
గోపాలపురం మండలంలో డయేరియా
గోపాలపురం: మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా డయేరియా ప్రబలుతోంది. శని, ఆదివారాల్లో సుమారు 25 మంది వాంతులు, విరేచనాలతో గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో చేరారు. వీరిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కె.వెంకటేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామా ల్లో పొగాకు పనులకు వలస వచ్చిన కూలీలు డయేరియా బారిన పడినట్లు గుర్తించామన్నారు. వీరిలో 19 మందికి ప్రథమ చికిత్స చేశామని, మిగిలిన ఆరుగురికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందన్నారు. డయేరియాకు గురైన గ్రామాల్లో 10 వైద్య శిబిరాలు, 20 మొబైల్ క్యాంపులు ఏర్పా టు చేశామని వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జె.సంధ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సహకార శాఖలో నెలాఖరుకు
కంప్యూటరీకరణ పూర్తి
కొవ్వూరు: జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్లు జిల్లా సహకార అధికారి ఎం.జగన్నాథరెడ్డి తెలిపారు. కొవ్వూరులోని శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, కాపవరం పీఏసీఎస్‌లను ఆదివారం ఆయన సందర్శించి, కంప్యూటీకరణ పురోగతి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, డివిజన్‌లోని 58 సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 107 సంఘాల్లో డీసీటీ సైన్ ఆఫ్, ఫ్రీ మైగ్రేషన్ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం మూడో దశలో ఆన్‌లైన్ ఓచర్ల నమోదు ప్రక్రియ చురుకుగా కొనసాగుతోందని చెప్పారు.
రత్నగిరికి భక్తుల వెల్లువ
అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ టేకు రథంపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగిసేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

గోపాలపురం మండలంలో డయేరియా
Comments
Please login to add a commentAdd a comment