
15న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐలో పాసైన అభ్యర్థులకు జిల్లాలో గల ప్రముఖ పరిశ్రమలలోను, బ్లూస్టార్, శ్రీసిటీలో అప్రెంటిస్ షిప్ కోసం ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ ఎల్‌ఆర్‌ఆర్ కృష్ణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు ‘ఆంధ్రపేపర్ లిమిటెడ్‘ రాజమహేంద్రవరం, కడియం యూనిట్లలోను, ధవళేశ్వరంలోని ‘హిందూస్తాన్ యూనిలివర్‘ సంస్థలో ఐటీఐ ఫిట్టర్ పాస్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల నకలు, ప్రొఫైల్ రిజిస్టర్ కాపీలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13 లోపుగా అందజేయాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: సత్యదేవునికి చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు మంగళవారం స్వామి, అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు తులసి దళార్చన నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 20 లక్షల ఆదాయం సమకూరింది.
ఘనంగా సీతారాముల వేద సదస్యం
కాగా, రత్నగిరి రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సీతారాముల వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారిని మరో ఆసనంపై ఉంచి పూజలు చేశారు. సీతారాములకు నూతన పట్టు వస్త్రాలను ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు అందజేశారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, చిట్టి శివ, గంగబాబు, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి కార్యక్రమం నిర్వహించారు.
నేడు రాష్ట్ర స్థాయి
మేనేజ్‌మెంట్ ఫెస్ట్
కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద నన్నయ్య ఎంఎస్‌ఎన్ పీజీ సెంటరులో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో తలాష్ – 2కె 25 పేరిట రాష్ట్రస్థాయి మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌ను బుధవారం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రశాంతి శ్రీ తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నన్నయ్య యూనివర్శిటీ వీసీ ప్రసన్న శ్రీ,, ఓఎన్‌జీసీ ఈడీ రత్నేష్‌కుమార్ హాజరవుతారన్నారు.
సింగిల్ నంబర్ లాటరీ
స్థావరాలపై దాడులు
కాకినాడ క్రైం: కాకినాడలో కూటమి నేతల అండదండలతో విచ్చలవిడిగా లక్షల్లో జరుగుతున్న నంబర్‌గేమ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెంగళూరు కేంద్రంగా చేసుకుని దినసరి కూలీలు, నిరుపేదల జీవితాలతో చెలగాటమాటమాడుతున్న సింగిల్ నంబర్ లాటరీల భాగోతాన్ని గత నెల 20న ‘కూటమి వారి లాటరీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ బిందుమాధవరావు తీవ్రంగా స్పందించి ఆకస్మికంగా దాడులు చేయించారు. కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్‌లై ఓవర్, సంజయ్‌నగర్ లారీ ఆఫీసు, ఎమ్‌ఎస్‌ఎన్ చారిటీస్ నూకాలమ్మ గుడి వద్ద పార్కు తదితర ప్రాంతాల్లో నిత్యం సింగిల్ నంబర్ లాటరీతో పేదల పొట్టగొడుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కాకినాడ టూటౌన్, త్రీటౌన్ పరిధిలో పలు సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలను పోలీసులు గుర్తించారు. నంబర్ గేమ్ ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదును, మొబైల్‌ఫోన్‌లను స్వాఽధీనం చేసుకున్నారు. నంబర్ గేమ్‌కు మూలాలు, పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.