ఇన్‌చార్జి డీఎస్‌ఓగా భాస్కరరెడ్డి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పౌర సరఫరాల అధికారి(ఎఫ్‌ఏసీ)గా కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కరరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఆయన ఇన్‌చార్జి డీఎస్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. భాస్కరరెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీఎస్‌ఓగా ఉన్న ఏఎస్‌ఓ ఎం.నాగాంజనేయులు స్థానంలో భాస్కరరెడ్డిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో ఈ నెల 1న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు ద్వితీయ సంవత్సరం రసాయన, వాణిజ్య శాస్త్రాలతో పాటు ఒకేషనల్ విభాగంలో గ్రూపు సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. జనరల్ విభాగంలో 17,894 మందికి గాను 17,651 మంది పరీక్షలు రాశారు. 243 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 991 మందికి గాను 874 మంది పరీక్షలు రాశారు. 117 మంది పరీక్షలు రాయలేదు. మొత్తం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి ఎన్‌ఎస్‌ఎల్‌వీ నరసింహం తెలిపారు.
నేడు ఫారెస్ట్ రేంజ్
ఆఫీసర్ల స్క్రీనింగ్ టెస్ట్
రాజమహేంద్రవరం రూరల్: ఏపీపీఎస్సీ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలు ఆదివారం నిర్వహిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఈ విషయం తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో తన చాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక రాజీవ్‌గాంధీ విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 696 మంది హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్టుతో పాటు, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకుని రావాలని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రంలోకి చేరుకోవాలన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. పురుషోత్తపట్నం, సీతానగరం గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు పరీక్ష కేంద్రం మార్గంలో వెళ్తాయని, అభ్యర్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. పరీక్ష కేంద్రం లోపలకు బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే అనుమతిస్తారన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర పేపర్లు అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారన్నారు. అవసరమైతే వైద్య సహాయం అందించడానికి మెడికల్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా, అలాగే, కళాశాలలో అవసరమైన ఏర్పాట్లపై యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని జేసీ చిన్నరాముడు అన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు జె.చంద్రరావు, జె.జనార్దన్, సమన్వయ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 143 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. బాలురు 12,791, బాలికలు 11,972 కలిపి మొత్తం 24,763 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. అలాగే, ప్రైవేటుగా 960 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు 1,100 మంది ఇన్విజిలేటర్లను, 10 ప్రత్యేక బృందాలను నియమించారు. ఇప్పటికే సెట్–1, సెట్–2 ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు జిల్లాకు చేరాయి. వీటిని జిల్లావ్యాప్తంగా 22 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. కడియపులంక, పోతవరం, రాజుపాలెం జెడ్పీ హైస్కూళ్లు, ధవళేశ్వరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భూపతిపాలెం ఏపీ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వీటి వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు.
‘వాహనాల ఫిట్‌నెస్‌కు
అక్కడ సంప్రదించండి’
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో వాహనాల ఫిట్‌నెస్‌కు ఇకపై రాజానగరంలోని కంట్రోల్ అల్ట్ ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేటు సంస్థను సంప్రదించాలని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ శనివారం తెలిపారు. అన్ని రకాల మోటారు వాహనాల ఫిట్‌నెస్ నిర్వహణను ఈ ఏజెన్సీ నిర్వహిస్తుందన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు వాహనాల తనిఖీలు నిర్వహించి, ధ్రువపత్రాలు జారీ చేస్తారని పేర్కొన్నారు.
ఇన్‌చార్జి డీఎస్‌ఓగా భాస్కరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment