చదవడమే మొదలు... | Sakshi Editorial on Ann Morgan Reading a Book from Every Country | Sakshi
Sakshi News home page

చదవడమే మొదలు...

Published Mon, Mar 14 2022 12:04 AM | Last Updated on Mon, Mar 14 2022 12:04 AM

Sakshi Editorial on Ann Morgan Reading a Book from Every Country

ఒకరోజు ఆన్‌ మోర్గాన్‌ తన బుక్‌షెల్ఫ్‌ చూసుకుంది. సుమారు ఇరవై ఏళ్ల గొప్ప కలెక్షన్‌ అది. కానీ ప్రధానంగా అన్నీ ఇంగ్లిష్, నార్త్‌ అమెరికన్‌ పుస్తకాలే. ఈ లండన్‌ నివాసికి ఏమాత్రమూ సంతృప్తి కలగలేదు. ‘ఇరవై ఏళ్లుగా చదువుతున్నానే! కానీ ఒక విదేశీ భాషా పుస్తకాన్ని నేను దాదాపుగా ముట్టుకోనేలేదు’ అనుకుంది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది, ప్రపంచంలోని దేశాలన్నింటికీ సంబంధించి కనీసం ఒక్క పుస్తకమైనా చదవాలని. ఐక్యరాజ్య సమితి గుర్తింపున్న 193 దేశాల జాబితా చూసుకుని తన యజ్ఞం మొదలుపెట్టింది. దీన్ని యజ్ఞం అనడం ఎందుకంటే, వీటన్నింటినీ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల!

ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటంటే– అన్ని దేశాల పుస్తకాలు సంపాదించాలి; డబ్బు, శ్రమ. ఒక దేశానిది ఒకటే అనుకున్నప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే సమస్య ఉండనే ఉంది. క్లాసిక్స్, జానపదాలు, సమకాలీన సాహిత్యం, నవలలు, కథాసంపుటాలు, ఆత్మకథలు, బెస్ట్‌ సెల్లర్స్‌... ఎలా వడపోయాలి? జపాకు ప్రాతినిధ్యం వహించగలిగే పుస్తకం ఏది? ఏది చదివితే కువైట్‌ సరిగ్గా అర్థమవుతుంది? ఉత్తర కొరియా నుంచి ఎలాంటిది తీసుకోవాలి? ఏది చదివితే తోగో పరిచయం అవుతుంది? ఖతార్‌కు చేరువ కాగలిగే పుస్తకం ఏది? వీటన్నింటినీ మదిలో ఉంచుకుని, స్నేహితులు, తెలిసినవాళ్లు, ఔత్సాహికుల సాయంతో పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టింది.

అసలైన సమస్య ఇంకోటుంది. రోజువారీ పనులు మన కోసం ఆగవు. మోర్గాన్‌ వృత్తిరీత్యా పాత్రికేయురాలు. ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యం చేరాలంటే, అటూయిటుగా ఒక్కో పుస్తకం 200–300 పేజీలు ఉంటుందనుకుంటే, 1.85 రోజులో పుస్తకం చదివెయ్యాలి. చదవడంతోపాటు చిన్న సమీక్ష రాయాలనుకుంది. ఆ పుస్తకం ఎలాంటిదో చెబుతూ తన పఠనానుభవాల్ని కూడా జోడిస్తూ బ్లాగ్‌ రాసుకుంటూ పోయింది. భూటాన్, బెలారస్, మంగోలియా, బురుండి, మొజాంబిక్‌ లాంటి ఎన్నో దేశాల పుస్తకాలు ఆమె జాబితాలో ఉన్నాయి. ఇంతకీ భారత్‌ నుంచి ఏం తీసుకుంది? పదేళ్లు చదివినా భారతీయ వైవిధ్యభరిత సారస్వత వైభవపు ఉపరితలాన్ని కూడా చేరలేనని తనకు తెలుసంటుంది మోర్గాన్‌ . కానీ లెక్క కోసం ఎం.టి.వాసుదేవన్‌  నాయర్‌ మలయాళీ నవల ‘కాలం’ తీసుకుంది. అది ఆమెకు గొప్పగా నచ్చింది కూడా! తన పఠనానుభవాలన్నింటినీ కలిపి 2015లో ‘ద వరల్డ్‌ బిట్వీన్‌  టు కవర్స్‌: రీడింగ్‌ ద గ్లోబ్‌’ పుస్తకంగా ప్రచురించింది.

గతేడాది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్‌  లీ కూడా ఇలాంటి పనే చేసింది. కాకపోతే ఆమె ప్రయోగం వేరు. కోవిడ్‌ మహమ్మారి మొదలైన కొత్తలో బయటికి వెళ్లలేని జీవితంతో విసుగెత్తి ఆన్‌ లైన్‌  జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంది. దానికిగానూ తనలాంటి వారందరినీ ఆహ్వానిస్తూ, లియో టాల్‌స్టాయ్‌ మహానవల ‘యుద్ధము–శాంతి’ని సామూహిక పఠనం చేద్దామని పిలుపునిచ్చింది. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం, మొత్తంగా 85 రోజుల్లో వెయ్యికి పైగా పేజీల నవల పూర్తయ్యింది. తన పఠనానుభవాలను ‘టాల్‌స్టాయ్‌ టుగెదర్‌: 85 డేస్‌ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ పేరుతో పుస్తకంగా రాసింది లీ.

ఇరాకు చెందిన ప్రొఫెసర్‌ అజర్‌ నఫీసీ అనుభవం దీనికి భిన్నమైనది. ఆమె ‘రీడింగ్‌ లోలిటా ఇన్‌  తెహ్రాన్‌ ’ పేరుతో 2003లో పుస్తకం ప్రచురించింది. ఛాందస ప్రభుత్వంలో తనలాంటి ఉదారవాది ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజెప్పడమే రచన లక్ష్యం అయినప్పటికీ పుస్తకాల ఊతంగా తన అనుభవాలను చెప్పడం ఇందులోని విశేషం. కొన్ని పాశ్చాత్య రచనలను గురించి తన విద్యార్థులతో చర్చించే నేపథ్యంలో ఈ రచన సాగుతుంది. ఇందులో చర్చకు వచ్చే కొన్ని పుస్తకాలు: మదామ్‌ బావరీ(ఫ్లాబే), ద గ్రేట్‌ గాట్స్‌బీ(ఫిట్జ్‌గెరాల్డ్‌), ద డైరీ ఆఫ్‌ ఆన్‌  ఫ్రాంక్, ద ట్రయల్‌ (కాఫ్కా), ద అడ్వెంచర్స్‌ ఆఫ్‌ హకల్‌బెరీ ఫిన్‌ (మార్క్‌ ట్వెయిన్‌ ). మానవ లైంగికతను ప్రధానంగా చేసుకొన్న నబకోవ్‌ నవల ‘లోలిటా’ కూడా ఇందులో ఉంది. దాన్నే పుస్తక శీర్షికగా ఎంచుకోవడానికి కారణం – ఇరాన్‌  లాంటి దేశంలో ఉండే పరిమితులు, పరిధులు, ఆంక్షలను తెలియజెప్పడానికే!
పుస్తకాన్ని రాయడం గొప్పనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ దాన్ని చదవడంలో కూడా గొప్పతనం తక్కువా? ఒక వెయ్యి పేజీల మహత్తర గ్రంథరాజాన్ని చదవడం తక్కువ ప్రయత్నంతో కూడినదా? పైగా దాన్ని చదవడం వల్ల కూడా రచయిత అనుభవాన్ని జీవించగలుగుతున్నప్పుడు, ఉత్త పాఠకులుగానే మిగిలిపోతే మాత్రమేం? పైగా రచయిత పడే శ్రమ కూడా తప్పుతుంది. కానీ మోర్గాన్‌  లాంటి కొందరు పాఠకులు, కేవలం వారి పఠనానుభవం కారణంగా రచయితగా మారగలిగారు.

‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ రాసినప్పుడు, పాత్రికేయుడు కల్లూరి భాస్కరం ప్రధాన వనరు–శీర్షిక సూచిస్తున్నట్టుగా మహాభారతమే! ఇందులోని పరిశోధనా పటిమను తక్కువ చేయడం కాదుగానీ ప్రాథమికంగా అది ఒక సీరియస్‌ పాఠకుడు మాత్రమే చేయగలిగే వ్యాఖ్యానం. అలాగే ‘కన్యాశుల్కం పలుకుబడి’ని వివరిస్తూ మరో జర్నలిస్ట్‌ మందలపర్తి కిశోర్‌ గురజాడ పదకోశమే వెలువరించారు. సరిగ్గా చదవడానికి పూనుకోవాలేగానీ ప్రతి పుస్తకంతోనూ ప్రపంచాన్ని దర్శించవచ్చు; అలాగే ప్రతి పుస్తకంతోనూ ప్రపంచానికి పరిచయం కూడా కావొచ్చు. ఏ రచయితైనా పాఠకుడిగానే తన కెరియర్‌ను మొదలుపెడతాడని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా!
ఇప్పుడు మీ చేతిలో ఏ పుస్తకం ఉంది?    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement