పారదర్శకతే ప్రస్తుతావసరం | Sakshi Editorial On Oxygen Deficiency In Corona Pandemic | Sakshi
Sakshi News home page

పారదర్శకతే ప్రస్తుతావసరం

Published Wed, Apr 28 2021 12:29 AM | Last Updated on Wed, Apr 28 2021 8:23 AM

Sakshi Editorial On Oxygen Deficiency In Corona Pandemic

ఒక జాతీయ సంక్షోభం ఏర్పడినప్పుడు మౌన సాక్షిగా మిగిలిపోవడం సాధ్యంకాదని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పిన తీరు దేశంలో వర్తమాన స్థితిని ప్రతిబింబిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్షోభం నెలకొన్న సంగతి నిజమే అయినా, దాన్ని అన్ని ప్రభుత్వాలు ఒకే తీరుగా ఎదుర్కొ నడంలేదు. ఇందువల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్‌కు ఎంత మాత్రం కొరత లేదని, కావాలని కొందరు వదంతులు సృష్టిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. అలాంటివారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కానీ అయోధ్యకు చెందిన ఒక జంట కేవలం ఆక్సిజన్‌ కొరత కారణంగా అక్కడి ఆసుపత్రులు చేర్చుకోవడానికి నిరాకరించటంతో 850 కిలోమీటర్లు అంబులెన్సులో ప్రయాణించి పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీకొచ్చి ఒక ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. అలాగే బెడ్‌లు, వెంటిలేటర్లు, కరోనా రోగులకు ఇచ్చే రెమిడెసివిర్‌ వగైరాల కొరత కూడా. వెబ్‌సైట్‌లలో వాటి లభ్యత గురించి కనిపిస్తున్న అంకెలకూ, వాస్తవ పరిస్థితికీ పొంతన ఉండటం లేదు. ఒక పెను విపత్తు విషయంలో ప్రభుత్వాలు ఇలా వ్యవహరించకూడదు. రెమిడెసివిర్‌ వంటి ఔషధాలు, ఆక్సిజన్‌ బ్లాక్‌ మార్కెట్‌లో భారీ రేటు పలుకుతున్నాయి.

ఇక వ్యాక్సిన్ల ధరల విషయంలోనూ అయో మయ స్థితి ఏర్పడింది. కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న దేశంలోని రెండు సంస్థలూ వేర్వేరు ధరలు ప్రక టించాయి. కనీసం ప్రభుత్వాలకిచ్చే టీకాల ధరలైనా ఒకే విధంగా లేవు. కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు ఒక ధర. ప్రైవేటు ఆసుపత్రులకు మరో ధర. అంతిమంగా వయోజనుల్లో కనీసం 70 శాతం మంది... అంటే 65 కోట్ల 70 లక్షలమంది వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరైనప్పుడు ఇన్ని రకాల ధరలుంటే అవి గమ్యం చేరుతాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ధరల సంగతలా వుంచి అంతమందికి అవసరమైన టీకాల ఉత్పత్తి ఎప్పటికి పూర్తవుతుందన్నది ప్రశ్న. రెండో దశ కరోనా వైరస్‌ తీవ్రతపై సకాలంలో సరైన అంచనాలుంటే, దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించి వుంటే ఇప్పుడున్న పరిస్థితి తలెత్తేది కాదు. కనుక ఈ సంక్షోభంపై సమీక్షించి, అవసరమైన ఆదేశాలిస్తామని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతించాల్సిందే. సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు విచారణ మొదలుపెట్టినప్పుడు రాష్ట్రాల హైకోర్టుల్లో వున్న కేసుల్ని తన వద్దకు తెచ్చుకోవడానికే ఈ ప్రయత్నం జరుగుతోందని కొందరు తప్పుబట్టారు. ఈ విష యంలో మరోసారి సుప్రీంకోర్టు స్పష్టతనీయడం హర్షించదగింది. 

స్వాతంత్య్రానంతరం దేశం ఆరోగ్యపరమైన సంక్షోభాలను అనేకం చవిచూసింది. అయితే ప్రతిసారీ ప్రభుత్వాలే చొరవ ప్రదర్శించి రోగులకు ఔషధాలనూ, వ్యాక్సిన్లనూ పంపిణీ చేశాయి. ఇప్పటికీ ఇదే సరైనది. చదువుకున్నవారూ, స్తోమతవున్నవారూ పరిస్థితుల్ని గ్రహించి సకాలంలో ఈ మహమ్మారి బారిన పడకుండా ప్రయత్నిస్తారు. కానీ గ్రామసీమల్లో వున్న నిరక్షరాస్యులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన వుండదు. ఉన్నా అంత ఖర్చు పెట్టే స్తోమత వుండదు. టీకాలను వేర్వేరు ధరలకు విక్రయించుకోవడానికి ప్రభుత్వమే అనుమతిస్తే సహజంగానే మెజారిటీ పౌరులకు అవి లభ్యమయ్యే పరిస్థితి వుండదు. దానికితోడు రాష్ట్రాలు వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులతో చర్చించుకుని టీకాలు తెచ్చుకోవాలని చెప్పడం కూడా సరికాదు. ఇందువల్ల రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడుతుంది. ఎవరికి టీకాలివ్వాలో ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారు. డిమాండ్‌ ఆధారంగా ధరను పెంచినా పెంచొచ్చు. నిరుడు దేశం అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొందని అందరికీ తెలుసు.

సుదీర్ఘ లాక్‌ డౌన్‌లు అన్ని వర్గాల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీశాయి. కానీ వ్యాక్సిన్లు లభ్యమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాటి చుట్టూ ఒక మాయ అల్లుకుంటే... అందరికీ సక్రమంగా అందుబాటులోకి రాకుంటే అంతకుమించిన ఉత్పాతం దేశం చవిచూడాల్సి రావొచ్చు. మీడియాలో రోజూ కనబడు తున్న శవ దహనాలైనా, శ్మశానవాటికల ముందు క్యూ కడుతున్న అంబులెన్సులైనా ప్రజానీకంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. భవిష్యత్తుపై బెంగటిల్లే స్థితిని కల్పిస్తున్నాయి. ఒకపక్క ఈ ఏడాది ఆర్థికంగా కోలుకుని 11 శాతం అభివృద్ధిని సాధించగలమని కేంద్ర ప్రభుత్వం భరోసా ప్రకటించింది. రేపన్నరోజు ఎలావుంటుందో తెలియని అయోమయం ఏర్పడినప్పుడు ఆర్థిక రంగం పుంజుకోగలుగుతుందా?

అందుకే ప్రతిష్టకు పోకుండా ఇప్పుడు తక్షణం చేయాల్సిందేమిటన్న అంశంపై అందరితో చర్చించాలి. మన దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటాన్ని, దాని పర్యవ సానాలనూ అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అందుకే అనేక దేశాలు సాయం చేయడానికి సిద్ధపడ్డాయి. వ్యాక్సిన్‌లో ఉపయోగించే ముడిపదార్థాల ఎగుమతికి మొన్నటివరకూ నిరాకరించిన అమెరికా తన వైఖరి మార్చుకుంది. ‘ఇంటికి గుట్టు... రోగానికి రొష్టు’ వుండాలం టారు. కరోనా వంటి పెనుసంక్షోభాన్ని ఎదుర్కొనాలంటే ఎప్పటికైనా పారదర్శకతే తోడ్పడుతుంది తప్ప గోప్యత కాదు. అన్ని రకాల కొరతలనూ ప్రజల దృష్టికి తీసుకురావడం, వాటిని నివారిం చేందుకు అవస రమైన చర్యలు తీసుకోవడం, కృత్రిమ కొరత కారకుల్ని గుర్తించి శిక్షించడం ఇప్పటి అవసరం. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే సూచనలు శిరోధార్యం కావాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement