బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వారసుని ఎంపిక కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంకృతాపరాధాల ఫలితంగా అవమానకరమైన రీతిలో ప్రధాని పదవి నుంచి ఆయన తప్పుకోవలసి వచ్చింది. తొలిదశలో ఎనిమిదిమంది పోటీపడ్డారు. వీరిలో ఇద్దరిని కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు ఎంపిక చేయవలసి ఉంటుంది. రెండు రౌండ్లు ముగిసిన తర్వాత పోటీ నుంచి ముగ్గురు నిష్క్రమించారు. టాప్ టూలో మొదటి స్థానంలో రిషీ సునాక్, రెండో స్థానంలో పెన్నీ మోర్డంట్ ఉన్నారు. పార్లమెంట్ సభ్యుల ఎంపికలో తుదివరకూ ఈ ఇద్దరే నిలబడవచ్చని అంచనా వేస్తున్నారు. కన్సర్వేటివ్ పార్టీలో సభ్యులుగా ఉన్న రెండు లక్షలమంది ఈ ఇద్దరిలో ఒకరిని ప్రధాని పదవికి ఎన్నుకుంటారు. ఇప్పటివరకు ముందంజలో ఉన్న రిషి సునాక్‌కు భారతీయ మూలాలు ఉండడమే మనకు సంబంధించినంతవరకు ఈ వారం వార్తా విశేషం.
గండభేరుండ రాజ‘పక్షులు’ ఎగిరిపోవడంతో శ్రీలంక కథ ఈ వారమే క్లైమాక్స్‌కు చేరుకున్నది. ప్రజాస్వామ్యం పేరుతో అధికార పీఠాన్ని ఎక్కి కుటుంబ పాలనతో నిరంకుశాధికారాలను చలాయించి శ్రీలంకను దివాళా అంచుకు నెట్టడం తాజావార్త కాదు. లంక వీధుల్లో జనస్వామ్యం ప్రజ్వరిల్లడమే వేడివేడి వార్త. నిరంకుశ ప్రభువులను తరిమి తరిమి కొట్టడమే గరమ్‌గరమ్ వార్త. వారి మెడలు వంచి రాజీనామాలిప్పించడమే ఈ వారపు తుదివార్త. తదుపరి కార్యక్రమాన్ని శ్రీలంక పార్లమెంట్ వచ్చేవారం చేపట్టబోతున్నది.
ఈ రెండు పరిణామాలు ఆయా దేశాల ఆంతరంగిక వ్యవహారాలే కావచ్చు. కానీ, ఆర్థిక – సాంకేతిక రంగాల గ్లోబలైజేషన్ తర్వాత దేశాల ఏకాకితనం దూరమైంది. ఎక్కడ తీగ లాగినా డొంకంతా కదులుతున్నది. ఈ సందర్భంలో ఇతర దేశాల డొంకల కంటే భారత్ డొంక ఇంకొంచెం ఎక్కువ కదులుతున్నది. భారత ఉపఖండంలో భాగమైన దేశం శ్రీలంక. నిజానికి మనదేశానికి ఉపగ్రహం లాంటి దేశం. అలాంటి దేశంతో అచ్చిక బుచ్చికలాడి చైనా వాళ్లు మచ్చిక చేసుకున్నారు. అప్పులిచ్చి ప్రలోభపెట్టి, షరతులు పెట్టి దివాళా తీయించి దానితో ఆటలాడుకున్నారు. ఇటువంటి సమయంలో తలెత్తిన ఈ పరిణామాలు మిగిలిన ప్రపంచం కంటే భారత్‌కే ఎక్కువ ఆసక్తికరం. అవసరం కూడా! బ్రిటన్ పరిణామాలు భావోద్వేగపరమైనవి. రెండొందల ఏళ్లపాటు ఈ దేశాన్ని పీల్చి పిప్పిచేసిన బ్రిటీష్ సామ్రాజ్యవాద దేశానికి ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రధానమంత్రి కాగలడా అని ఎదురు చూసే అవకాశం రావడం... అదీ ఆజాదీ అమృతోత్సవ సంవత్సరం కావడం... ఒక ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన సన్నివేశం!
తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి బ్రిటన్‌కు వలస వచ్చిన కుటుంబాల్లో మూడోతరం వాడు రిషీ సునాక్. అంతకంటే ఎన్ని తరాల ముందు ఇండియా నుంచి ఆఫ్రికా వెళ్లారనే వివరాలు అందుబాటులో లేవు. పూర్వీకులది పంజాబ్. రిషి తండ్రిపేరు యశ్‌వీర్. తల్లి పేరు ఉష. రిషి పితామహుడు కెన్యా నుంచి, మాతామహుడు టాంజానియా నుంచి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడ్డారు. తమ కుటుంబం ఇప్పటికీ భారతీయ ఆచార సంప్రదాయాలనే పాటిస్తున్నదని రిషి బహిరంగంగానే ప్రకటించారు. తనను తాను బ్రిటీష్ ఇండియన్‌గా ప్రకటించుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు తాను హిందువునని కూడా ఆయన చెప్పుకున్నారు. మతాన్నీ, రాజకీయాలనూ మిళితం చేయకపోవడం, వేరువేరుగా పరిగణించడం బ్రిటన్ ప్రజల్లో ఉన్న ఒక గొప్ప సుగుణం. అందువల్లనే రిషి తనను తాను హిందువుగా పరిచయం చేసుకోగలిగారు. ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె ఆకాంక్షను ఆయన పెళ్లి చేసుకున్నారు.
రిషి అనేది భారతీయ పదమే. మరి సునాక్? ఇంటి పేరా? భారతీయ రుషి పరంపరలో శునకుడనే రిషి కూడా ఉన్నాడు. మహాభారత కథలో సుప్రసిద్ధుడైన శౌనక మహర్షి తండ్రిగా శునక మహర్షి ప్రస్తావన ఉంటుంది. ఒకవేళ రిషికి పెట్టాలనుకుంటే ప్రసిద్ధుడైన శౌనక రుషి పేరే పెడతారు కానీ అంతగా పేరు లేని శునక రుషి పేరెందుకు పెడతారు? పైగా శునకమంటే గ్రామసింహం. కాకపోతే రుషులకు పక్షుల పేర్లు, జంతువుల పేర్లు ఉండటం కూడా రివాజే! రామాయణంలో పిడకల వేట అనేది మన సంప్రదాయంలో ఒక భాగం కనుకనే ఈ పేరు గురించిన చర్చ. ఒకవేళ టోరీలు రిషిని ప్రధానిగా ఎంపిక చేస్తే ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ సవివరంగా బయటకొస్తాయి.
ఎంపీల మద్దతు లభించినప్పటికీ పార్టీ సభ్యుల్లో మెజారిటీ కూడగట్టడం కష్టమే అనే అభిప్రాయం ఉన్నది. ఇప్పటికే బోరిస్ జాన్సన్ రిషికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాడు. తాను ప్రజాదరణ కోల్పోవడానికి రిషీయే కారణమన్న అభిప్రాయం ఆయనకు ఉన్నది. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం పెన్నీ మోర్డంట్‌కే తదుపరి ప్రధానిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. బ్రిటీష్ ప్రధానమంత్రి రేసులో భారతీయ మూలాలున్న వ్యక్తి సెమీఫైనల్ దాకా దూసుకొనిరావడం కూడా గొప్ప విషయమే. ఇప్పటికే యూరప్‌లో ఒక ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా పూర్వీకులది భారత్‌లోని గోవా రాష్ట్రం. అక్కడి నుంచి ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశానికి వలస వెళ్లి ఆ తర్వాత పోర్చుగల్‌లో స్థిరపడ్డారు.
మారిషస్ అధ్యక్ష, ప్రధానులుగా ఎప్పటినుంచో భారతీయ సంతతి వారుంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇద్దరూ కూడా భారతీయ మూలాలున్నవారే. సింగపూర్, సురినామ్, గయానా, సీషెల్స్ ప్రస్తుత అధ్యక్షులు భారతీయ సంతతివారే! పాతికేళ్లపాటు మలేషియాకు నాయకత్వం వహించిన మహతీర్ మొహమ్మద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ కేవలం ఒక మెట్టు దూరంలోనే ఉన్నారు. అయితే అత్యున్నత పదవిని చేపట్టడానికి ఆమె రెండు పెద్ద ఆటంకాలను దాటవలసి ఉన్నది. ఒకటి – డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడం. రెండవది – ట్రంప్ లాంటి ప్రత్యర్థిని ఎదిరించి గెలవడం. కష్టమైన పనే! కానీ, రానున్న రోజుల్లో అమెరికా, బ్రిటన్, కెనడా దేశాధినేతలుగా భారతీయ సంతతివారు ఎన్నికయ్యే అవకాశాలు మాత్రం మెరుగవుతున్నాయి.
భారతీయ మూలాలున్నవారు ఇతర దేశాల అధినేతలుగా ఉన్నంత మాత్రాన భారత్‌కు కలిగే ప్రయోజనమేమిటి? అదొక గర్వకారణం. ఒక తెలుగు సినిమాలో గురుశిష్యులైన పురోహితులుంటారు. గురువంటాడు శిష్యునితో – ‘అయితే అమితాబ్ బచ్చన్ కూడా మనవాళ్లేనేంట్రా?’ అని! ‘ఔను గురువుగారూ! వారు అలహాబాద్ బ్రాహ్మలు, మనం హైదరాబాద్ బ్రాహ్మలం. అంతే తేడా’ అని బదులిస్తాడు శిష్యుడు. ‘కిక్కురా కిక్కు’ అని పరవశించిపోతాడు గురువు. అలాంటి పరవశమేదో మనవాళ్లకు కలగవచ్చు. అది భావోద్వేగపరమైన ప్రయోజనం. ఎన్నో తరాలకు ముందే బతుకుతెరువు కోసం వెళ్లి అక్కడి సంస్కృతిలో, ఆచారాల్లో పుట్టి పెరిగినవారు కనుక మానసికంగా వారు ఆయా దేశాల పౌరులుగానే తయారవుతారు. తాతలనాటి దేశం కనుక భారత్‌పై వారికి అమ్మమ్మగారి ఊరి మీద ఉండేంత ప్రేమ ఉంటే ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఆశించలేము. ఆయా దేశాల ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే భారతీయ సంతతి వారైనా సరే వ్యవహరిస్తారు. కాకపోతే తటస్థ వేదికలపై కశ్మీర్ లాంటి అంశాలపై, సొంత దేశానికి ఇబ్బంది కలగని ఇతర విషయాల్లో భారత్‌కు అనుకూలంగా మెలగవచ్చు. అంతమాత్రమైనా దేశానికి ప్రయోజనకరమే!
‘గాడ్‌ఫాదర్’ నవల్లోని (సినిమా కూడా) మాఫియా డాన్ కాలీయోనీ కుటుంబంలోని పాత్రల వంటివే రాజపక్సే కుటుంబ పాత్రలని లంక ప్రతిపక్షాల అభిప్రాయం. నలుగురు అన్నదమ్ముల్లో మహింద రాజపక్సే ప్రముఖుడు. 2005 నుంచి 2015 వరకు ప్రధానిగా, అధ్యక్షునిగా లంకలో చక్రం తిప్పినవాడు. 2009 మిలిటరీ ఆపరేషన్‌తో ప్రత్యేక తమిళ ఉద్యమాన్ని నామరూపాల్లేకుండా చేసి సింహళ జాతీయవాద బౌద్ధులకు ప్రీతిపాత్రుడయ్యాడు. ఈయన హయాంలోనే భారత్‌ను కాదని చైనాకు లంక దగ్గరయింది. తమిళుల ఊచకోతకు అవసరమైన ఆయుధాలను చైనా సరఫరా చేసింది. మానవ హక్కుల హననాన్ని భారత్‌తోపాటు మిగిలిన ప్రపంచం ఖండించినా, చైనా మాత్రం స్పందించలేదు. తన అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా లంక పాలకుడిని చైనా మచ్చిక చేసుకున్నది. అడిగిందే తడవుగా అప్పులు సమకూర్చింది. చైనా అప్పుల్లో రాజపక్సే కుటుంబానికి ఒక సౌలభ్యం కనిపించింది. తీసుకున్న రుణంలో సొంతానికి ఎంత కైంకర్యం చేసినా చైనా పట్టించుకోదు. మిగిలిన రుణదాతలైతే ఇచ్చిన రుణాన్ని దేనికెంత ఖర్చు పెడుతున్నారో లెక్క చెప్పమని అడుగుతారు. రుణగ్రస్థ దేశం ఆ రుణాన్ని సద్వినియోగపరిస్తేనే తిరిగి చెల్లించగలిగే స్థితిలో ఉంటుంది కనుక అటువంటి పర్యవేక్షణ ఉంటుంది. రుణగ్రస్థ దేశాన్ని అప్పుల ఊబిలో ముంచి మెడలు వంచడమే చైనా లక్ష్యం కనుక లెక్కలడగదు. కానీ మిగిలిన వారికంటే ఎక్కువ వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తుంది. అప్పుల ఊబిలో ముంచే హంబన్‌తోట ఓడరేవును చైనా 99 ఏళ్లపాటు లీజుకు రాయించుకుంది. అయినా చైనా అప్పుల కోసమే రాజపక్సేలు ఎగబడ్డారు. ఆ పదేళ్ల కాలంలో సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు (భారతీయ కరెన్సీలో) మహింద సొంతానికి పోగేసుకున్నాడనే ఆరోపణలున్నాయి.
మొన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబయకు ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. సొంత కుటుంబీకులు ఈయనను ‘టెర్మినేటర్’ అనే ముద్దు పేరుతో పిలుచుకుంటారు. తమిళ ఈలం ఉద్యమాన్ని నెత్తుటేరుల్లో ముంచిన ఘనత ఈయనదే. అప్పట్లో రక్షణమంత్రిగా ఉండేవాడు. మరో సోదరుడు చమల్ రాజపక్సే మొన్నటిదాకా నీటిపారుదల శాఖ మంత్రి. మహింద అధ్యక్షునిగా ఉన్నప్పుడు స్పీకర్‌గా ఉండేవాడు. సిరిమావో బండారు నాయకే ప్రధానిగా ఉన్నరోజుల్లో ఆమెకు అంగరక్షకుడిగా పనిచేశారు. అందువల్ల ‘బాడీగార్డ్’ అనే పేరు స్థిరపడిపోయింది. అన్నదమ్ముల్లో ఆఖరివాడు బాసిల్ రాజపక్సే. ఆర్థికమంత్రిగా అవకతవక విధానాలతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత ఈయనదే. కాంట్రాక్ట్ ఏదైనా సరే ఈయనకు ముందుగా పదిశాతం ముట్టజెప్పాలి. అందుకే ‘మిస్టర్ టెన్ పర్సెంట్’ అనే పేరుతో ఈయన్ను పిలుచుకుంటారు. మహింద కుమారుడు నమల్ రాజపక్సే క్రీడలు – యువజన వ్యవహారాల మంత్రి. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న రోజుల నుంచే పెత్తనానికి అలవాటుపడ్డాడు. మరో అరడజన్ మంది రాజపక్సేలు, ఇంకొన్ని డజన్ల మంది వారి బంధువులు, హితులు రాజ్యాధికార చక్రం తిప్పి శ్రీలంక సంక్షోభానికి మరింత ఆజ్యం పోశారు.
తీసుకున్న రుణంలో కొంతభాగాన్ని సొంతానికి వాడుకోవడానికి అలవాటుపడ్డ కారణంగా రాజపక్సేలు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారు. జీడీపీతో సమానంగా అప్పులు పెరిగాయి. 2015 ఎన్నికల్లో రాజపక్సేలు ఓడిపోవడానికి చైనా అప్పులు కూడా ఒక ప్రధాన కారణం. 2019లో జరిగిన ఎన్నికల్లో గెలవడానికి గొటబయ అలవికాని హామీలిచ్చాడు. వ్యాట్‌ను 15 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తాననీ, సంపన్నులక్కూడా ఆదాయపు పన్ను తగ్గిస్తాననీ వాగ్దానం చేశాడు. అధికారంలోకి రాగానే వాటిని అమలుచేశాడు. ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. విదేశీ రుణాలు చెల్లించలేక చేతులెత్తేశాడు. ప్రధాన ఆదాయ వనరైన టూరిజం కరోనా కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది. కెమికల్ వ్యవసాయాన్ని మానివేసి ఎకాయెకిన అందరూ సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని శాసనం చేశాడు. రైతాంగాన్ని అందుకు సన్నద్ధం చేయకుండా రాత్రికి రాత్రే చేసిన ఈ మార్పు వల్ల దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. విదేశీ మారకాన్ని ఆర్జించిపెట్టే తేయాకు దిగుబడి కుదేలైంది. విదేశీ మారకం అడుగంటడంతో చెల్లింపులు చేయలేక నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. నో పెట్రోల్, నో డీజిల్, నో గ్యాస్. ఆహార ధాన్యాలకూ, కూరగాయలకూ కొరతే! ద్రవ్యోల్బణం విశ్వరూపం దాల్చింది. జనం రోడ్డున పడ్డారు. ప్రభంజనమై ఒక్క ఉదుటన కదిలారు. ఆధ్యక్ష ప్రధానమంత్రుల భవనాలను ముట్టడించారు. రాజపక్షులు పలాయనం చిత్తగించాయి.
గడిచిన వారం రోజులుగా బీదాబిక్కీ బక్కజనం, మధ్యతరగతి యువజనం నగర వీధుల్లోనూ, అధ్యక్ష భవనంలోనూ చేసిన సందడి, చూపిన తెగువ ప్రజాస్వామ్య ప్రియులకు కనువిందు చేసింది. అధ్యక్ష కార్యాలయంలో అతని కుర్చీ మీద ఓ పేద యువకుడు ఠీవిగా కూర్చొని ఫైలు మీద సంతకం చేస్తున్నట్టు నటిస్తుంటాడు. మిగిలిన యువకులంతా హర్షధ్వానాలు చేస్తుంటారు. ఎంత మనోహరమైన దృశ్యం! ఎక్కడ ఆ ప్రజా కంటక పాలకుడు? అంతిమ విజేతలు ఎప్పుడైనా ప్రజలే కదా అనే సందేశాన్ని ఇచ్చినట్టు కనిపించిందీ సన్నివేశం. ఈ సంపూర్ణ ప్రజాస్వామ్యం ఆయుష్షు బహుశా ఇంకో మూడు నాలుగు రోజులుండవచ్చు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి త్వరలో పార్లమెంట్ సమావేశం కాబోతున్నది. అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు కట్టబెట్టిన నిబంధనల్ని ఎత్తివేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కొత్త ప్రభుత్వం మొదటి కార్యక్రమం కావచ్చు. తర్వాత ఏర్పడబోతున్న ప్రభుత్వం చైనా ప్రభావం నుంచి కొంతదూరం జరగవచ్చు. ఎందుకంటే దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో ప్రధాన భూమిక పోషించిన చైనాపై ప్రజల్లో ఆగ్రహం కనబడుతున్నది. ఇండో – పసిఫిక్ మహాసముద్ర తీరాల్లో ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఏ రకంగా ఎక్కడ బ్రేక్‌పడినా ఆ మేరకు భారత్‌కు ప్రయోజనమే!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
అడ్వాంటేజ్ ఇండియా?
Published Sun, Jul 17 2022 12:04 AM | Last Updated on Sun, Jul 17 2022 3:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment