కరోనా వైరస్ మహమ్మారి బారిన పడినవారి, దానికి బలైనవారి గణాంకాలు వెల్లడవుతూ ప్రజా నీకాన్ని భయోత్పాతంలో ముంచెత్తుతున్న వర్తమానంలో దేశంలో ‘జాతీయ ఆత్యయిక పరిస్థితి’ ఏర్పడిందని సుప్రీంకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యతో ఏకీభవించనివారుండరు. నిన్నటివరకూ మనతో కలిసి నడిచినవారు, మన కష్టసుఖాల్లో తోడుగా వున్నవారు, నిత్యం మనకు కనబడేవారు హఠాత్తుగా కరోనా బారిన పడ్డారని విన్నప్పుడు, ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో చిక్కుకున్నారని విన్నప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది. ఇప్పుడు మీడియాలో కనబడుతున్న అంకెల వెనక లక్షలాదిమంది జీవితాలున్నాయి. వారిపై ఆధారపడి జీవించే మరిన్ని లక్షలమంది వున్నారు. కరోనా పంజా నుంచి వీరంతా తప్పించుకుని మళ్లీ మామూలు మనుషులు కాలేకపోతే వారిని ఆలంబనగా చేసుకున్నవారి బతుకుల్లో చీకట్లు అలుముకుంటాయి. రెండో దశ కరోనా మొదలయ్యాక పెరుగు తున్న కేసుల సంఖ్యను చూసి గుండెలు బాదుకుంటున్నవారికి గురు, శుక్రవారాల్లో వెల్లడైన గణాం కాలు మరింత భయపెడతాయి. గురువారం 3,14,835 కొత్త కేసులు బయటపడితే...శుక్రవారం మరో 3,32,730 కేసులు వెల్లడయ్యాయి. ఇవి క్షణక్షణం పెరుగుతూనే వున్నాయి. రాగల అయిదారు రోజుల్లో ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, తెలంగాణల్లో కేసుల సంఖ్య అధికంగా వుండొచ్చని శాస్త్ర వేత్తలు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.
ఇలాంటపుడు సహజంగానే పాలకులపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. ఫలానావిధంగా చేయడం వల్లనో, చేయకపోవడం వల్లనో పరిస్థితి ఇంతగా దిగజారిందన్న వ్యాఖ్యలు వినబడతాయి. అలాంటి విమర్శలకు తీవ్రంగా స్పందించటం, అవతలివారిని దుమ్మెత్తిపోయడం వివేకవంతమైన చర్య కాదు. సంయమనం పాటించడం, జరుగుతున్నదేమిటో తేటతెల్లం చేయడం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వివరించడం పాలకుల బాధ్యత. అది కేవలం ఆ విమర్శకులకు జవాబు చెప్పడంగా భావించకూడదు. ఒక నిరసన స్వరం వినబడిందంటే దాని వెనక ఎన్నో గొంతులున్నాయని అర్థం. అలాంటివారందరిలో వున్న సందేహాలను తీర్చేలా, వాస్తవ పరిస్థితిని కళ్లముందుంచేలా చెప్పినప్పుడు సహజంగానే అంతా సర్దుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులు ఏం చేయాలో చెబుతున్నారు. వారి వారి సమస్యలేమిటో తెలుసుకుంటున్నారు. ఇదంతా హర్షించదగ్గది. అయితే గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ, వాటి వెంబడే సమస్యలు తలెత్తినప్పుడు ఆయన కాకపోయినా ప్రభుత్వ పక్షాన ఎవరో ఒకరు మీడియా ముందుకొచ్చి వివరిస్తే, వారడిగే ప్రశ్నలకు జవాబులిస్తూ పరిస్థితులేమిటో, వున్న పరిమితులేమిటో, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలేమిటో తెలియజెబితే ఇంత చేటు భయాందోళనలుండవు. విచిత్రమేమంటే సుప్రీంకోర్టు దేశంలో కరోనా వల్ల తలెత్తిన సమస్యలపై సుమోటోగా గురువారం విచారణ ప్రారంభించిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వంటివారు సర్వోన్నత న్యాయస్థానం తీరును తప్పుబట్టారు. పదవీ విరమణ చేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ఈ వ్యాఖ్యలపై స్పందించిన తీరు గమనించదగ్గది. ఇలా విచారించటం వెనక సుప్రీంకోర్టుకు దురుద్దేశాలు ఆపాదించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఎవరికైనా ఏ అభిప్రాయాలైనా వుండొచ్చని...కానీ తాము ఇచ్చే ఆదేశాలను చూశాక అలా అనివుంటే వేరని, ముందే ఏదో ఒకటి అంటగట్టడం వల్ల వ్యవస్థ ఔన్నత్యం దెబ్బతింటుందని ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించనివారుండరు. అయితే గత నాలుగైదు రోజులుగా ఆక్సిజన్ దొరక్క ఆసుపత్రులు తిప్పలు పడుతున్న తీరుపై పాలకులు సరిగా స్పందించకపోవటం వల్లే వాతావరణం వేడెక్కిందని గుర్తించాలి. ఆక్సిజన్ లభ్యంకాక రోగులు చనిపోతున్నారంటూ ముంబై వైద్యురాలు కంటతడి పెడుతూ చెప్పిన మాటలైనా, ఆక్సిజన్ కోసం రాష్ట్రాలు పరస్పరం కీచులాడుకోవటాన్ని గమనించినా ఇప్పుడున్న పరిస్థితేమిటో అవగాహన కొస్తుంది.
మొత్తానికి ఆక్సిజన్ లోటుపై పాలకులతోసహా అందరూ ఇప్పుడు దృష్టి సారించారు. వాటిని ఉచితంగా అందజేసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత వున్న రాష్ట్రాలు వైమానిక దళం సాయం తీసుకోవటం ప్రారంభమైంది. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారం తెరిచే విషయంలో వివాదంలో చిక్కుకున్న వేదాంత సంస్థ అక్కడ తాము ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి అనుమతించమని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించటం కూడా కొరతను దృష్టిలో వుంచుకునే. వివాదం తేలేవరకూ ఇతరత్రా కార్యకలాపాలపై ఎటూ విధినిషేధాలుంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కరోనా కారణంగా ప్రభుత్వాసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒకరిని డిశ్చార్జి చేస్తే తప్ప మరొకరిని చేర్చుకోలేని స్థితి. ఇంత దయనీయ స్థితి ఏర్పడటం బాధాకరం. ఇందుకు మీడియాను కూడా తప్పుబట్టాలి. పాశ్చాత్య ప్రపంచం ఎదు ర్కొంటున్న రెండోదశ కరోనా ఇక్కడ రాదన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడటానికి, ముందు జాగ్రత్తలు విస్మరించటానికి అది దోహదపడింది. ఎన్నికలు సరేసరి. కనీసం ఇప్పుడైనా అందరూ సంయమనం పాటించాలి. సమష్టిగా దీన్ని ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందాలి. ఈ విషయంలో కేంద్రంలోని అధికార పక్షం చొరవ చూపాలి.
ఆక్సిజన్ కోసం ఆరాటం
Published Sat, Apr 24 2021 2:37 AM | Last Updated on Sat, Apr 24 2021 4:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment