
వీర్లపై వారి వైఖరేమిటో!
● నివేదిక సమర్పించి నాలుగు రోజులైనా వీడని సందిగ్ధత
● సింహగిరి చందనోత్సవం తరువాతేనని ఊహాగానాలు
● పరిశీలనలో ముగ్గురు ఆర్‌జేసీలు,
ఒక డీసీ పేర్లు
అన్నవరం: రత్నగిరిపై ఇటీవల నెలకొన్న వివాదాలు, ఈఓ వీర్ల సుబ్బారావు వ్యవహార శైలి, ఆయన కుమారుడి జోక్యం, తదితర అంశాలపై దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ కె.చంద్రకుమార్ విచారణ జరిపి నివేదిక సమర్పించి నాలుగు రోజులైనా తదుపరి చర్యలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌కు ఇచ్చిన నివేదికలో సాక్షిలో వచ్చిన పలు కథనాల ఆధారంగా పలువురు ఉద్యోగుల అభిప్రాయాలను సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నమోదు చేసిన రికార్డులను పొందుపరచారు. దేవస్థానంలో సూపరింటెండెంట్లు, ఏఈఓలతో 22వ తేదీ, మంగళవారం ఏడీసీ చంద్రకుమార్ సమావేశమై విచారణ నిర్వహించారు. తరువాత ఈఓ వీర్ల సుబ్బారావు తో కూడా ఆయన మాట్లాడారు.
కమిషనర్ బిజీతో ఆలస్యం?
కాగా, సింహాచలం దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా చందనోత్సవ ఏర్పాట్లలో కమిషనర్ రామచంద్రమోహన్ తలమునకలైన ఉండడం వల్లే రత్నగిరి వ్యవహారాల్లో చర్యలు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. 29వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ప్రారంభం కానున్న చందనోత్సవానికి సుమారు 300 మంది సిబ్బందిని వివిధ దేవస్థానాల నుంచి డెప్యుటేషన్‌పై తరలించారు.
ఈఓ బదిలీపై ఊహాగానాలు
నివేదిక ఆధారంగా ఈఓ వీర్ల సుబ్బారావును రత్నగిరి నుంచి బదిలీ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మే ఏడో తేదీ నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు సాగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత నెమ్మదించవచ్చనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి.
పరిశీలనలో నలుగురి పేర్లు
ఈఓ సుబ్బారావు బదిలీ జరిగితే ఆ స్థానంలో ఎవరిని నియమించాలనేదానిపై ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ ఈఓలుగా పని చేసిన ముగ్గురు ఆర్‌జేసీల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఇద్దరు దేవస్థానం ఈఓలుగా పనిచేస్తుండగా, ఒకరు సెలవులలో ఉన్నారు. మరో ఆర్‌జేసీ శాఖాపరమైన పోస్టులో ఉన్నారు. కాగా, గతేడాది డీసీగా పదోన్నతి పొందిన అధికారిని ఈఓగా నియమించాలని టీడీపీకి చెందిన మెట్ట ప్రాంత సీనియర్ ఎమ్మెల్యే సిఫారసు చేసినట్టు సమాచారం. ఆర్‌జేసీ పదోన్నతుల జాబితాలో ఆయన స్థానం రెండోది. అందువల్ల ఆయనను ఈఓగా నియమించి ఆ తరువాత పదోన్నతి కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది.
కొనసాగేలా ఈఓ పావులు
కాగా, దేవస్థానం ఈఓగా తనను కొనసాగించాలని ఈఓ వీర్ల సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇటీవల ఒక టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడిని కలిసి వేడుకున్నారని ఆయన కమిషనర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారని అంటున్నారు. అలాగే ఇతర ఎమ్మెల్యేలను కూడా ఆయన కలుస్తున్నట్టు సిబ్బంది చెప్తున్నారు.

వీర్లపై వారి వైఖరేమిటో!