
పీడీఎఫ్ అభ్యర్థిని గెలిపించాలి
ఏలూరు (టూటౌన్): ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులును గెలిపించాలని ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే శక్తి పీడీఎఫ్ అభ్యర్థులకు మాత్రమే ఉందని చెప్పారు. రాఘవులు గత 40 ఏళ్లుగా యుటీఎఫ్‌లో వివిధ స్థాయిల్లో పనిచేసి ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాద్ మాట్లాడుతూ శాసనసభలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై అడిగేవారే లేరని ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, టి.రామకృష్ణ, కే.శ్రీనివాస్, ఎం.నాగమణి పాల్గొన్నారు.
నేడు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలకు జర్మనీ బృందం
ఏలూరు(మెట్రో): రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం(ఏపీసీఎన్‌ఎఫ్) ద్వారా అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు జర్మన్ ప్రతినిధి బృందం ఈ నెల 19న ఏలూరు జిల్లాలో పర్యటించనుంది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం సభ్యులు తమ పర్యటనలో భాగంగా ఏలూరు మండలం వెంకటాపురం, కామవరపుకోట మండలం ఆడమిల్లి, ద్వారకతిరుమల మండలం గుండుగొలనుగుంట గ్రామాల్లో పర్యటిస్తారు
బలివే తీర్థానికి తమ్మిలేరు నీరు విడుదల
చింతలపూడి: మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని బలివే తీర్థానికి తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసినట్లు తమ్మిలేరు ఇరిగేషన్ డీఈ సీతారామ్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి 100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల చేశామని తెలిపారు. దాదాపు 40 కిలోమీటర్లు ప్రధాన కాల్వ ద్వారా ప్రయాణించి నడిపల్లి చెరువులోనికి చేరుతుందని చెప్పారు. అక్కడి నుంచి బలివేకు భక్తుల కోసం నీటిని వంతుల వారీగా తరలిస్తామన్నారు.
పెద్దింట్లమ్మ జాతరను విజయవంతం చేద్దాం
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆర్డీవో, జాతర నిర్వాహణ చైర్మన్ డాక్టర్ అచ్యుత అంబరీష్ చెప్పారు. మార్చి 1 నుంచి 13 వరకు జరిగే జాతర(తీర్థం) నిమిత్తం కొల్లేటికోట దేవస్థానం వద్ద రెండో విడత వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం జరిగింది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు ఎటువంటి అసౌక్యరాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అందరూ పనిచేయాలన్నారు. జాతర అన్ని రోజులు పారిశుద్ధ్య కార్మికులతో పాటు తాత్కలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓపీఆర్డీ చెప్పారు. ముందుగా జాతర గోడపత్రి, బుక్‌లెట్, కరపత్రాలను అవిష్కరించారు.
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ద్వారకాతిరుమల: గురుకులంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ీస్వీకరిస్తున్నట్టు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ బి.రాణి తెలిపారు. మార్చి 6తో ఈ గడువు ముగుస్తుందన్నారు. అర్హులైన విద్యార్థినులు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులు జారీ, అదే నెల 6న ఉదయం 10 గంటల నుంచి 5వ తరగతి ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment