతులు కూడా చైతన్యవంతమవుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తూండటం.. పైగా ఆర్గానిక్‌ ఉత్పత్తుల వాడకంపై ప్రజల్లో స్పృహ పెరగడంతో జిల్లాలోని పలువురు రైతులు ప్రకృతి సాగుపై మొగ్గు చూపుతున్నారు.

ఎక్కడెక్కడంటే..

గతంలో చాలా తక్కువ మంది మాత్రమే సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించగా.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 37 వేల మంది రైతులు ఏకంగా 44,357 ఎకరాల్లో ఈ విధానంలో పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, చాగల్లు, కొవ్వూరు, నల్లజర్ల, తాళ్లపూడి, కడియం తదితర మండలాల్లో అధిక సంఖ్యలో రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. వరి, వాణిజ్య పంటలైన బొప్పాయి, అరటి, జామతో పాటు వంగ, బెండ, దొండ, చిక్కుడు, పొట్ల, బీర, ఆనప, కాకర వంటి కూరగాయలను సైతం సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. వరి అయితే ఎకరానికి 40 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడులు సాధించి, దండిగా లాభాలు ఆర్జిస్తున్నారు. పెరవలి మండలం అన్నవరప్పాడు, మల్లేశ్వరం, ఖండవల్లి, ముక్కామల, తీపర్రు, కాపవరం, అజ్జరం, కాకరపర్రు, వెంకట్రాయపురం, నల్లాకులవారిపాలెం గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతోంది.

ఇదీ మేలు

రసాయనిక ఎరువులు అధికంగా వినియోగించడంతో వలన భూములు చౌడుబారి, సారం కోల్పోతున్నాయి. పచ్చిరొట్ట పైర్ల సాగుపై నిర్లక్ష్యం వహించడం వలన కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. సేంద్రియ సాగులో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్ల సాగు వంటివి ప్రధాన భూమిక పోషిస్తాయి. జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పంటలు వేస్తే భూమికి ఎకరానికి రెండు టన్నుల ఎరువు అందుతుందని అధికారులు చెబుతున్నారు. కేవలం కషాయాలతో, పశువుల ఎరువుతో చేపట్టే ఈ సాగు వలన భూసారం పెరిగి, తెగుళ్ల వ్యాప్తి కూడా తగ్గుతోంది. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, నీమాస్త్రం, బీజామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, పంచగవ్య వంటివి సొంతంగా తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తూండటంతో తెగుళ్ల నివారణ సులువవుతోంది. మూడేళ్లుగా ప్రకృతి సాగు విధానాలు అవలంబించడంతో పంట భూములు ఎంతో సారవంతంగా మారాయని రైతులు అంటున్నారు. పైగా సేంద్రియ విధానంలో పండించిన పంట దిగుబడులకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తోందని చెబుతున్నారు.

డ్రోన్‌లతో పిచికారీ

సేంద్రియ వ్యవసాయంలో జిల్లా అధికారులు ఓ అడుగు ముందుకు వేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయంలో పురుగు మందుల పిచికారీకి డ్రోన్లు వినియోగాన్ని ప్రారంభించారు. జిల్లా అధికారులు దీనిని అందిపుచ్చుకుని కషాయాల పిచికారీకి కూడా డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని ప్రతి మండలంలో 250 ఎకరాల్లో డ్రోన్ల ద్వారా కషాయాలు పిచికారీ చేయాలని నిర్ణయించారు. డ్రోన్‌తో పిచికారీకి ఎకరానికి రూ.350 నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు. మామూలుగా మనుషులతో ఎకరం విస్తీర్ణంలో పిచికారీ చేయాలంటే ఒక రోజు పడుతుంది. అదే డ్రోన్‌తో కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతోంది. ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతూండటంతో రైతులు డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

రూ.50 వేల లాభం

సేంద్రియ విధానంలో రెండేళ్ల కిందట అరటి సాగు చేపట్టాను. గత ఏడాది ఎకరానికి రూ.50 వేల లాభం వచ్చింది. పెట్టుబడి తక్కువ.. నాణ్యమైన దిగుబడులు రావడంతో మార్కెట్టులో మంచి ధర లభించింది. ప్రస్తుతం అరటితో పాటు వరి కూడా ఇదే పద్ధతిలో సాగు చేస్తున్నాను. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం మాని, తెగుళ్ల నివారణకు కేవలం కషాయాలే వినియోగిస్తున్నాను.

– ఇ.కన్నయ్య, రైతు, ఖండవల్లి,

పెరవలి మండలం

పెట్టుబడి తక్కువ

సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేశాను. గత ఏడాది అరెకరంలో సాగు చేస్తే మంచి ఆదాయం వచ్చింది. ఇప్పుడు మూడెకరాల్లో అన్ని రకాల కూరగాయలూ పండిస్తున్నాను. ఈ విధానంలో పెట్టుబడి తక్కువ. అంతే కాకుండా భూసారం పెరిగి, మంచి దిగుబడులు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయమే మేలు.

– కె.శ్రీరామమూర్తి,

రైతు, ఖండవల్లి

రైతులను ప్రోత్సహించాం

సేంద్రియ సాగు విస్తీర్ణం పెంచాల నే ఉద్దేశంతో రైతులతో ముఖాము ఖి చర్చలు జరిపి, పోత్సహించాం. వారిని ఒప్పించడానికి మొదట చా లా ఇబ్బందులు పడ్డాం. మూడేళ్ల పాటు శ్రమ పడ్డాం. ఆ ఫలితం ఇప్పుడు వస్తోంది. పెరవలి మండలంలోని రైతులు 2,500 ఎకరాల్లో వివిధ పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్ని రకాల పంటలూ పండిస్తూండటంతో గతంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సైతం ఇక్కడకు వచ్చి స్వయంగా పరిశీలించారు.

– తాతారావు, సేంద్రియ సాగు జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
సేంద్రియ సాగు.. భళా1
1/4

సేంద్రియ సాగు.. భళా

సేంద్రియ సాగు.. భళా2
2/4

సేంద్రియ సాగు.. భళా

సేంద్రియ సాగు.. భళా3
3/4

సేంద్రియ సాగు.. భళా

సేంద్రియ సాగు.. భళా4
4/4

సేంద్రియ సాగు.. భళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement