కరోనా వైరస్ రెండో దశ విజృంభణ మన దేశంలో వుంటుందా వుండదా అనే అంశంపై చాలా వాదోపవాదాలు జరిగాయి. అది ఇప్పటికే వచ్చిందన్నవారు కూడా వున్నారు. కానీ తొలిసారి కేంద్ర ప్రభుత్వం కరోనా రెండో దశ దేశంలో మొదలైందని మంగళవారం ప్రకటించింది. ఇది మహా రాష్ట్రలో తలెత్తిందని, అక్కడ సరైన రీతిలో ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ విషయంలో మందలించింది కూడా. నిరుడు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అమలైన స్థాయిలో నియంత్రణలుండాలని సూచించింది. మొత్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య దేశంలో క్రమేపీ పెరుగుతుండటం వాస్తవం. గత వారం రోజుల తీరు గమనిస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్ తదితర 19 రాష్ట్రాల్లో ఈ పెరుగుదల నమోద వుతోంది. వారంక్రితం కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ధోరణి కనబడింది. మరణాల సంఖ్య కూడా ఆ మేరకు పెరుగుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితరచోట్ల కొన్ని ప్రాంతాల్లో మళ్లీ రాత్రి పూట కర్ఫ్యూ విధించటం మొదలుపెట్టారు.
కరోనా వైరస్ మహమ్మారి విస్తరణ అంచనాలకు అందని విధంగా వున్నదని వైద్య రంగ నిపు ణులు మొదటినుంచీ అంటున్నారు. నిరుడు అక్టోబర్‌కు ఆ వైరస్ తగ్గుముఖం పడుతున్న వైనం కన బడుతున్నప్పుడు దాని విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని, ఎప్పటిలానే అప్రమత్తంగా వుండటం అవసరమని వారు సూచించారు. దురదృష్టవశాత్తూ ఆ హెచ్చరికలను అందరూ పెడచెవిన పెట్టారు. సాధారణ జీవనం కోసం వెంపర్లాట మొదలైంది. ఎప్పటిలాగే పండగలు, ఉత్సవాలు, ఊరేగింపుల జోరు పెరిగింది. ఒకపక్క అనేక దేశాల్లో రెండో దశ తీవ్రత ఎలా వున్నదో మీడియా ద్వారా తెలు స్తున్నా ఎవరూ పెద్దగా లక్ష్యపెట్టలేదు. గత నెల నుంచి కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లోకన్నా మహారాష్ట్రలో ఈ ధోరణి ఎక్కువగా కనబడుతోంది. ఒక చోటనుంచి ఒక చోటకు జనం రాకపోకలు సాగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోనైనా తలెత్తే వైరస్ అక్కడికే పరిమితం కాదు. ఒకరినుంచి ఒకరికి... ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తూనే వుంటుంది.
దాదాపు మూడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గత శనివారం 24,882 కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటినుంచి కొత్తగా వచ్చే కేసుల సంఖ్య పైపైకి పోతూనేవుంది. మహారాష్ట్రలో రోజుకు సగటున 1,600 కేసులు వస్తున్నాయి. మూడు నెలలక్రితం ఈ సంఖ్య ఇంచుమించు 500. దాన్నిబట్టే వైరస్ వ్యాప్తి వేగం ఎలావుందో అర్థమవుతుంది. ఈసారి రోగగ్రస్తుల్లో ఎలాంటి లక్ష ణాలూ కనబడకపోవటం ఆందోళన కలిగించే అంశం. వ్యాధి సోకినవారికి ఆ సంగతి తెలియక యధావిధిగా తిరుగుతూ వుండటం, వారి ద్వారా కొత్తవారికి వ్యాపించటంతో వైరస్ విస్తరణ ఎక్కు వైంది. వైరస్‌లు సహజంగానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న క్రమంలో ఉత్పరివర్తనం చెందు తుంటాయి. కరోనా వైరస్‌లో ఈ ఉత్పరివర్తన వేగం ఎక్కువగా వున్నదని శాస్త్రవేత్తలు చెబు తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న టీకాలన్నీ నిరుడు జనవరిలో వ్యాపించివున్న వైరస్ రకం ఆధారంగా రూపొందించినవి. అప్పటితో పోలిస్తే ఈ వైరస్ ఎన్నో మార్పులకు లోనైంది. ప్రతి దేశంలోనూ వందల రకాలుగా ఇది మారింది.
ఇందులో ఏది అన్నిటి కన్నా అత్యధిక ప్రమాదమన్నది నిర్ధారణగా ఇంకా చెప్పలేకపోతున్నారు. బ్రిటన్‌లో బయటపడ్డ రకం ప్రమాదకరమని మొదట్లో భావించినా దాని ప్రతాపం అక్కడున్నట్టుగా వేరే చోట లేదు. అలాగే దక్షిణాఫ్రికా రకం కూడా. ఫ్రాన్స్‌లో కూడా కరోనా ఉత్పరివర్తనం అనేక రకాలుగా వుందం టున్నారు. ఈ క్రమంలో అది ఏ దశలో అత్యంత ప్రమాదకారిగా మారుతుందన్నది అంచనాకు రావటం కష్టం. వైరస్ ఉత్పరివర్తనం చెందేకన్నా వేగంగా వ్యాక్సిన్ రూపొంది, అది అందరూ తీసు కునే పరిస్థితి వున్నప్పుడే దాన్ని కట్టుదిట్టంగా నియంత్రించటం సాధ్యమవుతుంది. వేరే దేశాల మాటెలావున్నా మన దేశంలో వ్యాక్సిన్ పంపిణీ అవసరమైనంత వేగంగా జరగటం లేదన్నది వాస్తవం. ఇక్కడ గత జనవరి 16న వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. తొలి దశలో ఆరోగ్య రంగ సిబ్బందికి టీకాలిచ్చారు. ఈ నెల 1నుంచి 60 ఏళ్లకు పైబడినవారందరికీ, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలున్న 45 ఏళ్లకు పైబడి వున్నవారికీ టీకాలిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూని వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ టీకాలు వినియోగిస్తున్నారు. ఇప్పటికీ మూడు కోట్లమందికి ఇవి ఇచ్చినట్టు అంచనా. రోజుకు ఇంచు మించు 3 లక్షలమంది వ్యాక్సిన్ తీసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇదింకా పెరిగితేనే ఈ మహమ్మారి నియంత్రణ సాధ్యమవుతుంది.
వైరస్ వ్యాపిస్తున్న తీరు చూశాకైనా అందరిలో మార్పు రావాలి. ఏడాదిక్రితం కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలైనప్పుడు బయటికెళ్లాల్సివస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివచ్చిందో ఇప్పుడూ అదే స్థాయిలో జాగ్రత్తలుండాలి. భౌతికదూరం పాటించటం మళ్లీ అమలుకావాలి. ఇప్ప టికే మహారాష్ట్రలో వేడుకలు, వినోదాలకు సంబంధించి కొన్ని నియంత్రణలు ప్రకటించారు. మాస్క్‌లు ధరించనివారికి జరిమానా విధించటం నెలక్రితమే ప్రారంభమైంది. ఇంతకుమించి నియంత్రణలు అమల్లోకి రాకూడదనుకుంటే ఎవరికి వారు ముందు జాగ్రత్తలు మొదలుపెట్టడమే ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment