
వాడపల్లి వెంకన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ ప్రాంగణంతో పాటు వాడపల్లి గ్రామం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఏడు వారాలు – ఏడు ప్రదక్షిణల నోము చేపట్టిన భక్తులు వేంకటేశ్వరస్వామిని వివిధ నామాలతో కొలుస్తూ మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఏడువారాలు పూర్తయిన భక్తులు స్వామివారికి అష్టోత్తర పూజలు జరిపించారు. అనంతరం ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, అన్నప్రసాదం స్వీకరించారు. డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారికి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఆన్‌లైన్ ద్వారా దేవస్థానానికి రూ.42,03,230 ఆదాయం సమకూరిందని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.