ఏ నిర్ణయానికైనా సహేతుక కారణాలుంటే సమస్య లేదు. కుంటిసాకులతో అనుకున్నది అమలు చేయాలనుకుంటేనే అసలు సమస్య. మాంసాహారం అమ్మే వీధి బండ్లపై బీజేపీ పాలిత గుజరాత్‌లో నాలుగు పట్టణాల స్థానిక అధికారులు ఇటీవల ఆంక్షలు విధించడం, అందుకు వాసన – పరిశుభ్రత – ట్రాఫిక్ లాంటి అన్యాయమైన కారణాలు చెప్పడం చూస్తే అదే అనిపిస్తుంది. ప్రజల ఆహారపుటలవాట్లు, రుచులు – అభిరుచులపై పాలకుల పెత్తనం ఏమిటి? ఎవరు ఏం తినాలో కూడా పాలకులే నిర్ణయించాలనుకుంటే అది ప్రజాస్వామ్యమా? సాంస్కృతిక నియంతృత్వమా? ఇప్పటికే అనేక అసహనాలు రగులుతున్న దేశంలో ఆహారంపై ముద్రతో మరో అసహనం చెలరేగితే?
వెల్లువెత్తిన విమర్శలతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వెనక్కి తగ్గి, నిర్దేశిత మార్గదర్శకాలు పాటించినంత వరకు ప్రజల ఆహారంపై ప్రభుత్వ విధానాల జోక్యమే ఉండబోదని వివరణ ఇచ్చారు. కానీ, మాంసాహారంపై గుజరాత్‌లో వివాదం ఇదేమీ తొలిసారి కాదు. 2014 ఆగస్టులో జైన క్షేత్రమైన పాలీతానాలో జంతువధ, మాంసాన్ని అమ్మడం, తినడం శిక్షార్హమని చట్టం చేశారు. పట్నంలోని మాంసం దుకాణాలను మూసివేయాలన్న జైన సన్న్యాసుల నిరసన దానికి కారణం. అలా ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి శాకాహార పట్నమని పాలీతానా ప్రకటించుకుంది. ఇప్పుడు ఏడేళ్ళ తర్వాత స్కూళ్లు, కాలేజీలు, ధార్మిక స్థలాలకు 100 మీటర్ల పరిధిలో కానీ, వీధుల్లో కానీ మాంసాహారం అమ్మే బండ్లు ఉండరాదంటూ రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్ ఆదేశాలిచ్చింది. అదే బాటలో వడోదర, భావ్‌నగర్, అహ్మదాబాద్‌లు పయనించాయి.
బాహాట మాంస ప్రదర్శన తమ మనోభావాలను దెబ్బతీస్తోందనీ, జనంపై, ముఖ్యంగా పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందనీ మాంసాహార వ్యతిరేకుల వాదన. గుజరాత్ సీఎం మరో అడుగు ముందుకేసి, ట్రాఫిక్ ఇక్కట్లకు ఈ వీధి ఆహారబండ్లే కారణమనేశారు. ఆ వాదనలు ఎంత అసంబద్ధమో చెప్పనక్కర్లేదు. 2017లో బడ్జెట్ ప్రసంగంలో నాటి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సైతం గుజరాత్‌ను ‘శాకాహార రాష్ట్రం’గా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా గోవధ నిషేధ చట్టానికి పదును పెట్టి, లాభం పొందారు. కానీ, సగానికి పైగా మాంసాహారులున్న యూపీలో ఎన్నికల వేళ ఇప్పుడీ మాంసాహార వాదన బీజేపీకి ఇబ్బందికరమే. పైగా, ఓబీసీలను దగ్గరకు తీసుకోవాలని ప్రధాని తన క్యాబినెట్‌లో వారికి పెద్ద పీట వేశాక, ఇప్పుడీ మాటలు ఎదురుతంతాయి. అందుకే, బీజేపీ నాయకులు తక్షణ నష్టనివారణకు దిగారు.
2014లో కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 40 శాతం గుజరాతీలు మాంసాహారులు. సత్యం, అహింసలే ఆయుధాలుగా పోరాడిన గుజరాతీ బిడ్డ గాంధీ సైతం శాకాహారాన్ని ప్రబోధించినా, చిన్నతనంలో మాంసం తిన్నవారే. వైష్ణవాన్ని పాటించే తల్లితండ్రులపై గౌరవంతో, అదీ విదేశాలకు వెళ్ళే ముందు తల్లికిచ్చిన మాట కోసం మాంసం, మద్యాలకు దూరంగా గడిపారు. భారత మానవ పరిణామశాస్త్ర సర్వే ప్రకారం ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన వర్గాల ఆలిండియా సగటు 60 శాతమే. ఏకంగా 70 శాతం వలస జీవులున్న గుజరాత్ విభిన్న వర్గాల సమ్మేళనం.
ఆ రాష్ట్రంలో 15 శాతం మంది గిరిజనులు, 8 శాతం దళితులు, దాదాపు 20 శాతం మంది ఓబీసీలని సామాజిక శాస్త్రవేత్తల మాట. మతపరంగా గుజరాత్‌లో 88.5 శాతం హిందువులు, ఒక శాతం జైనులు, దాదాపు 10 శాతం ముస్లిములు, క్రైస్తవులని లెక్క. శాకాహారాన్ని బోధించే వైష్ణవం అక్కడ ఎక్కువైనా, దేశంలో అత్యంత శాకాహార రాష్ట్రం గుజరాత్ కాదు. ‘పూర్తి శాకాహార’ జనావాసం లెక్కల్లో రాజస్థాన్, హర్యానా, చివరకు పంజాబ్ తరువాతే గుజరాత్. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం గుజరాత్‌లో మాంసోత్పత్తి 2004–05లో 13 వేల టన్నులుంటే, 2018–19 కల్లా అది రెట్టింపు దాటింది. అందులో అధిక భాగం గుజరాత్‌లోనే వినియోగమవుతోంది. ఇక, దేశ మత్స్య ఉత్పత్తిలో 17 శాతం గుజరాత్ వాటానే.
వీధి ఆహార బండ్లు మన దేశంలో, ముఖ్యంగా పట్టణాల్లో సర్వసాధారణం. అది భారత ప్రభుత్వానికీ తెలుసు. అందుకే, ఆ వ్యాపారాలకు నిర్వహణ మూలధనంలో సాయం చేసేందుకు ప్రత్యేకమైన సూక్ష్మ రుణ పథకాన్ని 2020 జూన్‌లో కేంద్రమే సిద్ధం చేసింది. తీరా ఇప్పుడు గుజరాత్ మునిసిపల్ అధికారులకు ఈ వీధి బండ్లే అడ్డం అనిపించడం విడ్డూరం. మద్యం లాగా మాంసంపై గుజరాత్‌లో అధికారిక నిషేధం లేదు. కానీ, ఆధిపత్య సామాజిక, సాంస్కృతిక ఆచారవిచారాల వల్ల గుజరాత్‌లో మాంసం తినడం తప్పు అనే భావన ప్రచలితమైంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ఆదేశాలతో దాన్ని పునరుద్ఘాటిస్తే ప్రయోజనం ఏమిటి? మాంసాహారం ధార్మికంగా తప్పు అన్నట్టు ముద్ర వేసి, సాంప్రదాయికంగా మాంసాహారులైన వర్గాల పట్ల ద్వేషం రెచ్చగొడితే ఆ పాపం ఎవరిది?
రాష్ట్ర స్థాయి ఆదేశాలు లేవన్న మాటే కానీ, హర్యానా లాంటి రాష్ట్రాల్లోని పట్నాల్లో పండుగల వేళ మాంసం షాపులపై స్థానికంగా నిషేధం సాగుతోంది. ఐఐఎం–అహ్మదాబాద్ బయట మాంసాహార స్టాల్స్‌పై 2003 నుంచి అప్రకటిత నిషేధమే. ఈ ధోరణులు ప్రబలితే, సామరస్య సహజీవనానికే గొడ్డలిపెట్టు. అణగారిన వర్గాలైన ముస్లిమ్‌లు, దళితుల ప్రధాన ఆహారంపై ఇలాంటి ముద్రలు వారిని సమాజంలో మరింత దూరం నెట్టే ప్రమాదం ఉంది. సామాన్యులు ఏది తింటే సామాజికంగా అంగీకారయోగ్యమో చెప్పేందుకు పాలకులు పూనుకొంటే, అంతకన్నా దుర్మార్గం ఉండదు. చివరకు తినే తిండిపైనా జోక్యం ఏమిటన్న ఆగ్రహం జనంలో కలిగితే ఆ తప్పు... ప్రభుత్వాలది, పాలకులదే!
Comments
Please login to add a commentAdd a comment