పార్లమెంటు సమావేశాలపుడు రోజూ ఏదో ఒక సమస్యపై వాగ్యుద్ధాలు సాగడం, నినాదాలతో, అరుపులు, కేకలతో దద్దరిల్లడం సర్వసాధారణమైంది. కానీ ఈసారి పార్లమెంటు సమావేశాలకు ముందే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండబోదని, జీరో అవర్ వ్యవధి తగ్గిందని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు ప్రకటించడమే దీనికి మూలం. ప్రశ్నోత్తరాల సమయం అతి ముఖ్యమైనది. చట్టసభల సారమంతా అందులోనే కేంద్రీకృతమైవుంటుంది. దాని నిడివి రోజూ గంట మాత్రమే కావొచ్చు...కానీ అక్కడ ఈటెల్లా దూసుకొచ్చే ప్రశ్నలకు దీటుగా జవాబిచ్చినప్పుడే ప్రభుత్వం సత్తా తేలుతుంది. ఆ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగపర్చుకున్నారన్నదే విపక్షాల పనితీరుకు గీటురాయి అవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై నిశితంగా ప్రశ్నించడం, అవసరమైన సమాచారం రాబట్టడం, సరైన జవాబులు రానిపక్షంలో నిలదీయడం...తగిన చర్యలు తీసుకునేలా వారిని ఒప్పించడం సభ్యులు చేసే పని. ప్రభుత్వం పనితీరు ఎలా వున్నదో, అందులో ఎన్ని లొసుగులు చోటుచేసుకుంటున్నాయో బట్టబయలు చేసేందుకు ఈ ప్రశ్నోత్తరాల సమయం విపక్షాలకు ఆయుధం.
చెప్పాలంటే ఇదొక మందుపాతర. పైకి అంతా సవ్యంగా వున్నట్టు కనబడుతుంది. ఉన్నట్టుండి పెనుతుపాను మొదలవుతుంది. ఏదో యధాలాపంగా అడిగినట్టు కనబడే ఒక ప్రశ్న ఒక మంత్రి రాజకీయ భవిష్యత్తును లేదా ఒక ప్రభుత్వం తలరాతను నిర్దేశించే ప్రమాదం కూడా వుంటుంది. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో హరిదాస్ ముంద్రా అనే వ్యాపారవేత్త కంపెనీలో ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ ఎందుకు పెట్టుబడులు పెట్టాల్సివచ్చిందన్న రాంసుభాగ్ సింగ్ అనే ఎంపీ ప్రశ్న 1957లో ఆనాటి నెహ్రూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఆయనకు అధికారపక్ష ఎంపీగావున్న నెహ్రూ అల్లుడు, ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ తోడవటంతో అది దేశమంతా మార్మోగిపోయింది. ఆ ప్రశ్న వెంబడి చకచకా దూసుకొచ్చిన ప్రశ్నల పరంపరతో ఆ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. తవ్వుతున్నకొద్దీ అదొక కుంభకోణంగా రూపుదిద్దుకుని ఆనాటి ఆర్థికమంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది.
చట్టసభల పట్ల ప్రభుత్వాలకుండే జవాబుదారీతనాన్ని బాగా పట్టిచూపేది ప్రశ్నోత్తరాల సమయమే. అక్కడ విపక్షాలు అడిగే ప్రశ్నలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించవచ్చు. చికాకు పరచవచ్చు. వాటికి నేరుగా జవాబీయకపోవచ్చు. ఏం చేసినా జనానికి ప్రభుత్వ ఆంతర్యం అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రశ్నించేవారు కేవలం తమకుండే సందేహం తీర్చుకోవడం కోసమే ఆ పని చేయరు. ఆ ప్రశ్న ద్వారా, దానిపై తలెత్తే అనేకానేక అనుబంధ ప్రశ్నల ద్వారా ప్రభుత్వ వ్యవహారశైలిని పౌరుల ముందు పరచడం వారి ధ్యేయం. అంతక్రితం మాటేమోగానీ 1991లో లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టాక దీనికి ఎక్కడలేని ప్రాముఖ్యతా వచ్చింది. నేరుగా జనమంతా ఆసక్తిగా చూసేదీ, మీడియా దృష్టి పడేదీ ఈ సమయమే. జీరో అవర్ కూడా ఈ ప్రశ్నోత్తరాల సమయానికి తీసిపోదు. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నలకు సంబంధించి పక్షం రోజుల ముందు మంత్రులకు నోటీసు ఇవ్వాల్సివుంటుంది. సభాధ్యక్షుల అనుమతితో అప్పటికప్పుడు ప్రశ్నించడానికి కూడా వీలుంటుంది. జీరో అవర్ కూడా ఇంచుమించు ప్రశ్నోత్తరాల సమయం వంటిదే. అయితే ప్రశ్నోత్తరాల సమయం తరహాలో దీనికి ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు. సభ్యులు తమ నియోజకవర్గానికి సంబంధించింది అయినా, దేశానికి సంబంధించింది అయినా...ఏ సమస్యనైనా ప్రస్తావించవచ్చు. ప్రభుత్వం ఏమనుకుంటున్నదో తెలుసుకోవచ్చు. ఆ సమస్యపై దృష్టి కేంద్రీకరించేలా చేయొచ్చు.
మన పార్లమెంటు సమావేశాలు దాదాపు 175 రోజుల వ్యవధి తర్వాత జరుగుతున్నాయి. గతంలో బడ్జెట్ సమావేశాలకూ, వర్షాకాల సమావేశాలకూ మధ్య ఇంత వ్యవధి ఎప్పుడూ లేదు. కరోనా అనంతర పరిస్థితుల్లో తొలిసారి జరిగే ఈ సమావేశాలు సాఫీగా, సురక్షితంగా సాగడానికి వీలుగా ఉభయసభల అధ్యక్షులూ అన్ని రకాల ముందు జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సభలో ప్రవేశించే సభ్యులకు, ఇతర అధికారులకు, ఇతరులకు ఆరోగ్య పరీక్షలు చేయడంతో మొదలుపెట్టి, సభలో సభ్యుల స్థానాలమధ్య తగిన దూరం వుండేలా ఏర్పాట్లు చేశారు. సభ్యులు వేర్వేరుచోట్ల కూర్చుని ఆడియో, వీడియో లింకుల ద్వారా సభా కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా మార్పులు తెచ్చారు. అలాగే ఒకేసారి భారీ సంఖ్యలో ఎంపీలు వుండకుండా చూసేందుకు రోజూ తొలి అర్ధభాగం రాజ్యసభ, మధ్యాహ్నం నుంచి లోక్‌సభ పనిచేసేలా సమావేశాలకు రూపకల్పన చేశారు. సమయాన్ని సమర్థవంతంగా వాడుకోవడానికి వీలుగా ప్రశ్నోత్తరాల సమయం రద్దు, జీరో అవర్ కుదింపు అవసరమయ్యాయన్నది ప్రభుత్వం ఇస్తున్న సంజాయిషీ. అదేమంత సంతృప్తికరంగా లేదు. ఈ సభలో ఆమోదించుకోవాల్సినవి చాలానే వుండొచ్చు. దాదాపు డజను ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వం బిల్లులు పెట్టాలి. గత సమావేశాల్లో పెండింగ్ వుండిపోయిన బిల్లులు సరేసరి. సమస్యలైతే చాలానేవున్నాయి. కరోనా కట్టడిలో సాఫల్యవైఫల్యాలు, లాక్‌డౌన్, రాష్ట్రాలకిచ్చిన తోడ్పాటు, జీఎస్‌టీ బకాయిలు...ఇలా పెద్ద జాబితా వుంది. ఇప్పుడున్నది అసాధారణ పరిస్థితే కావొచ్చు...కానీ దాన్ని సాకుగా చూపి సభ్యుల నోరు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారన్న నింద పడనీయకుండా చూసుకోవడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం. ఎందుకంటే ఒక్క చైనా దురాక్రమణ జరిగిన 1962లో తప్ప బ్రిటిష్ కాలంనుంచి ఇంతవరకూ చట్టసభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దు లేనేలేదు. అవసరమైతే ఆమోదింపజేసుకునే బిల్లుల సంఖ్యను తగ్గించి అయినా దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలని కేంద్రం గ్రహిస్తే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment