ఆప్‌ విజయకేతనం | Sakshi Editorial On Aam Aadmi Party Delhi | Sakshi
Sakshi News home page

ఆప్‌ విజయకేతనం

Published Thu, Dec 8 2022 2:23 AM | Last Updated on Thu, Dec 8 2022 2:23 AM

Sakshi Editorial On Aam Aadmi Party Delhi

గుజరాత్‌ తీర్పు వెల్లడికావడానికి 24 గంటలముందు దేశంలోని అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. బలమైన విపక్షమన్న విశ్వాసం ఏర్పడితే ఆదరించటానికి సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ఓటర్లు సంకేతం పంపారు. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లు మూడూ విలీనమై 70 లక్షలమంది ఓటర్లు, 250 వార్డులతో మళ్లీ విస్తృతమైన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ)గా ఆవిర్భవించాక జరిగిన తొలి ఎన్నికల్లో ఆప్‌ 134 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 104 దక్కించుకుంది.

దివంగత నేత షీలా దీక్షిత్‌ ఢిల్లీ ముఖ్య మంత్రిగా ఉన్నకాలంలో అత్యంత శక్తిమంతమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు కేవలం తొమ్మిది స్థానాలకు పరిమితమై దయనీయమైన స్థితిలో పడింది. ఢిల్లీ స్థానిక సంస్థల్లో తొలిసారి 2007లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీని ఎలాగైనా బలహీనపరచాలని కాంగ్రెస్‌ పదిహేనేళ్లుగా ఆప సోపాలు పడుతుంటే ఆప్‌ చాలా స్వల్పకాలంలోనే ఆ పనిని సునాయాసంగా పూర్తిచేసి.... లక్ష్యం ఉంటే సరిపోదని, అందుకు తగ్గ ఆచరణ, చిత్తశుద్ధి అవసరమని తేటతెల్లం చేసింది.

2007లో ఎంసీడీ చేజారటం ఖాయమని గ్రహించిన అప్పటి సీఎం షీలా దీక్షిత్‌ గండం గట్టెక్కటానికి దాన్ని మూడు కార్పొరేషన్లుగా విడగొట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దేశంలో ఇతర ప్రాంతాల మాటేమోగానీ ఢిల్లీలో ఇప్పటికీ ద్విధ్రువ రాజకీయాలే నడుస్తున్నాయని, కాంగ్రెస్‌ స్థానాన్ని ఆప్‌ భర్తీ చేసిందని ఈ ఎన్నికలు నిరూపించాయి. 

ఢిల్లీలో ఎన్నికల ఫలితాల గురించి జోస్యం చెప్పటానికి పెద్దగా నైపుణ్యం అవసరం లేదు. అక్కడి జనం ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఎక్కడ ఎవరి అవసరం ఉంటుందో, ఎవరిని గెలిపించాలో వారికి తెలిసినంతగా మరో ప్రాంతంవారికి తెలియదు. మూడు దఫాలుగా మున్సిపల్‌ కార్పొరేషన్లలో బీజేపీని అవిచ్ఛిన్నంగా గెలిపిస్తూ వస్తున్న ఓటర్లు అనంతర కాలంలో అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఆప్‌నే ఎంచుకున్నారు. అలాగని లోక్‌సభ ఎన్నికలొచ్చేసరికి బీజేపీవైపే మొగ్గుతున్నారు.

అందుకే ఈ ఎన్నికల తీరు చూసి ఎవరేం చెప్పినా తొందరపాటే అవు తుంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఓటర్లు విలక్షణమైనవారైనా ఢిల్లీ రాజకీయ గణం, అధికార యంత్రాంగం మాత్రం అన్నిచోట్లా ఉన్నట్టే ఉన్నారు. దాన్నొక సుందర నగరంగా తీర్చిదిద్దు తామని, సకల సౌకర్యాలతో స్వర్గంగా మారుస్తామని చెప్పిన నేతలే తప్ప చేసినవారు లేరు. దేశ రాజధానిగా ఉన్నందుకైనా అక్కడ పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎవరికీ అనిపించలేదు.

ఆప్‌ వచ్చాక బస్తీ క్లినిక్‌లు కొంతమేరకు ఉపయోగపడిన మాట వాస్తవమే అయినా ఇంకా తగినంతగా వైద్య సౌకర్యాలు మెరుగుపడలేదనే చెప్పాలి. ఎంసీడీ వార్షిక బడ్జెట్‌ రూ. 15,200 కోట్లు. అందులో దాదాపు లక్షన్నరమంది సిబ్బంది ఉన్నారు. 2 కోట్ల మంది నగర జనాభాకు కావల సిన జనన, మరణాల ధ్రువీకరణ, వివాహ ధ్రువీకరణ మొదలుకొని వాణిజ్య లైసెన్సుల జారీ, చెత్త తొలగింపు, ప్రాథమిక విద్య పర్యవేక్షణ, ఆరోగ్య సర్వీసులు, కాలనీ రోడ్ల నిర్వహణ తదితరాలన్నీ చూసుకునే బాధ్యత ఎంసీడీదే.

ఇన్నాళ్లూ కార్పొరేషన్లు బీజేపీ చేతుల్లోనూ, ప్రభుత్వం ఆప్‌ అధీనంలోనూ, అత్యధిక సర్వీసులన్నీ కేంద్రం చేతుల్లోనూ ఉండటంతో తరచు సమస్యలు తలెత్తేవి. కార్పొరేషన్ల వైఫల్యాల గురించి ఆప్‌ సర్కారు ఏకరువు పెట్టడం, సమస్య ప్రభుత్వం చేతిలోనే ఉన్నదని ఆ కార్పొరేషన్ల చైర్మన్‌లు ఎదురుదాడికి దిగటం రివాజుగా సాగేది. ముఖ్యంగా ఘాజీపూర్, భలాస్వా, జహంగీర్‌పూర్, ఓఖ్లాలలో కొండల్లా పెరిగిన డంపింగ్‌ యార్డులు బీజేపీ వైఫల్యాన్ని పట్టిచూపాయి.

అన్ని రాజకీయ పక్షాల మాదిరే ఆప్‌ కూడా మున్సిపల్‌ పాలన అత్యద్భుతంగా ఉంటుందని ఊరించింది. అదెంతవరకూ నిలబెట్టుకుంటుందో చూడాలి. అందరి మాదిరే ఆప్‌ కూడా అనిపించేలా వ్యవహరిస్తే ఆ పార్టీని జనం క్షమించరు. ఈ ఎన్నికల్లో నెగ్గి ఎప్పటిలానే పాగా వేయటానికి బీజేపీ చేయనిదంటూ లేదు.

అవినీతి ఆభియోగాల కేసులో అరెస్టయిన ఆప్‌ నేత, మంత్రి సత్యేందర్‌ జైన్‌ తిహార్‌ జైల్లో రాజవైభోగాలు అందుకుంటున్నట్టు నిరూపించే సీసీ టీవీ ఫుటేజ్‌లను చానెళ్లలో ఒకటికి పదిసార్లు ప్రసారమయ్యేలా చూసి లబ్ధి పొందుదామని బీజేపీ ప్రయ త్నించింది. కానీ జైన్‌ అసెంబ్లీ స్థానం పరిధిలోని మూడు మున్సిపల్‌ స్థానాలూ ఆప్‌కే దక్కాయి. ఓటర్లు జైన్‌పై అభియోగాలను పట్టించుకోలేదని ఫలితాలు నిరూపించాయి. 

ఈ నెల్లాళ్ల ప్రచారంలో 15 మంది కేంద్ర మంత్రులు, ఆరుగురు ముఖ్యమంత్రులు ఢిల్లీ వీధుల్లో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగారు. మూడు కార్పొరేషన్ల వల్ల ఆచరణలో పెద్దగా లాభం లేకపోగా అందువల్ల అనవసర వ్యయం పెరిగిందని, వాటి పనితీరు మందగించిందని చెప్పి మూడింటినీ విలీనం చేయాలని కేంద్రం గత మే నెల 22న వాటిని రద్దు చేసింది. ఈ ప్రక్రియలో 272 వార్డులు కాస్తా 250కి తగ్గిపోయాయి.

ఫలితాల సరళి చూస్తే పూర్వపు తూర్పు ఢిల్లీ కార్పొరేషన్‌ పరిధిలోని 77 స్థానాల్లో బీజేపీకి 42 వచ్చాయి. విలీనం లేకుంటే ఆ ఒక్కటయినా బీజేపీ ఖాతాలో పడి పరువు దక్కేది. ఫిరాయింపుల చట్టం ఉండీ లేనట్టే మిగిలిపోయిందని వివిధ రాష్ట్రాల్లో గోడ దూకుళ్లు రుజువు చేశాయి. స్థానిక సంస్థల్లో కనీసం ఆ అడ్డు కూడా లేదు.

ఢిల్లీలో బీజేపీ ఆ పని చేయదని ఆశించాలి. అధికారాన్ని ఖరీదు చేయటం ద్వారా ఎవరూ జనం మెప్పు పొందలేరు. ఈ ఫలితాలతో ఆప్‌ బాధ్యత మరిన్ని రెట్లు పెరిగింది. దాన్ని నిలబెట్టుకోవటమా లేదా అనేది ఆ పార్టీ చేతుల్లో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement