గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతు
తణుకు అర్బన్: గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతైన ఘటన తణుకు సజ్జాపురం ప్రాంతంలోని జాతీయరహదారి వంతెన ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం సజ్జాపురంలో నివసిస్తున్న గుమ్మళ్ల శాంతి (48) ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రావడం.. ఆపై కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు సోమవారం ఉదయం నుంచి వెతుకులాట చేపట్టారు. ఈ క్రమంలో ఆమె కాళ్లకు వేసుకునే బూట్లు గోస్తనీ కాలువ వంతెనపై భాగంలోని జాతీయరహదారిపై ఉండడంతో రాత్రి సమయంలో కాలువలోకి దూకి ఉంటారని కుటుంబసభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకారంతో గజ ఈతగాళ్లు గోస్తనీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ కాలువలో దూకారనే వార్త తెలిసిన సజ్జాపురవాసులతోపాటు జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు వంతెన ప్రాంతంలో భారీగా చేరుకుని గుమిగూడారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెల్‌నెస్ సెంటర్ కోచ్‌గా శాంతి
సజ్జాపురం పార్కు ప్రాంతంలో తన ఇద్దరు కుమారులతో కలిసి శాంతి నివసిస్తోంది. భర్త లేకపోవడంతో తన నివాసంలోనే వెల్‌నెస్ సెంటర్ కోచ్‌గా ఆమె ఉపాధి పొందుతోంది. శాంతి అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావమని, సామాజిక మాధ్యమాల్లో సైతం రీల్స్ చేస్తూ హుషారుగా ఉంటుందని స్నేహితులు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుమారులిద్దరిలో ఒకరికి వివాహం కూడా అయినట్లు బంధువులు వివరిస్తున్నారు. శాంతి కాలువలో దూకినట్లుగా ఎవరూ చూడకపోవడంతో గోస్తనీ కాలువ వంతెనపై ఉన్న బూట్లు ఆధారంగా మాత్రమే కాలువలో దూకినట్లు అంచనా వేస్తున్నారు.
వంతెనపై ఉన్న ఆమె బూట్ల ఆధారంగా
గోస్తనీ కాలువలో గాలింపు
గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment