ప్రత్యేకం అంటేనే సాధారణమైన దానికి భిన్నమైనది, వేరైనది అని నిఘంటవుల అర్థం. మాటలోనే ఉన్నట్టుగా ఈ నెల 18 నుంచి 22 దాకా జరగనున్న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశాలు అనేక రకాలుగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిసి, 3 వారాలైన కాక ముందే ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేక భేటీ ప్రకటన చేయడం ఒక ప్రత్యేకతైతే... హఠాత్తుగా ఈ భేటీ ఎందుకు జరుపుతున్నదీ అజెండా చెప్పకపోవడం మరో ప్రత్యేకత.
ఉమ్మడి పౌరస్మృతి, ‘ఒకే దేశం – ఒకేసారి ఎన్నికల’ చట్టం, దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చడం, మహిళా రిజర్వేషన్లు... ఇలా పలు ఊహాగానాలు వినిపిస్తున్నా పాలకపక్షం నోరు మెదపక ప్రతిపక్షాలను ఊహల్లో, అనుమానాల్లో పెట్టడం మరింత ప్రత్యేకత. ఇది అన్యాయమని విపక్షాలు ఆక్రోశిస్తున్నాయి. ఆగస్ట్ 31నే ప్రత్యేక భేటీ ప్రకటన చేసిన ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేత తాజాగా లేఖ రాసినా, రాజకీయాలు చేస్తున్నారంటోంది. వెరసి ప్రత్యేక భేటీ దేనికనే ఉత్కంఠ పెరుగుతోంది.
గతంలో 2019 ఆగస్ట్‌లో వర్షాకాల సమావేశాల్లో అజెండాలో లేకుండానే హఠాత్తుగా ఆర్టికల్ 370 రద్దును సభలో తెర మీదకు తెచ్చి, ప్రతిపక్షాల చేష్టలుడిగేలా చేసిన చరిత మోదీ సర్కార్‌ది. మరి ఈ సారి ఎలాంటి రాజకీయ గూగ్లీ విసిరి, వచ్చే 2024 ఎన్నికలకు కొత్త కథనంతో ముందుకు వస్తారన్నది ఆసక్తి రేపుతోంది. సహజంగానే విపక్షాల్లో ఆందోళన పెంచుతోంది. ప్రత్యేక సమావేశా లనే మాటే రాజ్యాంగ నిబంధనల్లో లేదు గనక, వాటి అజెండా ఏమిటన్నది ముందుగా చెప్పాలన్న రూలూ కనిపించదు.
కానీ, గతంలో పార్లమెంట్ ప్రత్యేక భేటీని ప్రకటించినప్పుడల్లా ఆ రోజునే సమావేశాల అజెండానూ ప్రకటించడం ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు దాన్ని కూడా పాలకపక్షం తుంగలో తొక్కుతోందన్నది ప్రధాన ఆరోపణ. ఇలా జరగడం ఇదే తొలిసారని రాజ్యాంగ నిపుణులూ నిర్ధరించారు. అయితే, సమస్త పార్లమెంటరీ సంప్రదాయా లకూ తిలోదకాలిస్తున్న పాలకులు గద్దె మీదకు వస్తున్న కాలంలో విచారపడి ఉపయోగం లేదు.
ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించే అధికారం ప్రభుత్వానికి లేదని ఎవరూ అనలేరు, అనరు. కానీ, ప్రజాస్వామ్య దేశంలో అందుకు అనుసరిస్తున్న విధానం మీదే రచ్చ. నిజానికి, నిర్ణీత తేదీల్లోనే పార్లమెంట్ సమావేశం కావాలంటూ మన దేశంలో కచ్చితమైన పార్లమెంటరీ క్యాలెండరంటూ ఏమీ లేదు. ఏటా 12 నెలల వ్యవధిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్ భేటీ కావాలి. జనవరి చివర్నించి మే వరకు బడ్జెట్ సమావేశాలు, జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల భేటీ, నవంబర్ – డిసెంబర్లలో శీతకాల సమావేశాలంటూ ఏటా 3 సమావేశాలన్నది చిరకాల సంప్రదాయం.
అయితే, తొలి రెండు దశాబ్దాల పార్లమెంట్ చరిత్రలో లోక్‌సభ ఏటా సగటున 120 రోజుల పైచిలుకు సమావేశమైతే, గత దశాబ్ద కాలంలో అది 70 రోజులకు పడిపోవడం విషాదం. సాధారణ సమావేశాల సంగతే అలా ఉంటే, అసాధారణ భేటీతో ఒరిగేదేంటో చెప్పలేం. ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ సభ్యుల చర్చ లాంటివి లేని ఈ భేటీ మే 28న మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంలో జరగనుందట.
చారిత్రక సంఘటనలు, మైలురాళ్ళ జ్ఞాపకార్థం భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగడం కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడూ, ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవం (1992), భారత స్వాతంత్య్ర రజతోత్సవం (1972), స్వర్ణోత్సవం (1997) వేళ అర్ధ రాత్రి భేటీలు జరిగాయి. ఒక చట్టం చేయడానికంటూ ప్రత్యేక సమావేశం జరిగింది మాత్రం 2017 లోనే! అదీ మోదీ హయాంలోనే! నాటి సర్కార్ ఉభయ సభల అర్ధరాత్రి భేటీలో జీఎస్టీ తెచ్చింది.
మళ్ళీ ఇప్పుడు అజెండా వెల్లడించకుండా బుల్‌డోజర్ ధోరణిలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ జరపాల నుకోవడమే రచ్చకు దారి తీస్తోంది. అజెండాను ప్రతిపక్షాలకు చెప్పడం ప్రోటోకాలన్నది పక్కన పెడితే, చివరకు అధికారపక్ష నేతలకూ అజెండా అస్పష్టం, దేవరహస్యంగానే మిగలడం విడ్డూరం.
ప్రజాస్వామ్యంలో పాలకులు సర్వంసహా చక్రవర్తులు కాదని గుర్తించాలి. అలా ప్రవర్తించడాన్ని ప్రజలూ హర్షించరని గ్రహించాలి. అదే సమయంలో ‘వీటిపై చర్చించండి’ అంటూ నిన్న గాక మొన్న వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించిన అంశాలపైనే లేఖలో రాయడమూ కాంగ్రెస్ తదితర విపక్షాల మేధాశూన్యతకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఎలాంటి అంశాన్ని తెరపైకి తెచ్చినా, దాన్ని సమర్థంగా చర్చించగల సన్నద్ధత లేకుంటే అది ప్రతిపక్షాల అసమర్థతే.
మొన్నటి అవిశ్వాస తీర్మానంపై చర్చలోనూ విపక్షాల్లో ఆ బలహీనత బయటపడిందన్నది నిష్ఠురసత్యం. అయితే, శాసన నిర్మాణంలో అధికార, విపక్షాలు సమన్వయంతో సాగితేనే ప్రజాస్వామ్య రథం సజావుగా సాగుతుంది. ఒకరిపై మరొకరు అపనమ్మకంతో, అన్నిటికీ అనుమానంతో ఉంటే అది ఎన్నటికీ ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. ఆ వాస్తవాన్ని ఇరుపక్షాలూ గౌరవించాలి.
ఇప్పటికే ప్రస్తుత 17వ లోక్‌సభ చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు అతి తక్కువ రోజులు సమావేశమై, అధిక భాగం వాయిదాలకే పరిమితమైన అపకీర్తిని మూటగట్టుకుంది. ఈ ప్రత్యేక సమావేశాలు అయినా అందుకు మినహాయింపు కావాలని ఆశిద్దాం. అత్యాశ అనుకున్నా అది అభిలషణీయమే. అదే జరిగితే ఇవి అక్షరాలా ‘ప్రత్యేక సమావేశాలు’గా గుర్తుండిపోతాయి.
అయితే అందుకు రహస్య అజెండాలు, దాపరికాలు మాత్రం ఉపకరించవు. ఈ లోక్‌సభకు ఇవే ఆఖరి సమావేశాలు కావచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ... కనీసం ఇప్పుడైనా అధికార, విపక్షాల్లో ఉన్న పార్టీలు ఆపాటి హుందాతనం చూపుతాయా అన్నది ప్రధానమైన పశ్న.
పార్లమెంట్ ‘ప్రత్యేక’ రహస్యం
Published Fri, Sep 8 2023 12:11 AM | Last Updated on Fri, Sep 8 2023 4:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment