ప్రశ్నిస్తే... వేధిస్తారా? అవును. సోషల్ మీడియా తెర చాటున నిలబడి దొంగ పేర్లతో బాణాలు వేసే విచ్చలవిడి వీరత్వం పెరుగుతున్న కొద్దీ అదే ఖాయమవుతోంది. గత వారం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానిని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు సాక్షిగా ఇబ్బందికరమైన ప్రశ్న వేయడమే పాకిస్తానీ అమెరికన్ జర్నలిస్ట్ సబ్రినా సిద్దిఖీ చేసిన పాపమైంది. భారత్‌లో మైనారిటీల హక్కుల సంగతి అడిగిన ఆమెపై ట్రోలింగ్ తీరు అచ్చం అలాగే ఉంది.
చివరకు వైట్‌హౌస్ ప్రతినిధి ఈ ట్రోలింగ్‌లు ‘అంగీకారయోగ్యం కాదు’ అని ఖండించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని హితవు చెప్పాల్సొచ్చిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అమెరికా దాకా అంతటా జర్నలిస్టులకు ఎదురవుతున్న ట్రోలింగ్‌భూతంపై పోరు అత్యవసరమని ఇది గుర్తుచేస్తోంది.
మోదీని ప్రశ్నించిన సబ్రినా సిద్దిఖీ అనుభవమున్న జర్నలిస్ట్. తల్లితండ్రులు పాకిస్తానీలైనా, ఆమె పుట్టింది అమెరికాలోనే. దీర్ఘకాలంగా అమెరికా అధ్యక్షులు, వైట్‌హౌస్ వ్యవహారాలను నివేదిస్తూ, విలేఖరిగా తనదైన ముద్ర వేశారు. ‘హఫింగ్టన్ పోస్ట్’, ‘బ్లూమ్‌బెర్గ్’, ‘గార్డియన్’ లాంటి ప్రసిద్ధ సంస్థల్లో తన పాళీకి పదునుపెట్టుకున్నారామె. సాధారణంగా ఎన్నడూ అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలకు జవాబివ్వాల్సిన విలేఖరుల సమావేశంలో పాల్గొనని మోదీ వైట్‌హౌస్ ఒత్తిడి మేరకు బైడెన్‌తో కలసి విలేఖరుల ముందుకు రావాల్సి వచ్చింది.
ఇద్దరూ చెరి రెండు ప్రశ్నలకు సమా ధానాలు చెప్పిన ఆ భేటీలో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రతినిధిగా సబ్రినా మోదీని వేసింది ఒక ప్రశ్నే. ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మతపరమైన మైనారిటీలపై ప్రభుత్వ దుర్వి చక్షణ సాగుతోందనీ, విమర్శకుల నోరు మూయిస్తున్నారనీ మానవ హక్కుల సంస్థలంటున్నాయి. మైనారిటీల హక్కులకై మీ సర్కారేం చేయనుంది’ అన్నది స్థూలంగా ప్రశ్న.
ఇరుకున పెట్టే ప్రశ్న వేసినా, భారత్‌లో అలాంటిదేమీ లేదంటూ ప్రధాని బలంగానే తన వాణి వినిపించారు. అయినా సరే, ఆయనను అలాంటి ప్రశ్న వేయడం వీరభక్తులకు నచ్చలేదు. ఫలితమే – అంతర్జాలంలో సబినాపై అమానుష దాడి. ఆమె పాకిస్తానీ అనీ, ముస్లిమ్ అనీ, డిజిటల్ యుగపు నిరసనల ‘టూల్‌కిట్ గ్యాంగ్’లో భాగమనీ దుర్భాషలాడారు. ఇలాంటి ట్రోలింగ్ ప్రైవేట్ మూకల్నీ, సాంకేతిక జ్ఞానంతో కావాల్సిన సందేశాలు పంపే ఇంటర్నెట్ బాట్ల విధానాన్నీ ఇవాళ పాలక వ్యవస్థలన్నీ పెంచిపోషిస్తున్న మాట నిష్ఠురసత్యం.
మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధిస్తున్నది పాలకపక్ష ప్రైవేట్ సైన్యమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. ధైర్యంగా ప్రశ్నించడంలో జర్నలిస్టుగా ఆమె తన బాధ్యత నిర్వహిస్తే, సోషల్ మీడియా వేదికగా విషం చిమ్మడం విస్తుపరుస్తోంది. వెనకెవరూ లేనిదే ఇంతగా వేధింపులకు దిగరనేది తర్కబద్ధమే. ‘ఈ పని మీ ప్రైవేట్ ట్రోల్ సేనలది కాదా? వారిపై చర్యలు తీసుకుంటారా?’ అని బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది.
మీడియా ప్రజాస్వామికీకరణకు సోషల్‌మీడియా ఉపకరించింది ఎంత నిజమో, వేదికలు పెరిగి, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ అడ్డుకట్ట లేని అంతర్జాలంలో అడ్డమైన అభిప్రాయాలనూ వదిలి, భావకాలుష్యం పెంచుతున్నదీ అంతే నిజం. దాని విపరిణామమే ఇప్పుడు ప్రపంచమంతటా చూస్తు న్నది. మెజారిటీ ఆలోచనకు భిన్నాభిప్రాయం ఉన్నవారెవరినీ సోకాల్డ్ ప్రజాస్వామ్య వేదికలు ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో ఎక్కడా మననివ్వక పోవడం నిత్యం చూస్తున్నదే.
సాధారణ సమూహాల నుంచి పాలక పక్షాల దాకా అందరికీ ఈ ట్రోలింగ్ ఓ ఆనవాయితీ. ప్రత్యర్థి పీకనొక్కే పదునైన ఆయుధం. ఈ వర్తమాన వైపరీత్యానికి బాధితులే – అమెరికాలో సబ్రినా అయినా, హైదరాబాద్‌లో చందు తులసి అయినా! ఇందులో భావప్రకటన స్వేచ్ఛ ఒక్కటే కాదు... బెదిరింపులు, దూషణలతో భయభ్రాంతుల్ని చేసి, మానసికంగా హింసించే మానవ హక్కుల ఉల్లంఘన కోణమూ ఉంది.
సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రి సబ్రినా తరహాలో తమ పాలనపై ప్రశ్నలు వేస్తున్న వారందరినీ ఇప్పటికే ‘పాత్రికేయ వేశ్యలు’ (ప్రెస్టిట్యూట్స్) అనడం చూశాం. అది ఏ స్థాయి అసహనమో అర్థం చేసుకున్నాం. పాలకులు సైతం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాస్వామ్యంలో పాత్రికే యుల పని ప్రశ్నించడమే! ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తేనే అది నేరమన్నంత అసహనం ఏ పాలన కైనా మంచిది కాదు.
వేసిన ప్రశ్నలో, చేసిన విమర్శలో నిజం లేదనుకుంటే, ఆ సంగతి ససా క్ష్యంగా చెప్పవచ్చు. నలుగురికీ తెలిసేలా నిరూపణలు చూపవచ్చు. అంతేకానీ, అభిప్రాయం కలిగివుండ డమే నేరమన్నట్టు ప్రవర్తిస్తే అన్యాయం. కానీ, వాట్సప్ యూనివర్సిటీలు పంచుతున్న, పెంచుతున్న అజ్ఞానాంధకారం సాక్షిగా దేశంలో ఈతరహా వేధింపులు అన్ని స్థాయుల్లో పెరిగిపోవడమే విషాదం.
భగవద్గీత సైతం తెలుసుకొనేందుకు ‘పరిప్రశ్న’ వేయమనే చెబుతోంది. కానీ, ప్రశ్నించడమే నేర మనే ధోరణిలోకి మన దిగజారడం కలవరపెడుతోంది. ఈ ట్రోలింగ్ ముఠా తెలిసో తెలియకో... ‘విమర్శకుల నోరు మూయిస్తున్నారట’ అన్న సబ్రినా వాదననే నిజంచేసింది. అలాగే, లింగ వివక్షతో రాజకీయాల్లో మహిళలపై ట్రోలింగ్ మరీ ఎక్కువనీ, న్యూజిలాండ్ ప్రధాని నుంచి మన దేశపు నేతల దాకా అందరూ బాధితులేననీ రెండేళ్ళ పరిశోధనతో ఈ ఫిబ్రవరిలో విడుదలైన అధ్యయనం తేల్చ డం గమనార్హం.
అధికార భావజాలాన్ని వ్యతిరేకిస్తే మీపై, పిల్లలపై అత్యాచారం చేస్తామనే ఈ బరి తెగింపు వేధింపుల్ని అరికట్టే కఠినమైన సైబర్ చట్టాలు కావాలి. ప్రభుత్వాలూ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. ఎందుకంటే, గొంతు విప్పడానికే భయపడాల్సిన పరిస్థితిని ఎక్కడ, ఎవరు, ఎందుకు సృష్టించినా అది సమర్థనీయం కాదు. సహించాల్సింది కానే కాదు. అది ప్రజాస్వామ్యం అసలే కాదు!
ప్రశ్నల పీక నొక్కకండి!
Published Thu, Jun 29 2023 4:30 AM | Last Updated on Thu, Jun 29 2023 4:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment