దారుణం... దిగ్భ్రాంతికరం. ఆదివారం సాయంత్రం గుజరాత్‌లోని మోర్బీ వద్ద కుప్పకూలిన తీగల వంతెన దుర్ఘటనను అభివర్ణించడానికి బహుశా ఇలాంటి మాటలేవీ సరిపోవేమో! నదిపై కట్టిన తీగల వంతెన సెకన్ల వ్యవధిలో కూలిపోతుంటే, ఒకరి మీద మరొకరుగా వందల సంఖ్యలో జనం నదీజలాల్లో పడిపోయిన తీరును వీడియోల్లో చూస్తుంటే గొంతు పెగలడం కష్టం. తెగిపోయిన తీగల మొదలు అందిన అవశేషం ఏదైనా సరే పట్టుకొని, ప్రాణాలు దక్కించుకొనేందుకు పైకి ఎగబాకాలని బాధితులు శతవిధాల ప్రయత్నిస్తూనే ప్రాణాలు కోల్పోయిన తీరు ఎంతటివారినైనా కన్నీరు పెట్టిస్తుంది. రెండేళ్ళ చిన్నారి సహా 47 మంది పిల్లలు... కడపటి వార్తలందేసరికి మొత్తం 140 మందికి పైగా అమాయకులు... అన్యాయంగా వారి ప్రాణాలు తీసిన ఈ ఘటన పరిహారమిచ్చి తప్పించుకోలేని పాపం. ఆరంభించిన అయిదు రోజులకే రోప్ బ్రిడ్జి కూలిపోవడం మరమ్మత్తుల పనిలో నాణ్యతా లోపంతో పాటు, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ!
గుజరాత్‌లోని మచ్ఛు నదిపై దాదాపు 150 ఏళ్ళ క్రితం బ్రిటీషు కాలంలో కట్టిన ఈ తీగల వంతెన పేరున్న పర్యాటక ప్రాంతం. ఇప్పుడిది మరుభూమికి మారుపేరు. కొన్ని కుటుంబాలకు కుటుంబాలు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాయి. ఓ పార్లమెంట్ సభ్యుడి సోదరి సహా సమీప బంధువులు 12 మంది ఒకేసారి ఈ దుర్ఘటనలో చనిపోయారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు తక్షణ నష్టపరిహారాలు ప్రకటించి, సహాయక చర్యలు దిగాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సారథ్యంలో దర్యాప్తునకు ఆదేశించి, పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి, ప్రస్తుతానికి ఈ బిడ్జి మరమ్మత్తులు చేసిన కంపెనీ ఉద్యోగులతో పాటు టికెట్లు అమ్మిన ఇద్దరు క్లర్కుల్నీ, ఒక బ్రిడ్జి కాంట్రాక్టర్‌నీ, భద్రతా సిబ్బందినీ అంతా కలిపి 9 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికీ మరో 100 మందికి పైగా జాడ తెలియని పరిస్థితుల్లో ఇవేవీ బాధితుల కన్నీళ్ళను తుడిచేయలేవు. ప్రకృతి కాక, మానవ తప్పిదాలే ఈ ఘోరకలికి కారణం కావడం విచారకరం. అనేక అంశాల్లో పాతుకుపోయిన ప్రభుత్వ యంత్రాంగ నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువుటద్దం.
అజంతా బ్రాండ్ పేరుతో గోడ గడియారాలు, కాలిక్యులేటర్లకు ప్రసిద్ధమై, సీఎఫ్‌ఎల్ దీపాలు, ఇ– బైక్స్ రూపొందిస్తున్న ప్రైవేటు సంస్థ ఒరేవా. ఏటా రూ. 800 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ గడియారాల కంపెనీకి వంతెన మరమ్మత్తుతో సంబంధం ఏమిటో, దానికి ఈ పని ఎందుకు అప్పగించారో అర్థం కాదు. 51 ఏళ్ళుగా వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ బ్రిడ్జి నిర్వహణను 15 ఏళ్ళకు లీజు తీసుకొని, మరమ్మత్తుల పని మూడోవ్యక్తికి కట్టబెట్టింది. బ్రిడ్జి పనులకు అధికారికంగా 8 నుంచి 12 నెలల టైమ్ ఇచ్చినా, హడావిడిగా 5 నెలల్లో పూర్తి చేశారు. ఏడాదికి పైగా పట్టే మరమ్మత్తులను హడావిడిగా అయిందనిపించి, గుజరాతీ సంవత్సరాదికి అక్టోబర్ 26న ప్రారంభించాల్సిన తొందర ఏమిటి? స్థానిక మునిసిపాలిటీ నుంచి అనుమతి లేకుండానే, బ్రిడ్జి దృఢత్వంపై పరీక్షలు చేయకుం డానే ఒరేవా సంస్థ రోప్‌బ్రిడ్జిపై పర్యాటకం ఎలా ప్రారంభించింది? ఏకకాలంలో 125 మందిని మించి మోయలేని వంతెనపై అదే పనిగా టికెట్లమ్ముతూ 500 పైచిలుకు మందిని ఎలా అనుమతిం చారు? తీగల వంతెన పైకి చేరిన కొందరు ప్రమాదకరంగా ఆ తీగలను పట్టుకొని ఊగుతుంటే వారిని ఆపేందుకు సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబు లేదు.
మరో నెలలో గుజరాత్‌లో ఎన్నికలున్న వేళ ఈ ప్రమాదం రాజకీయ ఆరోపణల పర్వానికి దారి తీసింది. 2016లో కోల్‌కతాలో ఫ్లై–ఓవర్ కూలి, పలువురు మరణించినప్పుడు అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ తప్పుపడుతూ ‘ఇది దేవుడి శాపమా, లేక అవినీతి పాపమా’ అంటూ చేసిన మాటల దాడిని ప్రతిపక్షాలు వ్యంగ్యంగా గుర్తు చేస్తున్నాయి. శవ రాజకీయాలు ఎవరు చేసినా సమర్థనీయం కాదు కానీ, ఎఫ్‌ఐఆర్‌లోని నిందితుల పేర్లలో సంస్థ పేరు కానీ, దాని అధిపతి పేరు కానీ, వ్యక్తుల పేర్లు కానీ లేకపోవడం కచ్చితంగా ప్రశ్నార్హమే. చిన్న చేపల్ని పట్టుకొని వ్యాపార తిమింగలాల్ని వదిలేస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కార్పొరేట్లకూ, రాజకీయాలకూ మధ్య పెరుగుతున్న బంధాన్ని సూచిస్తోంది. దాదాపు పాతికేళ్ళుగా గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీకి ఇది కొంత ఇబ్బందికరమైన విషయమే. మోదీ, షాలిద్దరూ గుజరాత్ వారే కావడం మరో ఇబ్బంది. యూపీలోని చందౌలీ దగ్గరా ఛఠ్ పూజ సందర్భంగా ఆదివారం ఓ వంతెన పాక్షికంగా కూలినట్టు ఆలస్యంగా వార్తలందుతున్నాయి. ఎలాంటి ప్రాణహానీ జరగనప్పటికీ, ఇలాంటి ఘటనలన్నీ మన ప్రాథమిక వసతి సౌకర్యాలలోని లోటుపాట్లను ఎత్తిచూపుతున్నాయి.
ఎన్నికల వేళ 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో పర్యటించనున్నారు. కానీ అంతకన్నా ముఖ్యం ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడం! ప్రతిపక్షాలు కోరుతున్నట్టు రాష్ట్ర సర్కార్ హయాంలోని అధికారులతో కాక, రిటైర్డ్ జడ్జీల్లాంటి వారితో స్వతంత్ర దర్యాప్తు జరిపి, అసలైన బాధ్యుల్ని కనిపెట్టడం కఠినంగా శిక్షించడం! అలవి మాలిన నిర్లక్ష్యం అన్నింటా ప్రమాదకరమే. ప్రజా సౌకర్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొన్నిసార్లు అది ప్రజల ప్రాణాలకే ముప్పు. ఏమైనా, మోర్బీ ఘటన అక్షరాలా పాలకుల, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమే. కొందరి బాధ్యతారాహిత్యానికీ, అవినీతికీ ప్రజలు బలి కావాలా? ఆత్మవిమర్శ చేసుకో వాలి. పర్యాటకంతో ఆర్థిక ఆర్జన కన్నా అమాయకుల ప్రాణాలు ముఖ్యమని అర్థం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment