జైలు తప్పదా బాబూ? | Sakshi Editorial On Chandrababu Politics by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

జైలు తప్పదా బాబూ?

Published Sun, Mar 26 2023 2:15 AM | Last Updated on Sun, Mar 26 2023 2:15 AM

Sakshi Editorial On Chandrababu Politics by Vardhelli Murali

తోటకూర కట్ట దొంగిలించినప్పుడే మందలించి ఉంటే బిడ్డ గజదొంగగా మారకపోవు గదా అని బాధపడిందట వెనుకటికి ఒక తల్లి. చిన్ననాటి చేతివాటాన్ని చూసి అప్పుడు ముచ్చట పడింది. పెద్దయ్యాక తొండ ముదరడంతో కంగారు పడింది. మన యెల్లో మీడియాకు మాత్రం అటువంటి కంగారేమీ లేదు. ముప్పయ్యేళ్లుగా చంద్రబాబు ప్రదర్శిస్తున్న జిత్తులమారితనానికి అది మురిసిపోతూనే ఉన్నది. బాబు వ్యూహం, బాబు ఎత్తుగడ, బాబు మంత్రాంగం వంటి పేర్లతో భజన చేసింది. ఇప్పుడు కూడా అదే వరస. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినా, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలి పారిపోయినా యెల్లో మీడియా బాణీ మారలేదు. అమరావతి నిర్మాణం కోసం హైదరాబాద్‌ను వదిలి వచ్చాడని సర్దిచెప్పింది. అది బాబు కమిట్‌మెంట్‌గా బాకా ఊదింది.

ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ‘ఈనాడు’ పత్రికాధిపతి చంద్రబాబుకు తోడుగా నిలబడ్డాడు. ఇవి రాజ కీయపరమైన ఆరోపణలు కావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప కులు ఎన్టీ రామారావు పబ్లిగ్గా చెప్పిన మాటలు. ‘రామోజీరావు గొంతెమ్మ కోర్కెలు నేను తీర్చలేకపోయాను. అందువల్లనే ఆయన నా మీద కత్తిగట్టాడు.

చంద్రబాబు నయవంచకుడు. మొదటి నుంచీ అతనివి స్వార్థపూరిత ఆలోచనలే. అదను కోసం నా దగ్గర పొంచి ఉన్నాడు. సమయం రాగానే వెన్నుపోటు పొడి చాడు’ అని రామారావు బహిరంగంగా ఆరోపించారు. ఈ అపవిత్ర కూటమి గురించి ఎన్టీ రామారావు కంటే సాధికారికంగా ఎవరు చెప్పగలరు? అపవిత్ర కూటమికి అందలం దక్కితే పవిత్ర కార్యక్రమాలు చేపడుతుందని ఆశించడం అవివేకం కాదా?

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాలనలో వ్యతిరేక వార్తలు లేవు. అన్ని పత్రికలూ ఆస్థాన భజంత్రీలే. ఉపఎన్నికల్లో గెలుపు కోసం ఆ రోజుల్లోనే చంద్రబాబు కోట్లు గుమ్మరిస్తే, ఎన్నికలను జూదంగా మారిస్తే ‘ఆహా చంద్రబాబు చాణక్యం’ అని కీర్తించాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే,ఎంపీలను ఫిరాయింపజేస్తే, స్థానిక సంస్థల్లో మెజారిటీ లేకున్నా పీఠాలను కైవసం చేసుకుంటే చంద్రబాబు చక్రం తిప్పాడని రాసేవారు.

ఇటువంటి చర్యలు తప్పులుగా, ప్రజాస్వామ్య విరుద్ధమైనవిగా యెల్లో ఫోర్త్‌ ఎస్టేట్‌కు కనిపించలేదు. కనుకనే బాబు చెలరేగిపోయారు. వ్యవస్థలను మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నారు. న్యాయ వ్యవస్థలో నెగ్గుకు రావడమెలాగో అభ్యాసం చేశారు. ఎన్టీ రామారావు నుంచి పార్టీని, జెండాను, బ్యాంకు ఎకౌంట్లను ‘న్యాయ’బద్ధంగా లాగేసుకున్నారు. ఆ అనుభవం అక్కరకొచ్చింది. ఎవరైనా కోర్టుల్లో కేసులు వేస్తే స్టేలు తెచ్చుకోవడంలో ప్రావీణ్యత సంపాదించారు. ఆయన అవినీతిపై పత్రికలు ఒక్క ముక్కా రాయలేదు.

రెండెకరాల కుటుంబ ఆస్తితో రాజకీయ జీవితం మొదలు పెట్టిన చంద్రబాబు వేలకోట్ల ఆస్తులకు పడగెత్తారు. దేశంలోని రాజకీయ నాయకులందరిలోకి చంద్రబాబే సంపన్నుడని తెహల్కా డాట్‌కామ్‌ లెక్కలతో సహా ఆనాడే ప్రకటించింది. వామపక్షాలు కూడా ఈయన ఆస్తుల వివరాలతో కరపత్రాలు ప్రచురించాయి. కానీ యెల్లో మీడియా మాత్రం ఏనాడూ బాబు స్కామ్‌ల జోలికి వెళ్లలేదు.

ఆయన అక్రమాస్తులపై దర్యాప్తు కోరుతూ న్యాయస్థానాల్లో పిటీషన్లు పడితే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థ విచిత్రమైన సాకులు చెప్పింది. తమ దగ్గర తగినంత సిబ్బంది లేని కారణంగా బాబు అక్రమాస్తులపై దర్యాప్తు చేయ లేమని న్యాయస్థానానికే చెప్పింది. ఇదీ చంద్రబాబు నిర్వహణా ‘దక్షత’. ఈ దక్షతనే యెల్లో మీడియా నేటికీ వేనోళ్ల కొనియాడు తున్నది.

ఏపీ అసెంబ్లీ నుంచి మొన్న జరిగిన కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికలోను చంద్రబాబు చాతుర్యాన్ని యెల్లో మీడియా ప్రశంసించకుండా ఉండలేకపోయింది. 175 మంది సభ్యులున్న అసెంబ్లీ నుంచి ఈ దఫా ఏడుగురిని కౌన్సిల్‌కు ఎన్నుకోవలసి ఉన్నది. సభలో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులుండాలి. కానీ పార్టీతో విభేదించి వేరువేరు సందర్భాల్లో నలుగురు సభ్యులు పార్టీకి దూరంగా జరిగారు.

అధికారపక్షం వారు ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం వలన వారు స్వతంత్రంగా ఉంటున్నారు. టీడీపీకి 19 మంది మిగిలారు. ఒక్కరిని కౌన్సిల్‌కు గెలిపించుకోవడానికి 22 ఓట్లు కావాలి. నికరంగా 19 ఓట్లే ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపింది. తెలుగుదేశం పార్టీ తన పాత పద్ధతుల్లోనే బేరసారా లకు దిగుతుందని అప్పుడే అర్థమైంది. అందుకు అనువైన వాతావరణాన్ని కూడా వైసీపీ నాయకత్వం కల్పించింది.

ప్రజా దరణ కోల్పోతున్న ఎమ్మెల్యేలనూ, గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించడంలో పలుమార్లు విఫలమైన వారినీ వైసీపీ నాయ కత్వం గుర్తించింది. వారిలో కొందరికి హెచ్చరికలు జారీ చేసింది. ఇక బాగుపడే అవకాశం లేని కేసులుగా భావించిన వారిని పిలిచి, ‘వచ్చే ఎన్నికల్లో మీకు టిక్కెట్‌ ఇవ్వబోవడం లేద’ని నాయకత్వం ఖరాఖండిగా చెప్పేసింది.

ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ అసంతృప్తిని రెండు నెలల కిందనే వెళ్లగక్కారు. తెలుగు దేశం పార్టీతో సఖ్యతగా ఉండటం మొదలుపెట్టారు. పార్టీ కూడా వీరిని దూరం పెట్టి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నది. ఈ రెండు ఓట్లనూ వైసీపీకి లెక్కలోకి తీసుకోలేదు. ఏ అభ్యర్థికీ కేటాయించలేదు.

టిక్కెట్‌ రాదని తెలిసి అసంతృప్తితో ఉండే చేపలను పట్టేందుకు చంద్రబాబు వలవేసి కూర్చున్నారు. ఈ రెండు చేపలూ ముందుగానే పడ్డాయి. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ నాయకత్వానికీ, స్వయంగా ముఖ్యమంత్రికీ కూడా తెలుసు. అయినా సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవడానికే ఆయన కట్టు బడ్డారు. ఓటింగ్‌ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లి శ్రీదేవి ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చారు.

ఆరోజు కూడా ఆమెకు టిక్కెట్‌పై హామీ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ సంగతి యెల్లో మీడియా హెడ్డు ‘ఈనాడే’ రాసింది. తప్పుడు హామీలిచ్చి ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవాలనుకుంటే చంద్రబాబు వలలో పడ్డ నాలుగు ఓట్లూ వైసీపీ ఖాతాలోనే ఉండేవి. కానీ ఒక సీటును గెలుచుకోవడం కంటే మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమనే నిబద్ధతను ముఖ్యమంత్రి జగన్‌ ప్రదర్శించారు. 

ఇది నాయకత్వ లోపంగా, చాతుర్యం లేకపోవడంగా యెల్లో మీడియా పరిగణిస్తున్నది. వైసీపీలో టిక్కెట్‌ దొరకదని ఖాయంగా తేలిపోయిన నాలుగు పుచ్చు వంకాయల కొను గోలుకు 50 కోట్లు వెచ్చించడం చంద్రబాబు సమర్థతగా కనిపించింది. తెలుగునాట రాజకీయాలను ఈ స్థాయిలో భ్రష్టుపట్టించిన ఘనత మాత్రం నిస్సందేహంగా బాబు – యెల్లో మీడియా కాంబినేషన్‌దే!

మీడియాలో ఇప్పటికీ పెద్ద సెక్షన్‌ బాబు వెంటనే ఉన్నది. వ్యవస్థలతో నెగ్గుకు రావడం తనకు తెలిసిన కనికట్టు విద్యే. మిగిలిన ప్రతిపక్షాలను అవసర సమయాల్లో లొంగదీసుకునే వశీకరణ మంత్రం కూడా తెలుసు. కనుక యెల్లో మీడియా దన్నుతో తాను చేసిన లక్షల కోట్ల అక్రమాలు ఎప్పటికీ నిరూ పితం కావనే ధీమా బాబులో ఉండేది. కానీ, ఆయన హిరణ్యకశిపుని కథను మరిచిపోయాడు.

పగలు కానీ – రాత్రి కానీ, భూమిపై కానీ – ఆకాశంలో కానీ, ఏ ఆయుధం చేత కానీ, మనిషి చేత – జంతువు చేతకానీ తనకు మరణం సంభవించ కుండా బ్రహ్మను మెప్పించి హిరణ్యకశిపుడు వరాన్ని పొందాడు. ఆ వరభంగం కాకుండానే నారసింహావతారం ఆ రాక్షసుడిని సంహరించింది. ఎన్ని రక్షణ కుడ్యాలను నిర్మించు కున్నా పాపం చేసినవాడు తప్పించుకోలేడని ఈ కథ మనకు చెబుతున్నది.

అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం అనే కార్యక్రమం వెనుక ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం దాగి ఉన్నదని విజ్ఞులందరికీ ఇప్పుడర్థమవుతున్నది. ఇంగితజ్ఞానం కలిగిన సామాన్యులకు సైతం ఆ కహానీ విన్నప్పుడు అదే అభిప్రాయం కలుగుతుంది. రాజధాని డొంకలో గజిబిజిగా అల్లుకున్న వేలాది అవినీతి తీగెల్లో ఒక తీగె యథాలాపంగా ఒకసారి ఆదాయపు పన్ను అధికారుల కాళ్లకు తగిలింది.

ఆ తీగె వెంట బయల్దేరితే అది చంద్రబాబు ఇంటి దొడ్లోకి దారితీసింది. మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని అనే ఒక కన్సల్టెంట్‌ ఇంట్లో ఏదో కేసుకు సంబంధించి సోదాలు చేసిన ఐటీ అధికారులకు అనుకోకుండా అమరావతి లింకు దొరికింది. దాని మీద శోధన మొదలుపెట్టిన అధికారులు ఈ సృజనాత్మక అవినీతికి నోళ్లు వెళ్లబెట్టారు.

చివరకు తాము శోధించినంత మేరకు ఒక నివేదికను పొందుపరుస్తూ గడిచిన నవంబర్‌లో చంద్రబాబుకు నోటీసులు కూడా పంపించారు. ఈ నాలుగు నెలలు విషయం బయటకు పొక్కకుండా ఆపగలిగేందుకు... చక్రం తిప్పే కళ చంద్రబాబుకు ఉపకరించింది. ఇక ఈ నిప్పును ఎంతోకాలం దాచలేడు.

సదరు మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని అనే ఆయన షాపూర్‌జీ పల్లోంజీ అనే కంపెనీకి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీకి, దాంతోపాటు ఎల్‌ అండ్‌ టీకి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పనులను కాంట్రాక్టు ఇచ్చింది. అమరావతిలో సచివా లయం, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు కొన్ని టిడ్కో ఇళ్లను కూడా అప్పగించారు.

ఈ నిర్మాణాల కోసం చదరపు అడుగుకు రూ. పదకొండు వేలకు పైగా చెల్లిస్తున్నారనీ, ఇది అసాధారణమనీ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కానీ కమీషన్లు భారీగా దండుకోవాలంటే ఆ మాత్రం ఉండాలని బాబు ప్రభుత్వం భావించింది. 2019 జనవరిలో తమకు రావాల్సిన కమీషన్లలో కొంత భాగాన్ని తను కోరు కున్నట్టుగా బదిలీ చేయించుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు.

తన పీఏ శ్రీనివాస్, లోకేశ్‌ పీఏ రాజేశ్‌లకు టాస్క్‌ను అప్పగించారు. వారు మనోజ్‌ వాసుదేవ్‌తో మాట్లాడి తాము చెప్పిన కొన్ని సూట్‌కేస్‌ కంపెనీల్లోకి నిధుల్ని బదిలీ చేయాలని ఆదేశించారు.అలా చెల్లించడానికి మొదట షాపూర్‌జీ కంపెనీ ప్రతినిధులు అశక్తత వ్యక్తం చేశారట! కావాలంటే పార్టీ ఫండ్‌గా ఇస్తామని ఆఫర్‌ చేశారట. అందుకు బాబు పీఏ శ్రీనివాస్‌ అంగీక రించకుండా తాము చెప్పినట్లు చేయకపోతే పెండింగ్‌ బిల్లులు ఆపేస్తామని బెదిరించారు. దీంతో చేసేదిలేక కంపెనీ ప్రతి నిధులు శ్రీనివాస్‌ చెప్పినట్టే చేశారు.

మనోజ్‌ వాసుదేవ్‌ను పిలిచి అర్జెంట్‌గా డబ్బులు కావాలని చంద్రబాబు చెప్పడంతో షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ నుంచి 52 కోట్ల 50 లక్షలను హయగ్రీవ, అన్నై, షలాకా కంపెనీల్లో, 62 కోట్ల 90 లక్షలు నవొలిన్, ఎవరెట్‌ కంపెనీల ఖాతాల్లోకి వేయించాడు. ఎల్‌ అండ్‌ టీతో మాట్లాడి 41 కోట్ల 90 లక్షలు బోగస్‌ కంపెనీల్లో వేయించాడు. ఈ కంపెనీల నుంచి మొత్తం 157 కోట్ల రూపాయలు రామోజీ చిన్నకొడుకు వియ్యంకుడైన ఆర్‌వీఆర్‌ రఘు, మరికొందరి కంపెనీల్లోకి బదిలీ అయ్యాయి.

వారు ఆ సొమ్మును చంద్రబాబుకు చేర్చారు. ఇవి కాకుండా దుబాయ్‌లో చంద్రబాబుకు స్వయంగా క్యాష్‌ రూపంలో 15 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన దీరామ్‌లను అంద జేసినట్టు కూడా మనోజ్‌ వాసుదేవ్‌ ఐటీ అధికారుల ఎదుట వాఙ్మూలాన్నిచ్చాడు. ఈ విషయాలన్నీ నిజమేనని బాబు పీఏ శ్రీనివాస్‌ కూడా అధికారుల ఎదుట అంగీకరించి సంతకం చేశాడు. మనీలాండ రింగ్‌ అంశం కూడా ఇమిడి ఉన్నందువలన నేడో రేపో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ రంగంలోకి దిగే అవకాశం ఉన్నది. పక్కా సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో జైలు శిక్షను తప్పించు కోవడం దాదాపు అసాధ్యమే.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో చంద్రబాబు సర్కార్‌ చేసిన మరో స్కామ్‌లో వివిధ బోగస్‌ కంపెనీల ద్వారా 371 కోట్ల రూపాయలు చంద్రబాబు ఇంటిదారి పట్టాయి. ఈ వ్యవహా
రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగడమే కాకుండా ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేసింది. ఇక్కడ స్కిల్లూ లేదూ, డెవలప్‌మెంటూ లేదు. ప్రజాధనం మాత్రం చంద్రబాబు జూబ్లీ హిల్స్‌ ప్యాలెస్‌కు చేరింది.

రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి సీమెన్స్‌ అనే కంపెనీ ఉదారంగా ముందుకు వచ్చిందనీ, ప్రాజెక్టు విలువ 3,356 కోట్లనీ, అందులో 90 శాతం సీమెన్స్‌ గ్రాంటుగా ఇస్తుందనీ, మనం పదిశాతం పెడితే సరి పోతుందనీ చంద్రబాబు కేబినెట్‌లో చెప్పారు. ఆ తర్వాత జీవోలో కూడా అదే విషయం చెబుతూ రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆ క్లస్టర్లలో ఒక్కో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌ లెన్స్‌ ఉంటుందని చెప్పారు. చివరకు ఒప్పందంలోకి వచ్చేసరికి సీమెన్స్‌ గ్రాంటు ప్రస్తావన లేదు. కొసమెరుపు ఏమిటంటే ఒప్పందం చేసుకున్నది కూడా సీమెన్స్‌ సంస్థతో కాదు.

అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులతో! విషయం తెలిసి కంపెనీ ఆ ఉద్యోగులను తొలగించింది. ఒప్పందంతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. సీమెన్స్‌ గ్రాంటు రాలేదు కానీ ప్రభుత్వం పెట్టాల్సిన పదిశాతం పన్నులతో కలిపి 371 కోట్ల రూపాయలు షెల్‌ కంపెనీల ద్వారా ప్రయాణం చేసి చంద్ర బాబు ఇంటికి చేరుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రంగ ప్రవేశం చేసింది.

ఇప్పుడు సాక్ష్యాధారాలు లభించిన ఈ రెండు కేసులూ చంద్రబాబు అవినీతి పురాణానికి సంబంధించిన టిప్‌ ఆఫ్‌ ది ఐస్‌బర్గ్‌ మాత్రమే. తవ్వాల్సిన కొండ ఇంకా చాలా ఉన్నది. ఇప్పటికే వెలుగు చూసిన కొండ కొస అంచు కూడా చాలు – బాబుకు శిక్ష పడేందుకు! అందుకే ఆయనలో భయం పెరిగింది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్‌ గజగజ వణుకుతున్నాడనే పాట మొదలుపెట్టాడు.

యథా బాప్‌... తథా బేటా! పితాశ్రీని చూసి సుతాశ్రీ కూడా మొదలుపెట్టాడు. నన్ను చూసి జగన్‌ భయపడుతున్నాడనీ పాదయాత్రకు వచ్చే కార్య కర్తలకు వినోదాన్ని పంచుతున్నాడు. సుతాశ్రీ డైలాగులు వింటుంటే కిల్‌ బిల్‌ పాండే (బ్రహ్మానందం క్యారెక్టర్‌) గుర్తు కొస్తున్నాడని కార్యకర్తలు మురిసిపోతున్నారు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement