
22 నుంచి నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు
దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నం వద్ద ఉన్న నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. దీనికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఏలూరు పీఠాధిపతి, విశాఖ అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర చెప్పారు. పుణ్యక్షేత్రంలోని కొండపై ఉన్న క్రీస్తు దేవాలయం వద్ద మేరీ మాత పతాకాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించి, అఖండ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేసి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, గౌరీపట్నంలోని మేరీ మాత పుణ్యక్షేత్రానికి నాలుగు జిల్లాల నుంచి ఏడాది పొడవునా అశేషంగా భక్తజనం వస్తున్నారని, కుల మత వర్గ భావాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రం వెలసి 40 సంవత్సరాలు కావస్తోందన్నారు. ఇక్కడ అఖండ దేవాలయం ప్రారంభించి 25 ఏళ్లు అయినందున ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకలకు మద్రాసు అగ్రపీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ ఆంథోనీ స్వామి, వివిధ జిల్లాల నుంచి పీఠాధిపతులు హాజరు కానున్నారని తెలిపారు. భక్తులకు మజ్జిగ, నిత్యాన్నదానం, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఈ ఏడాది మహోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించిందన్నారు. పుణ్యక్షేత్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని జయరావు తెలిపారు. ఉత్సవాలకు పోలీసు సిబ్బందితో పాటు సుమారు 250 మంది వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్ మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలూ, కల్పిస్తున్నామని, సేద తీరడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ పి.బాల కూడా మాట్లాడారు. కార్యక్రమంలో జయరావు పొలిమెరను రెవరెండ్ ఫాదర్ జాన్‌పీటర్, ఫాదర్లు సన్మానించారు. రెవరెండ్ ఫాదర్ మోజెష్, నిత్యాన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు కళ్లే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ 25 వరకూ నిర్వహణ
ఫ ఏలూరు పీఠాధిపతి జయరావు
Comments
Please login to add a commentAdd a comment