ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు?
● ఇసుక విక్రయాలపై ప్రత్యేకాధికారి ప్రశ్న
● అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ‘గతంలో టన్ను ఇసుక ధర రూ.475 ఉంది. ఏజెన్సీలు రూ.229కి కోట్ చేశాయి. కానీ, ఇప్పటికీ రూ.400కు పైగా అమ్ముతున్నారు. దీనికి కారణమేమిటి?’ అని మైన్స్ కమిషనర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇసుక సరఫరా ఏజెన్సీలు సాధ్యం కాని ధర ప్రతిపాదించి, ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నాయని నిలదీశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన డీఎల్‌ఎస్‌ఏ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇదే తీరు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై నిర్వహించే సమావేశానికి ఓపెన్, డీసిల్టేషన్ ఏజెన్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. జరిగిన తప్పులు సరిచేసుకోవాలని, ఇకపై రీచ్‌లలో ప్రభుత్వ సిబ్బందిని కూడా నియమిస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. వినియోగదారులతో నేరుగా సంభాషిస్తామన్నారు. మొదట వచ్చిన వారికి మొదట ఇసుక అందించేలా రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. ఇసుక తవ్వకాల సందర్భంగా పర్యావరణ అనుమతుల విషయంలో ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కచ్చితమైన మార్గదర్శకాలు పాటించాలని అన్నారు. రవాణా వ్యవస్థపై పర్యవేక్షణ తప్పనిసరని స్పష్టం చేశారు. పనితీరు సరిగ్గా లేని కొన్ని ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, మైన్స్ ఈడీ డి.ఫణిభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment