శీతాకాల సమావేశాలకు బ్రేక్‌ | No Parliament Winter Session Due To Covid 19 | Sakshi
Sakshi News home page

శీతాకాల సమావేశాలకు బ్రేక్‌

Published Thu, Dec 17 2020 4:33 AM | Last Updated on Thu, Dec 17 2020 4:33 AM

No Parliament Winter Session Due To Covid 19 - Sakshi

పార్లమెంటు శీతాకాల సమావేశాలపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలు నిజమేనని తేలింది. వాటిని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్‌ మహమ్మారే ఇందుకు కారణమంటోంది. రివాజు ప్రకారమైతే నవంబర్‌ మధ్యలోనే సమావేశాలు మొదలుకావాలి. అలా జరగలేదు గనుక ఈసారి వుండకపోవచ్చునని అందరూ అనుకున్నారు. పార్లమెంటు ఏడాదికి మూడుసార్లు సమావేశం కావాలి. అయితే ఏ రెండు సమావేశాల మధ్యా ఆర్నెల్లకు మించి వ్యవధి వుండరాదని రాజ్యాంగంలోని 85(1) అధికరణ చెబుతోంది. మొన్న సెప్టెంబర్‌లో వర్షాకాల సమా వేశాలు జరిగాయి. అప్పుడు 18 రోజులపాటు సమావేశాలుంటాయని ప్రకటించినా ఇంకా వారం రోజుల గడువుండగానే అవి ముగిసిపోయాయి. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సమావేశా లకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కువమంది సభ్యులు ఒకచోట చేరే అవకాశం లేకుండా ఉభయ సభలనూ చెరో పూట ఏర్పాటు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దయింది. అయితే ఆ సమావేశాల తీరు మాత్రం యధాప్రకారమే వుంది. ఎప్పటిలాగే అధికార, విపక్ష సభ్యులు వాగ్యుద్ధాలకు దిగారు. రాజ్యసభలో ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు శీతాకాల సమావేశాలు నిలుపుదల చేయడానికి  కేంద్రం చూపిన కారణంకంటే, అందుకనుసరించిన విధానంపై వివాదం తలెత్తింది. సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించడానికి ముందు విపక్ష నేతలతో లాంఛనంగా చర్చించా మని కేంద్రం చెబుతోంటే తమతో ఎవరూ మాట్లాడలేదని కాంగ్రెస్‌ అంటున్నది. పార్లమెంటు సమావేశాల రద్దు వంటి కీలక అంశంలో కూడా ఎవరు నిజం చెబుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యకరమే.

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి క్రమేపీ శాంతిస్తున్న వైనం కనబడుతూనే వున్నా... మును పటితో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా ఆ వ్యాధి పూర్తిగా కనుమరుగుకాలేదు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వ్యాధి మరోసారి విరుచుకుపడినా పడొచ్చని నిపు ణులు కూడా చెబుతున్నారు. అయితే కరోనా కారణాన్నే చూపి శీతాకాల సమావేశాలు రద్దు చేయ దల్చుకుంటే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, బహిరంగసభలు వంటివి కూడా ఆపి వుండాలి. కానీ అవి యధావిధిగా జరిగాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్‌ రాజకీయ పక్షాల పోటాపోటీ ర్యాలీలు, సభలతో సందడిగా మారింది. ఢిల్లీలో ఇతరచోట్లకు భిన్నమైన ప్రత్యేక వాతా వరణ పరిస్థితులున్నాయనుకుంటే ఆ సంగతిని అఖిల పక్ష సమావేశం నిర్వహించి చెబితే ఎవరి అభిప్రాయాలేమిటో ప్రజలందరికీ తెలిసేది. నిజానికి మొన్న వర్షాకాల సమావేశాల సమయంలో సభ్యుల్లో కొందరు వరసగా కరోనా బారిన పడుతున్న తీరు చూసి విపక్ష నేతలే సమావేశాలను కుదిస్తే మంచిదని సూచించారు. వర్షాకాల సమావేశాలనాటికి దేశంలో కరోనా కేసుల తీవ్రత అసాధారణంగా వుంది. ఆ  నెలలో 26 లక్షల కేసులు నమోదయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా సమావేశాలు నిర్వహించి ఇప్పుడు మాత్రం కరోనాను కారణంగా చూపడం ఏమిటన్నది కాంగ్రెస్‌ ప్రశ్న. అయితే ఎటూ బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభం కానుండగా కేవలం కొన్ని రోజుల ముందు శీతాకాల సమావేశాలు జరిపితీరాలని వాదించడం ఏం సబబని బీజేపీ వాదన.

ఎవరేం చెప్పినా సమస్యలు దండిగా వున్నప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవ హరించాలని... సమస్యల విషయంలో తన ఆలోచనలనూ, వైఖరిని తేటతెల్లం చేయాలని అందరూ కోరుకుంటారు. అందుకు చట్టసభే సరైన వేదిక. మీడియా సమావేశాల ద్వారానో, ఇతరత్రా సభలు, సమావేశాల్లోనో ప్రభుత్వాల ఆలోచనలు తెలుస్తుంటాయి. కానీ దాన్ని నిలదీయడానికి, ఒప్పించడా నికి చట్టసభల్ని మించిన వేదికలుండవు. అయితే చట్టసభలు గత కొన్నేళ్లుగా బలప్రదర్శన వేదిక లవుతున్నాయి. ప్రజా సమస్యలపై గళం వినిపించడం కన్నా ఏదో ఒక సాకుతో సభకు అంతరాయం కలిగించడం, మర్నాడు పత్రికల్లో పతాకశీర్షికలకు ఎక్కాలని తపనపడటం విపక్షాల్లో ముదిరింది. దాంతో అర్ధవంతమైన చర్చలకు అవకాశం కొరవడుతోంది. అటు ప్రభుత్వాలు కూడా నామ మాత్రంగా సమావేశాలు కానివ్వడం, కీలకమైన బిల్లుల్ని సైతం మూజువాణి ఓటుతో ఆమోదింప జేసుకోవటం రివాజైంది. గత సమావేశాలే ఇందుకు తార్కాణం. వర్షాకాల సమావేశాలు వరసగా పదిరోజులపాటు కొనసాగాయని, 27 బిల్లులు ఆమోదం పొందాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెబుతున్న మాట వాస్తవమే అయినా ఏ అంశంలో సక్రమంగా చర్చ జరిగిందో, విపక్షాల సూచనలను ఎన్ని సందర్భాల్లో పరిగణనలోకి తీసుకున్నారో లెక్కేస్తే నిరాశ కలుగుతుంది. విపక్షాల వాకౌట్లు, సస్పెన్షన్ల మధ్యే సాగు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయన్న సంగతి మరిచిపోకూడదు. పార్లమెంటులో ఆ బిల్లులపై ఆరోగ్యకరమైన చర్చ జరిగివుంటే ఇప్పుడు తలెత్తిన నిరసనలే వుండేవి కాదు.

దేశంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు. వ్యాక్సిన్‌ త్వరలోనే వచ్చే అవకాశాలు కనబడుతు న్నాయి. ఢిల్లీ వెలుపల రైతుల నిరసనోద్యం సాగుతోంది. వీటన్నిటిపైనా పార్లమెంటు లోతుగా చర్చిస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. గతవారం పార్లమెంటు నూతన భవన సము దాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ సైతం ప్రజా స్వామ్యంలో చర్చల ప్రాధాన్యత గురించి చెప్పారు. కీలకమైన సమస్యలనూ, ప్రభుత్వం తీసుకునే ముఖ్య నిర్ణయాలనూ కూలంకషంగా చర్చించడం, వాటన్నిటిపైనా ఏకాభిప్రాయానికి రాలేక పోయినా, కనీసం సహేతుకమైన సూచనలను పాలకులు ఏదోమేరకు పట్టించుకుంటున్నారన్న అభి ప్రాయం కలగడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ కోణంలో చూస్తే స్వల్పకాలమైనా శీతాకాల సమావేశాల నిర్వహణకే ప్రాధాన్యమిచ్చివుంటే బాగుండేది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement