
ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు
గండేపల్లి: 2025లో బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాలు సాధించిన 1507 మంది విద్యార్థులు, వారిని పోత్సహించిన తల్లిదండ్రులకు ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పరుచూరి కృష్ణారావు అభినందనలు తెలిపారు. సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్ డే–2025 వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగ కల్పనలో పురోగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ టీసీఎస్‌కు చెందిన చల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినప్పటికీ నూతన ఆవిష్కరణలు పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్య అతిథిని సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, కె.సత్యనారాయణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎం.రాధికామణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విధులకు ఆటంకం
కలిగించిన వారిపై కేసు
సీతానగరం: మండలంలోని రఘుదేవపురం పంచాయతీ కార్యదర్శి గేదెల జయ భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్యాభర్తలైన తన్నీరు జయమ్మ, నూకరాజుపై కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్ కుమార్ శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రఘుదేవపురం చెరువు గట్టును ఆక్రమించి ఇల్లు కడుతున్న జయమ్మ, నూకరాజులపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణ నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీ కార్యదర్శి జయ భార్గవి తన సిబ్బందితో కలిసి ఈనెల ఒకటిన నోటీసులు అందించడానికి వెళ్లారు. అయితే వారి విధులకు జయమ్మ, నూకరాజు ఆటంకం కలిగించి, దుర్భాషలాడుతూ, భయభ్రాంతులకు గురి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.