
పీజీఆర్‌ఎస్‌కు 189 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ప్రజలు 189 అర్జీలు సమర్పించారు. ఇందులో 93 రెవెన్యూ, 23 పంచాయతీరాజ్, 18 పోలీస్, 51 ఇతర శాఖలవి ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడుతో కలసి ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదని, త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి శాఖ పరిధిలో పరిష్కరించిన ఫిర్యాదులకు సంబంధించి తప్పనిసరిగా ఆడిట్ చేయించాలన్నారు. అర్జీలపై విచారణ అనంతరం తీసుకున్న చర్యలను సంబంధిత ఫిర్యాదీలకు వాట్సాప్‌లో తెలియజేయాలని, వాయిస్ మెసేజ్ కూడా పంపాలని చెప్పారు.